
బ్రహ్మోత్సవాలకు క్షేత్రస్థాయిలో ప్రణాళికలు
శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను పవిత్రంగా నిర్వహిస్తూ సాధారణ భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు సమగ్ర ఏర్పాట్లు చేశామని టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సూక్ష్మ, క్షేత్రస్థాయి ప్రణాళికలతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆయన చెప్పారు. శుక్రవారం తిరుమల అన్నమయ్య భవన్‌లో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరితో కలిసి జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, టీటీడీ విభాగాధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
2025 సాలకట్ల బ్రహ్మోత్సవాల కోసం జిల్లా పాలన, పోలీసులతో సమన్వయంతో ప్రణాళికలు రూపొందించారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఆభరణాల శుభ్రత, వాహనాల ట్రయల్ రన్ పూర్తయ్యాయి. వాహన సేవలు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు జరుగుతాయి. గరుడసేవ సాయంత్రం 6:30 నుంచి రాత్రి 12 గంటల వరకు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 24న ధ్వజారోహణం రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. సెప్టెంబర్ 25న పీఏసీ-5ను ప్రారంభిస్తారు. సివిల్ ఇంజినీరింగ్ పనులకు రూ. 9.50 కోట్లు, విద్యుద్దీపాలంకరణకు రూ.5.50 కోట్లు, దాతల విరాళాలతోరూ. 3.50 కోట్లతో 60 టన్నుల పుష్పాలతో అలంకరణ చేస్తారు. బ్రహ్మోత్సవాల సమయంలో సిఫార్సు లేఖలతో గదుల కేటాయింపు రద్దు చేసి, 3500 గదులను సాధారణ భక్తులకు ఆఫ్‌లైన్‌లో కేటాయిస్తారు. వాహన సేవలు, సాంస్కృతిక కార్యక్రమాల కోసం 36 ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. 1.16 లక్షల ప్రత్యేక దర్శన టికెట్లు, రోజూ 25 వేల ఎస్ఎస్డీ టోకెన్లు విడుదల చేస్తారు. అన్ని ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేసి, వీఐపీ బ్రేక్ దర్శనం స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే పరిమితం. రోజూ 8 లక్షల లడ్డూల బఫర్ స్టాక్ ఉంచుతారు.
20 హెల్ప్ డెస్కులు, ప్రతి గ్యాలరీలో భక్తుల అభిప్రాయాల కోసం శ్రీవారి సేవకులను నియమించారు. గరుడసేవ రోజున 14 రకాల వంటకాలు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కేంద్రంలో ఉదయం 8 నుంచి రాత్రి 11 గంటల వరకు అన్నం వడ్డిస్తారు. తిరుమలలో 24 ప్రాంతాల్లో 4000 వాహనాలకు, తిరుపతిలో అలిపిరి లింక్ బస్‌స్టాండ్, నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్, ఇస్కాన్ గ్రౌండ్, ఎస్వీ మెడికల్ కాలేజ్ గ్రౌండ్, భారతీయ విద్యాభవన్ గ్రౌండ్, దేవలోక్, ఏపీ టూరిజం ఓపెన్ ఏరియాల్లో 5250 ద్విచక్ర వాహనాలకు, 2700 కార్లకు పార్కింగ్ స్థలం కేటాయించారు. సాధారణ రోజుల్లో 1900 ఆర్టీసీ బస్ ట్రిప్పులు, గరుడసేవ రోజున 3200 ట్రిప్పులు నడుపుతారు. 2000 టీటీడీ భద్రతా సిబ్బంది, 4700 పోలీసు సిబ్బంది, 450 సీనియర్ అధికారులు, 3500 శ్రీవారి సేవకులు భక్తులకు సేవలందిస్తారు. 3000 సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్‌తో అనుసంధానం చేశారు. పారిశుద్ధ్యం కోసం 2300 సిబ్బందితో పాటు 960 మంది అదనపు సిబ్బందిని నియమించారు. కల్యాణకట్టలో 1150 మంది క్షురకులు తలనీలాల సమర్పణకు సిద్ధంగా ఉన్నారు. 28 రాష్ట్రాల నుంచి 298 బృందాలు సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తాయి. గరుడసేవ రోజున 20 రాష్ట్రాల నుంచి 37 బృందాలు సంప్రదాయ, ఆధ్యాత్మిక కళారూపాలను ప్రదర్శిస్తాయి. 60 డాక్టర్లు, 60 పారామెడికల్ సిబ్బంది, 14 అంబులెన్స్‌లతో వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. సమావేశంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ మౌర్య, జేఈవో వీరబ్రహ్మం, ఎస్పీ సుబ్బరాయుడు, సిఈ సత్య నారాయణ, తిరుమల ఏఎస్పీ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
