Let's talk: editor@tmv.in
బీబీఎల్‌లో ఆడనున్న అశ్విన్

బీబీఎల్‌లో ఆడనున్న అశ్విన్

Koripelli Aditya
25 సెప్టెంబర్, 2025

భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆస్ట్రేలియాలో ప్రతిష్ఠాత్మకమైన బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్)లోని రాబోయే సీజన్‌లో సిడ్నీ థండర్ జట్టుతో ఆడనున్నాడు. ఈ లీగ్‌లో ఆడే మొదటి భారత క్రికెటర్‌గా అశ్విన్ నిలవనున్నాడు. 39 ఏళ్ల అశ్విన్, ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి కూడా రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 'ఫాక్స్ స్పోర్ట్స్' నివేదిక ప్రకారం, అశ్విన్ సిడ్నీ థండర్ జట్టుతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఆ టీమ్ ఫ్రాంచైజీ ఈ వారంలో ప్రకటించబోతుంది.

ఈ నిర్ణయం భారత క్రికెట్ అభిమానులకు ఊహించని విధంగా అనిపించినప్పటికి, అతని స్పిన్ బౌలింగ్ ప్రదర్శన బీబీఎల్‌లో సిడ్నీ థండర్ జట్టుకు కొత్త ఊపును అందించనుంది. భారత టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకరైన అశ్విన్ రవిచంద్రన్, తన అనుభవంతో ఆస్ట్రేలియా టీ20 లీగ్‌లో కొత్త అధ్యాయాన్ని సృష్టించ బోతున్నారు.

సిడ్నీ థండర్ జట్టు అశ్విన్ గేమ్ మాత్రమే కాకుండా తన సలహాలని కూడా సద్వినియోగం చేసుకోవడం ద్వారా బీబీఎల్‌లో తమ క్రేజ్ పెంచుకోవాలని భావిస్తోంది. అశ్విన్ రాకతో జట్టు బౌలింగ్ విభాగం మరింత బలపడనున్నదని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సీజన్‌లో అతని ప్రదర్శన భారత క్రికెట్ అభిమానులతో పాటు ఆస్ట్రేలియా ప్రేక్షకులను కూడా ఆకట్టుకోవడం ఖాయం.

అశ్విన్ గతంలో ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ వంటి జట్లకు ఆడడం మాత్రమే కాకుండా, కింగ్స్ 11 పంజాబ్ టీమ్‌కు స్కిప్పర్‌గా కూడా చేసిన అనుభవం, ఈ లీగ్‌లో అతనికి సహాయపడనుంది. బీబీఎల్‌లో అశ్విన్ ఆటతీరు ఎలా ఉంటుందనే ఆసక్తి క్రికెట్ ప్రేక్షకులలో ఉత్కంఠంగా మారింది. సిడ్నీ థండర్, ఈ సీజన్‌లో అశ్విన్ నాయకత్వంలో ఏ విధంగా సాగనుందో చూడాలి మరి.

బీబీఎల్‌లో ఆడనున్న అశ్విన్ - Tholi Paluku