Let's talk: editor@tmv.in
బాబోయ్...ఎన్ని నోట్ల కట్టలో!

బాబోయ్...ఎన్ని నోట్ల కట్టలో!

T Venkata Ramana
17 సెప్టెంబర్, 2025

ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణ నేపథ్యంలో విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ నివాసంతో పాటు ఆయన బంధువుల ఇంట్లో నిర్వహించిన సోదాల్లో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. అంబేద్కర్ బంధువుల ఇంట్లో లెక్కలేనంత డబ్బు బయటపడింది. ఆస్తులు కూడా భారీ స్థాయిలో వెలుగు చూశాయి. అంబేద్కర్ బంధువు ఇంట్లో రూ.2 కోట్ల నగదు పట్టుబడినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.

భారీగా బంగారం కూడా స్వాధీనం చేసుకున్నారు. రూ.2 కోట్ల నగదును చూసి ఏసీబీ అధికారులు విస్తుపోయారు. అన్ని రూ.500 నోట్ల కట్టలే ఉన్నాయి. రూ.200 నోట్ల కట్టలు ఒకట్రెండు ఉన్నాయి. ఈ నగదును లెక్కపెట్టేందుకు నోట్ల లెక్కింపు యంత్రాల సహాయం తీసుకున్నారు అధికారులు. అంబేద్కర్ కుటుంబ సభ్యుల ఇళ్లలో అధికారులు మొత్తం 15 బృందాలుగా విడిపోయి గచ్చిబౌలి , మాదాపూర్ , హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ జిల్లాల్లో పలుచోట్ల సోదాలు చేపట్టారు. ఈ క్రమంలో జరిగిన తనిఖీల్లో భారీ ఆస్తులు బయటపడ్డాయి. గచ్చిబౌలిలో ఖరీదైన భవనం గుర్తించినట్లుగా ఏసీబీ డీఎస్పీ ఆనంద్ వెల్లడించారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లా పెన్పహాడ్లో 10 ఎకరాల వ్యవసాయ భూమిని అంబేద్కర్ కొనుగోలు చేశారని పేర్కొన్నారు. అక్కడే మరో వెయ్యి గజాల్లో వ్యవసాయ క్షేత్రం కూడా ఉన్నట్లుగా గుర్తించామన్నారు.

ఫోటో రైటప్ : విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్

బాబోయ్...ఎన్ని నోట్ల కట్టలో! - Tholi Paluku