
బ్రాహ్మణుల అభివృద్ధి, సంక్షేమానికి కృషి
గతంలో ఎన్నడూ లేని విధంగా బ్రాహ్మణుల సంక్షేమం అభివృద్ధి కోసం కృషి చేస్తామని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కలపరుపు బుచ్చి రామ్ ప్రసాద్ తెలిపారు. గొల్లపూడిలోని బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్లో మంగళవారం రాష్ట్ర దేవదాయ శాఖా మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి సమక్షంలో చైర్మన్ గా కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ గతంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేశారని ఆలా నిర్వీర్యం చేసినా బ్రాహ్మణ కార్పొరేషన్ ను తిరిగి అన్ని పథకాలతో పునరుద్ధరిస్తామన్నారు. గతంలో ఎవరూ బ్రాహ్మణుల సంక్షేమాన్ని పట్టించుకున్నవారు లేరని ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రాహ్మణుల సంక్షేమం కోసం దేశంలోనే మొదటిసారిగా బ్రాహ్మణుల సంక్షేమాన్ని మానిఫెస్టోలో పెట్టారని తెలిపారు.
దేశంలోనే మొదటిసారిగా బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. బ్రాహ్మణుల సంక్షేమం కోసం అంకిత భావంతో పనిచేస్తానన్నారు. వెనుకబడిన తరగతుల కాలనీల్లో 1,000 హిందూ దేవాలయాలు,దేవాలయాల్లో ఆగమ శాస్త్రం ప్రకారం కమిటీలు వేశామని అన్నారు. హిందువుల దేవాలయాలపై జరుగుతున్న దాడులపై కూడా కమిటీ వేయాలని చూస్తున్నామన్నారు. వెనుకబడిన తరగతుల కాలనీల్లో 1,000 హిందూ దేవాలయాలు కట్టించాలని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణుల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయూత ఇవ్వడం జరుగుతుందని అన్నారు.
బ్రాహ్మణ కార్పొరేషన్ కు దేవదాయ శాఖ కూడా తన సహాయ సహకారాలను అందిస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వం బ్రాహ్మణుల పట్ల ఎంతో చేయూతను అందిస్తున్నదని, దేవాలయాల పాలకవర్గంలో బ్రాహ్మణులకు డైరెక్టర్ లుగా అవకాశం కల్పించేందుకు నిబంధనలు కూడా మార్చామని తెలిపారు. వేద పండితుల ఆర్థిక ఇబ్బందులను గమనించి రూ. 3 వేల నుంచి రూ. 6 వేలకు సంభావనను అందించామన్నారు. అర్చక వృత్తిలో ఉన్న బ్రాహ్మణులకు గౌరవ వేతనం రూ. 10 వేల నుంచి 15 వేలకు పెంచి అందిస్తున్నామని చెప్పారు. ధూప దీప నైవైద్యం క్రింద రూ. 5 వేల నుంచి 10 వేల వరకూ దేవాలయాలకు అందిస్తున్నామన్నారు. ధూప దీప నైవైద్యం పథకం క్రింద గతంలో కన్నా క్రొత్తగా 380 ఆలయాలు నిర్మించేందుకు మంజూరు చేశామని తెలిపారు. కార్యక్రమంలో నక్కా ఆనంద బాబు, ఏపి ఎన్ఆర్ఐ చైర్మన్ వేమూరి రవి, ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ ఎండి ఎం. చిన్నబాబు, సీఈవో నాగ సాయి, సీనియర్ మేనేజర్ హెచ్. ఆర్. ఎల్. శ్రీనివాస్, తదితర సిబ్బంది పాల్గొన్నారు.
