Let's talk: editor@tmv.in
బతుకమ్మ చీరలేవి?

బతుకమ్మ చీరలేవి?

Aravind Maryada Reddy
1 అక్టోబర్, 2025

గత బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ పండగ సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేసేది. తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలు అందరికీ ఈ చీరలు ఇచ్చేవారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో చీరలు పంపిణీ చేయడం లేదు. రేవంత్ ముఖ్యమంత్రి అయ్యాక తాము ఏడాదికి రెండు చీరలు పంపిణీ చేస్తామని గతంలో హామీ ఇచ్చారు. దీంతో మహిళలు ఆశలు పెట్టుకున్నారు. ఇదే అదనుగా బీఆర్ఎస్ పార్టీ చీరల పంపిణీ అంశాన్ని రాజకీయం చేస్తున్నది. రేవంత్ రెడ్డి ఇస్తానన్న రెండు చీరలు ఎక్కడ? అంటూ ప్రశ్నించింది. పల్లెటూర్లలోనూ అక్కడక్కడా మహిళలు చీరల గురించి స్థానిక నేతలను అడుగుతున్నట్టు సమాచారం.

బీఆర్ఎస్ పాలనలో పంపిణీ

తెలంగాణలో బతుకమ్మ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పండగ కేవలం మహిళలకు చెందిన ఓ ప్రత్యేకమైన ఉత్సవం. అందుకే ఈ పండగ సమయంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆడబిడ్డలకు చీరల పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ చీరల మీద అనేక విమర్శలు వచ్చాయి. కేసీఆర్ నాణ్యమైన చీరలు పంపిణీ చేయడం లేదని.. చాలా తక్కువ ధరకు బల్క్ లో కొనుగోలు చేసి.. సిరిసిల్ల చేనేత చీరలంటూ నమ్మిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. అంతేకాక ఈ చీరల వ్యవహారంలో అవినీతి దాగి ఉందని కూడా ఆయన విమర్శించారు. అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తాను రెండు సార్లు చీరలు పంపిణీ చేస్తానని ప్రకటించారు. గతంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలకు చీరలు పంపిణీ చేసేవారు. కానీ రేవంత్ మహిళా సంఘాల్లో ఉన్న సభ్యురాళ్లకు మాత్రం పంపిణీ చేస్తామన్నారు. కానీ ఆ హామీ కూడా నెరవేర లేదు.

రెండు చీరలు.. కానీ ఎక్కడా కనిపించలేదు

గత బీఆర్ఎస్ చీరలు "ఏమీ బాగాలేవు" అని విమర్శించిన రేవంత్ రెడ్డి తాము విలువైన నాణ్య చీరలు ఇస్తామని చెప్పారు. 2024లో కూడా ఈ హామీలు నెరవేరకపోవడంతో మహిళల్లో అసంతృప్తి ఏర్పడింది. 2025 సెప్టెంబర్ 5న ముఖ్యమంత్రి ఈ స్కీమ్‌ను మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులకు మాత్రమే పరిమితం చేస్తూ ప్రకటించారు. ప్రస్తుతం, బతుకమ్మ పండుగ ముగిసినా చీరల పంపిణీ ఆలస్యం అవుతోంది. "ఈసారి ఒక చీర ఇస్తాం, సంక్రాంతికి మరొకటి" అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. షెహ్‌జీ సభ్యులకు మాత్రమే పరిమితమైన ఈ పంపిణీ, రేషన్ కార్డు ధారకులందరికీ ఇచ్చిన గత కానీ ఇప్పటివరకు చీరలు ఎందుకు పంపిణీ చేయడం లేదని విమర్శలు వస్తున్నాయి.

మహిళల అసంతృప్తి

పల్లెటూర్లలో చీరలు రాకపోవడంతో మహిళలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. "బతుకమ్మకు చీరలు లేకపోతే పండుగ రుచి ఏముంటుంది?" అంటూ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్‌లోని ఒక మహిళ "రేవంత్ ఇస్తానన్న రెండు చీరలు ఎక్కడ? బీఆర్ఎస్ ఇచ్చిన చీరలు కనీసం ఉండేవి" అంటూ మండిపడింది. ఇక్కడే కాకుండా, మహిళా సంఘాల సభ్యులు కూడా తమకు కూడా చీరలు పంపిణీ చేయడం లేదని పేర్కొన్నది. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నాయకులు ఈ అంశాన్ని ప్రచారంలోకి తీసుకువచ్చారు. బీఆర్ఎస్ పార్టీ అధికారిక ఖాతా నుంచి "మార్పు మార్పు అని చెయ్యి గుర్తుకు ఓటేస్తే.. ఆగమాగం చేస్తున్నారు" అనే బతుకమ్మ పాట రూపంలో వీడియో పోస్ట్ చేశారు.

బీఆర్ఎస్, బీజేపీ చేతికి ప్రచారాస్త్రం

ఈ చీరల అంశం కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది. అయితే కేవలం చీరలు ఇవ్వని కారణంగా వ్యతిరేకత రాకపోవచ్చు. కానీ రాష్ట్రంలో ఇప్పటికే ఇతర సమస్యలకు సంబంధించిన అసంతృప్తి ఉంది. బీఆర్ఎస్ ఈ అంశాన్ని "గత పాలనలో చీరలు ఇచ్చాం, ఇప్పుడు రేవంత్ మరచారు" అని ప్రచారం చేస్తోంది. బీజేపీ కూడా "హిందూ మహిళల పండుగలపై కాంగ్రెస్ అవమానం" అని విమర్శిస్తోంది, భాగ్యలక్ష్మీ ఆలయంలో బతుకమ్మ ఉత్సవాలపై పరిమితులు విధించినందుకు కూడా దీన్ని లింక్ చేస్తోంది. స్థానిక స్థాయిలో, ఎమ్మెల్యేలు, ఎంపీలపై మహిళలు ఒత్తిడి తీసుకొస్తున్నట్టు సమాచారం.

తెలంగాణ సంస్కృతికి చిహ్నం బతుకమ్మ

బతుకమ్మ చీరలు కేవలం ఒక బహుమతి కాదు, తెలంగాణ మహిళల సంస్కృతి, గౌరవంతో ముడిపడి ఉన్నాయి. రేవంత్ రెడ్డి హామీలు నెరవేరకపోవడం ప్రభుత్వానికి ఊహించని దెబ్బ తీసుకొచ్చింది. బీఆర్ఎస్, బీజేపీలు దీన్ని ప్రచారాస్త్రంగా మలుస్తుంటే, కాంగ్రెస్ త్వరగా చర్యలు తీసుకోకపోతే మహిళల ఓటు బ్యాంకు దెబ్బ తప్పదు. ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. మరి కాంగ్రెస్ పార్టీ చీరల పంపిణీ విషయంలో ఎటువంటి వ్యతిరేకత వస్తుందో? అన్నది వేచి చూడాలి.

బతుకమ్మ చీరలేవి? - Tholi Paluku