Let's talk: editor@tmv.in
బఫర్‌ ప్రమాణాల కంటే మూడు రెట్లు ఎక్కువ ధాన్య నిల్వలు: కేంద్రం

బఫర్‌ ప్రమాణాల కంటే మూడు రెట్లు ఎక్కువ ధాన్య నిల్వలు: కేంద్రం

Pinjari Chand
7 ఏప్రిల్, 2026

దేశంలో గోధుమలు, బియ్యం నిల్వలు ప్రభుత్వ బఫర్‌ ప్రమాణాల కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రజా పంపిణీ వ్యవస్థ అవసరాలతో పాటు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సరిపడా నిల్వలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు–ఆహారం–ప్రజా పంపిణీ శాఖలో ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ విభాగం జాయింట్ సెక్రటరీ సి. శిఖా మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో సుమారు 222 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు, 380 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వలుగా ఉన్నాయని తెలిపారు. మొత్తంగా కలిపి 602 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయని చెప్పారు. ఈ నిల్వలు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (పీడీఎస్‌) అవసరాలను తీర్చడమే కాకుండా ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో కూడా ఉపయోగపడతాయని ఆమె వివరించారు. ఆహార సరఫరా స్థిరంగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఇండోనేషియా, మలేషియా, రష్యా, ఉక్రెయిన్‌, అర్జెంటీనా, బ్రెజిల్‌ వంటి దేశాల నుంచి దిగుమతులు నిరంతరంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అదనంగా ఆవాల ఉత్పత్తి పెరగడంతో దేశీయంగా తినే నూనెల సరఫరా కూడా బలపడిందని తెలిపారు.

ఇదిలా ఉండగా కేంద్ర పోర్టులు, షిప్పింగ్‌ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ముకేశ్ మంగళ్ మాట్లాడుతూ పశ్చిమ ఆసియా ప్రాంతంలో ఉన్న భారతీయ సముద్ర సిబ్బంది సురక్షితంగా ఉన్నారని చెప్పారు. గత 24 గంటల్లో భారత జెండా ఉన్న నౌకలకు సంబంధించి ఎలాంటి ఘటనలు జరగలేదని తెలిపారు. గ్రీన్‌శాన్వీ ఎల్పీజీ ట్యాంకర్‌‌, గ్రీన్‌ ఆశా ఎల్పీజీ ట్యాంకర్‌‌ అనే రెండు భారత జెండా నౌకలు హోర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటాయని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం పశ్చిమ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో 16 భారత నౌకలు ఉండగా వాటిలో 433 మంది భారతీయ సముద్ర సిబ్బంది ఉన్నారని తెలిపారు. సముద్ర కార్యకలాపాలు నిరంతరం కొనసాగేందుకు విదేశాంగ మంత్రిత్వ శాఖ, విదేశాల్లోని భారత మిషన్లు, సముద్ర రంగ సంస్థలతో సమన్వయం కొనసాగుతోందని చెప్పారు. పశ్చిమ ఆసియా ప్రాంతంలో ఏర్పడుతున్న భద్రతా పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటివరకు సుమారు 5.98 లక్షల మంది ప్రయాణికులు భారత్‌కు తిరిగి వచ్చారని కూడా కేంద్ర అధికారులు వెల్లడించారు.