
బైబ్యాక్తో కంపెనీలకు మేలు.. ఇన్వెస్టర్లకు నష్టం!
ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ సంచలన నిర్ణయం తీసుకుంది. రూ.18000 కోట్ల విలువైన షేర్లను .. షేర్ హోల్డర్స్ నుంచి తిరిగి కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 16న ఇన్ఫోసిస్ షేరు రూ.1507 వద్ద ట్రేడ్ అవుతుంటే..కంపెనీ రూ.1800కు ఒక్కో షేరు కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే బై బ్యాక్ లో తమ షేర్లు అమ్ముకోవాలనుకుంటున్న ఇన్వెస్టర్లకు కొత్త పన్ను విధానం భారంగా మారుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
2024 అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త పన్ను విధానం ప్రకారం షేర్ బైబ్యాక్ లో పాల్గొన్న ఇన్వెస్టర్లకు వచ్చే ఆదాయంపై పన్ను వసూలు చేస్తారు. దీనిని ఇతర మార్గాల నుంచి వచ్చే ఆదాయం కింద పన్ను విధిస్తారు. 2024 అక్టోబర్ 1 తర్వాత బైబ్యాక్ ప్రక్రియ మొదలుపెట్టిన కంపెనీలు ఇక నుంచి పన్ను చెల్లించవు. ఇన్వెస్టర్లే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. బైబ్యాక్ ద్వార వచ్చే ఆదాయాన్ని సెక్షన్ 2(22)(F) ప్రకారం డివిడెండ్ ఆదాయంగా లెక్కిస్తారు. ఆదాయం ఎక్కువగా ఉన్న వ్యక్తులకు ఈ పన్ను 30 శాతానికి పైగా ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉదాహరణకు మీరు రూ.1000 రూపాయలతో ఇన్ఫోసిస్ షేరు కొనుగోలు చేసి ఉంటే.. కంపెనీ ఇప్పుడు రూ.1800 వద్ద షేరు తిరిగి కొనుగోలు చేయాలనుకుంటోంది. అప్పుడు మీకు వచ్చే రూ.1800పైన పన్ను విధిస్తారు.
అదే మీరు రూ.1000కి కొన్న షేరు బీఎస్ఈ,ఎన్ఎస్ఈ ఎక్చ్సేంజీల్లో రూ.1800 అమ్మినప్పుడు .. మీరు కేవలం రూ .800 లాభంపైనే కాపిటల్ గెయిన్ టాక్స్ తో పాటు సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ టాక్స్ చెల్లిస్తారు. కానీ బైబ్యాక్ లో రూ.1800 పైన పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ రకమైన పన్ను విధానం కంపెనీలకు మేలుచేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇన్వెస్టర్లు బైబ్యాక్ ప్రక్రియలో పాల్గొనకుండా నిరుత్సాహపరుస్తుందని భావిస్తున్నారు. సాధారణ ఇన్వెస్టర్లకు పన్ను భారం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనిపైన పునరాలోచించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
