
బరేలీలో బంధాలను కలుపుతున్న ‘సర్’
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ఓటర్ జాబితా పరిశీలన కార్యక్రమం అనుకోని భావోద్వేగ క్షణాలను తీసుకొస్తోంది. ఉత్తరప్రదేశ్ బరేలీలో జరుగుతున్న ఈ పక్రియ కుటుంబాల మధ్య దూరమైన బంధాలను కలుపుతోంది. ప్రేమ వివాహాలు చేసుకుని తర్వాత కుటుంబాలతో వేరుపడిన కొందరు పాత ఓటర్ వివరాల కోసం మళ్లీ తల్లిదండ్రులను సంప్రదిస్తున్నారు. ఫోన్లు చేసి వివరాలు తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా భావోద్వేగాలకు లోనవుతున్నారు. ఓవైపు సర్ వల్ల మరణాలు కలకలం రేపుతుంటే, మరో వైపు ఆత్మీయులను దగ్గర చేస్తోంది.
జోగి నవాడాకు చెందిన 40 సంవత్సరాల స్నేహలత 15 సంవత్సరాల క్రితం తన స్నేహితుడైన ఓంకార్ చౌదరితో పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన తర్వాత తల్లిదండ్రులు ఆమెతో సంబంధాలను తెంచుకున్నారు. కుటుంబం కేసు నమోదు చేసిన తర్వాత కూడా కోర్టులో ఆమె చౌదరికే మద్దతుగా నిలిచారు. ఇక అప్పటి నుంచి ఆమె తల్లిదండ్రులతో అన్ని సంబంధాలను పొగొట్టుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎస్ఐఆర్ డ్రైవ్‌లో, అధికారులు ఆమె 2003 ఓటర్ జాబితా ఆధారంగా ఈపీఐసీ ఐడీ అడిగారు. వివరాలు గుర్తు రాకపోవడంతో స్నేహలత పదిహేనేళ్ల తర్వాత తల్లిదండ్రులను ఫోన్ చేసి, పాత ఓటర్ జాబితా వివరాలు అడిగారు.
ఫారంలో మూడో కేటగిరీని ఎంచుకోవచ్చు
ఇలాంటి సందర్భాలు ప్రేమ వివాహాలకు సంబంధించినవే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ప్రక్రియ సజావుగా సాగుతోంది. ఎందుకంటే సమాచారం అంతా ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందని జిల్లా ఎన్నికల ఉపాధికారి/అదనపు జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు. అయితే వివరాలు లేని పరిస్థితిలో ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ఫారంలో మూడవ కేటగిరీని ఎంచుకోవచ్చని అధికారులు సూచించారు. అనేక సందర్భాల్లో ప్రేమ వివాహాల తర్వాత ఇంటిని వదిలిన మహిళలు, వ్యక్తులు తిరిగి తల్లిదండ్రులతో ఓటర్ వివరాల కోసం సంప్రదించాల్సి వచ్చిందని జిల్లా మొత్తం బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్వోలు) గుర్తించారు.
బులంద్‌షహర్‌కు చెందిన సులేఖ, ఇప్పుడు ఫరీద్‌పూర్ నివాసి నవాబ్ హసన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. తర్వాత ఇస్లాం స్వీకరించి రిహానాగా మారారు. దాదాపు 10 సంవత్సరాల పాటు తల్లిదండ్రులతో మాట్లాడలేదు. ఎస్ఐఆర్ ఫారంలో తన తండ్రి ఈపీఐసీ ఐడీ, 2003 ఓటర్ జాబితా వివరాలను అడిగినప్పుడు, ఆమె తల్లికి ఫోన్ చేసి భావోద్వేగభంగా మాట్లాడారు.
జిల్లా అధికారులు ఏం చెబుతున్నారు
తిరియా నిజావత్ ఖాన్ నగర్ పంచాయతీ (80శాతం జనాభా ముస్లింలు) లో అనేక ఇంటర్-ఫెయిత్, ఇంటర్-స్టేట్ ప్రేమ వివాహాలు నమోదయ్యాయి. వీటిలో పురుషులు డిల్లీ, జమ్మూ-కాశ్మీర్, బెంగాల్, బీహార్, ఒడిశా నుంచి వివాహం చేసుకుంటున్నారు. ఈ జంటలకు పూర్వీకుల చిరునామా, ఓటర్ ఐడీ వివరాలు అందించడం సవాలుగా మారింది.
పది సంవత్సరాల తర్వాత
బిత్రి చైన్‌పూర్ అసెంబ్లీలోని ఖేడా గ్రామ నివాసియైన రామవీర్ సింగ్ చెప్పినట్టు 10 సంవత్సరాల క్రితం తన కుమారుడు అవధేశ్ ప్రేమ వివాహం చేసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తర్వాత కుటుంబం మధ్య ఎలాంటి సంప్రదింపులు జరగలేదు. ప్రస్తుతం గుజరాత్ భవనగర్ నుంచి ఫోన్ చేసి 2003 ఓటర్ జాబితా వివరాలు అడిగి, ప్రస్తుత ఎన్నికల రోల్‌లో నమోదు కావాలన్నారు. ఆన్లా పార్లమెంటరీ నియోజకవర్గం కేశవ్ చెప్పినట్టు 9 సంవత్సరాల క్రితం తన కుమార్తె తన మామ గారి కుమారుడితో వెళ్లిపోయింది. ఇప్పుడు పాత వివరాల కోసం ఫోన్ చేయడంతో ఆమె మాటలు తల్లి హృదయాన్ని కదిలించాయి.
‘ఎస్ఐఆర్ కార్యక్రమం అనుకోకుండా ఒక భవిష్యత్తు బంధాన్ని పునరుద్ధరించే వంతెనగా మారింది. ఇది కుటుంబాల నుంచి దూరమైన వారిని కూడా తిరిగి కలుపుతోందని’ జిల్లా అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
