Let's talk: editor@tmv.in
బనకచర్ల వివాదం మళ్లీ తెరమీదకు

బనకచర్ల వివాదం మళ్లీ తెరమీదకు

Aravind Maryada Reddy
13 అక్టోబర్, 2025

బనకచర్ల వివాదం మరోసారి తెరమీదకు వచ్చింది. ఏపీ కట్టబోతున్న ఈ ప్రాజెక్టును మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నది ఆ పార్టీ వాదన. ఇక అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సైతం బనకచర్లను అడ్డుకుంటామని ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రానికి సాగునీటి కష్టాలు రావడానికి బీఆర్ఎస్ పార్టీయే కారణమని కాంగ్రెస్ ఆరోపణ. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పటి వైసీపీ నేతలతో కుమ్మక్కై తెలంగాణకు నీటి వాటా దక్కకుండా చేశారని ఆ పార్టీ ఆరోపించింది. తాజాగా హరీశ్ ఆరోపణలు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరణతో ఈ అంశం చర్చనీయాంంగా మారింది.

అయితే ఇటీవల ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ సిద్ధం చేసి ప్రాజెక్టులో కొంత పురోగతి సాధించినట్టు బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇంత జరుగుతున్నా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. దీంతో తాజాగా ఈ వివాదం మరోసారి వివాదం తెరమీదకు వచ్చింది. అసలు బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి వివాదం ఏమిటి? ఈ ప్రాజెక్టు కడితే తెలంగాణ ప్రాంతానికి నిజంగానే నష్టం జరుగుతుందా? లేదంటే బీఆర్ఎస్ కేవలం రాజకీయ ఉనికికోసమే ఈ వివాదాన్ని నెత్తికి ఎత్తుకున్నదా? అన్న అంశాలను ఈ కథనంలో తెలుసుకుందాం. బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం డీపీఆర్ (డీటెయిల్‌డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) సిద్ధం చేసేందుకు ముందుకు సిద్ధమువుతోందని.. ఇది తెలంగాణకు తీవ్ర నష్టం కలిగిస్తుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ అంశాలనే ప్రధానంగా తెరమీదకు తీసుకొస్తున్నారు.

బనకచర్ల ఎక్కడ నిర్మిస్తున్నారు?

బనకచర్ల ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో నిర్మిస్తున్నారు. గోదావరి జలాలను ఎత్తిపోతల ద్వారా తరలించి ఏపీలోని రాయలసీమ ప్రాంతంలో సాగునీరు అందించాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యంగా ఉంది. ఈ ప్రాజెక్టును పోలవరం ప్రాజెక్టుకు అనుసంధానం చేస్తున్నారు. అయితే గోదావరి జలాలను ఏపీ తరలించుకుపోతే తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం వాటిల్లుతుందన్నది తెలంగాణ రాష్ట్ర వాదన.

గోదావరి ప్రాజెక్టు మీద నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ వివాదాలు అలుముకున్నాయి. దీనికి తోడు కొత్తగా గోదావరి నదిపై తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులు కాళేశ్వరం మినహా కొత్త ప్రాజెక్టులు ఏమీ లేవు. కొన్ని ప్రాజెక్టులు నిర్మాణదశలోనే ఉన్నాయి. కాబట్టి బనకచర్ల ద్వారా ఏపీ ప్రభుత్వం గోదావరి జలాలను తరలించుకుపోతే తెలంగాణ రాష్ట్రానికి గోదావరి జలాల్లో వాటా తగ్గిపోతుందని తెలంగాణ అంటున్నది. ఇక ఏపీ మాత్రం తాము మిగులు జలాలు అంటే సముద్రంలో వృథాగా కలిసిపోయే జలాలతోనే ఈ ప్రాజెక్టును కడుతున్నామని చెబుతోంది.

ఏపీ వాదన ఏమిటి?

గోదావరి వరద జలాలను రాయలసీమకు తరలించేందుకే తాము బనకచర్ల ప్రాజెక్టును నిర్మించ తలపెట్టామని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ ప్రాజెక్టు ఏపీ పునర్విభజన చట్టానికి వ్యతిరేకమని చెబుతోంది. గోదావరి జల వివాదాల ట్రైబ్యునల్‌ అవార్డుకు ఈ ప్రాజెక్టు వ్యతిరేకం అని తెలంగాణ వాదిస్తోంది. ప్రతి ఏడాది వర్షాకాలంలో సముద్రంలో కలిసిపోతున్న సుమారు 2,000 టీఎంసీ వరద నీటిలో 200 టీఎంసీలను మాత్రమే రాయలసీమలోని ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తరలిస్తున్నామని ఏపీ చెబుతోంది. దీని కోసం రూ.80,112 కోట్లతో ప్రాజెక్టు ప్రతిపాదన చేశారు. 80 లక్షలమందికి తాగునీరు, 22 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, విద్యుత్ అవసరాలకు 4,000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన వ్యవస్థను ఏర్పాటు చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యంగా ఉంది.

ప్రాజెక్ట్‌ను ఎలా నిర్మించబోతున్నారు?

మొదటి దశలో పోలవరం కుడి కాలువ ద్వారా గోదావరి వరద నీటిని కృష్ణా నదికి తరలించడం. కుడికాలువ సామర్థ్యాన్ని 17,500 క్యూసెక్కుల నుండి 38,000 క్యూసెక్కులకు పెంచి, వరదకాలువతో నీటిని వైకుంఠపురం వరకు మళ్లిస్తారు. రెండో దశ నాగార్జునసాగర్‌ కుడి కాలువలోని నీటిని లిఫ్ట్ చేసి, పల్నాడు జిల్లా బొల్లాపల్లి వద్ద 150 టీఎంసీ సామర్థ్యం గల రిజర్వాయర్‌లో నిల్వ చేయడం. మూడో దశ బొల్లాపల్లి నుంచి నల్లమల అడవులలో 26.8 కిలోమీటర్ల సొరంగం ద్వారా బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌కు నీటిని తరలించడం. ప్రాజెక్టుకు 48,000 ఎకరాల భూసేకరణ అవసరం, అందులో 17,000 ఎకరాలు అటవీ భూమి. మొదటి దశకు రూ.13,511 కోట్లు, రెండో దశకు రూ.28,560 కోట్లు, మూడో దశకు రూ.38,041 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.

విభజన చట్టానికి వ్యతిరేకంగా బనకచర్లను నిర్మిస్తున్నారని తెలంగాణ వాదిస్తుంటే.. తాము కేవలం సముద్రంలో కలిసిపోయే మిగులుజలాల ఆధారంగానే ప్రాజెక్టు నిర్మిస్తున్నామని ఏపీ చెబుతోంది. అయితే బీఆర్ఎస్ పార్టీ ఈ వివాదాన్ని తన రాజకీయ ఉనికి కోసం తెరమీదకు తెస్తున్నదన్న అభిప్రాయాలు ఉన్నాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కోట్ల రూపాయలు వృథా చేసి ఇప్పుడు సాగునీటి విషయంలో తప్పుడు ప్రచారం చేశారని కాంగ్రెస్ వాదిస్తోంది. ఇలా ఈ బనకచర్ల అంశం రెండు పార్టీల నడుమ, రెండు రాష్ట్రాల నడుమ అత్యంత వివాదాస్పదమైన అంశంగా మారుతున్నది.

బనకచర్ల ఎప్పుడు పూర్తి కాబోతున్నది?

బనకచర్ల ప్రాజెక్టు 2018లో టీడీపీ కాలంలో “గోదావరి–పెన్నా నది లింక్ స్కీం”గా ఆలోచన రూపుదిద్దుకుంది. 2019 తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుకు పలు పేర్లు, రూపాలు మార్చారు. “పాల్నాడు కరువు నివారణ ప్రాజెక్టు” అనే పేరుతో భాగంగా దీనిని ప్రస్తావించారు. కానీ ముందుకు సాగలేదు.

బనకచర్ల ప్రాజెక్టు కోసం ఏపీ ప్రభుత్వం 2025 జూన్‌లో “జల హారతి కార్పొరేషన్” అనే ప్రత్యేక సంస్థని ఏర్పాటు చేయాలని భావించింది. ఈ కార్పొరేషన్ లో భాగంగా బనకచర్ల ప్రాజెక్టును పూర్తి చేయాలని అనుకున్నారు. బనకచర్ల పూర్తి చేయడానికి దాదాపుగా నాలుగేండ్లు గడువు పడుతుందని ప్రభుత్వం అంచనా వేసుకున్నది. 8 ఏప్రిల్ 2025లో ప్రభుత్వ జీవో 16 ద్వారా “జల హారతి కార్పొరేషన్” ఏర్పాటుకు ఆమోదం దక్కింది.

7 ఏప్రిల్ 2025వ సంవత్సరంలో గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు 17వ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల విభాగం ఇంజినీర్-ఇన్-చీఫ్ తెలిపిన ప్రకారం ప్రాజెక్టు ఇంకా కాన్సెప్ట్ దశలోనే ఉంది.

మే 2025లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కి “పోలవరంనుంచి బనకచర్ల లింక్ ప్రాజెక్టు” ప్రతిపాదనను సమర్పించారు. పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ కింద ఉన్న నిపుణుల కమిటీ ప్రాజెక్టు ప్రతిపాదనను తిరస్కరించింది. మరిన్ని వివరాలు, అంతర్రాష్ట్ర సంప్రదింపులు కావాలని సూచించింది.

వ్యతిరేకించిన తెలంగాణ

తెలంగాణ మంత్రివర్గం ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తీర్మానం చేసింది. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల మంత్రి మాత్రం ఈ ప్రాజెక్టు సముద్రంలో కలిసిపోయే జలాల మీద నిర్మించిందని చెప్పారు. ఏపీ ప్రభుత్వం ప్రాథమిక పనులు వేగంగా పూర్తి చేయాలని చర్యలు ప్రారంభించింది. న్యూఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఈ ప్రాజెక్టుపై అంతర్రాష్ట్ర చర్చలు కొనసాగాయి. ఈ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తుండటం, కేంద్రం నుంచి ఇంకా పూర్తి స్థాయిలో అనుమతులు రాకపోవడంతో ఎప్పటికి ఈ ప్రాజెక్టు పూర్తవుతుందో వేచి చూడాలి.

పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత స్థితి

2025 ఫిబ్రవరి నాటికి పోలవరం ప్రాజెక్టు సుమారు 55.90% వరకు పూర్తయింది. (2019 మేలో ఇది కేవలం 38.21% మాత్రమే). హెడ్‌వర్క్స్‌ సుమారు 76.43శాతం పూర్తయ్యాయి. పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యతతో ముందుకు తీసుకెళ్తోంది. డయాఫ్రామ్ వాల్ 2025 మధ్య నాటికి సుమారు 202 మీటర్లు నిర్మాణం పూర్తయింది. గ్యాప్–1 భాగం మార్చ్ 2026 నాటికి పూర్తవుతుందని అంచనా ఉంది. గ్యాప్–2 పనులు డిజైన్ ఆమోదం తర్వాత ప్రారంభం కానున్నాయి. గడువులోగా పూర్తి చేస్తామనే హామీలు ప్రభుత్వం ఇస్తోంది. ప్రాజెక్టు వల్ల నిరాశ్రయులైన కుటుంబాలకు 2027 నాటికి పునరావాసం కల్పిస్తాని ప్రభుత్వం తెలిపింది. డిసెంబర్ 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

పోలవరం ప్రాజెక్టు ముందున్న సవాళ్లు

వర్షాకాలం, వరదల ప్రభావం

సాంకేతిక సమస్యలు

నిధుల అందుబాటు

భూసేకరణ ఆలస్యం

పునరావాసం పూర్తి కాలేదు

కేంద్ర అనుమతుల ప్రక్రియలు

ఇటువంటి అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఇంకా పోలవరం ప్రాజెక్టే ఎప్పటికి పూర్తవుతుందో పూర్తి స్థాయిలో స్పష్టత లేదు. కానీ దానికి అనుసంధానంగా నిర్మించే బనకచర్ల ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో వేచి చూడాలి.

బనకచర్ల వివాదం మళ్లీ తెరమీదకు - Tholi Paluku