
బతుకమ్మ… బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో
బతుకమ్మ.. ఇది కేవలం పూల పండుగ కాదు. ఇది తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి ప్రతీక. జీవన పోరాటంలో నిలిచిన ప్రతీ ఆడబిడ్డకు అది ఇచ్చే సాంత్వన. మట్టి, నీరు, పువ్వుల అనుబంధాన్ని చాటి చెప్పే అద్భుతమైన ఉత్సవం ఇది. "బతుకు అమ్మ" అని పలికే ప్రతీ గొంతులోనూ తమ జీవితాలు చల్లగా ఉండాలని కోరుకునే ఆకాంక్ష కనిపిస్తుంది. భాద్రపద అమావాస్య నుంచి దుర్గాష్టమి వరకు తొమ్మిది రోజుల పాటు తెలంగాణ గడప గడపనా పండుగ శోభ వెల్లివిరుస్తుంది. ఈ తొమ్మిది రోజులు తెలంగాణలో సందడే... సందడి.
తొమ్మిది రోజుల పూల పండుగ
బతుకమ్మ పండుగ భాద్రపద అమావాస్యతో ప్రారంభమై మహర్నవమి వరకు తొమ్మిది రోజుల పాటు కొనసాగుతుంది. ఈ తొమ్మిది రోజులు ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకమైన బతుకమ్మను పేరుస్తారు. ఆయా బతుకమ్మలకు ఒక్కో విభిన్న నైవేద్యం సమర్పిస్తారు. ఇవి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడతాయి.
1వ రోజు: ఎంగిలిపూల బతుకమ్మ
తిథి: భాద్రపద అమావాస్య (దీన్నే పెత్రామావాస్య అని కూడా అంటారు)
ప్రత్యేకత:ఈ రోజు గునుగు, తంగేడు పూలను మాత్రమే ఉపయోగిస్తారు.
బతుకమ్మకు నైవేద్యంగా నువ్వులు, బియ్యం పిండితో కలిపి చేసిన సత్తు పిండిని సమర్పిస్తారు.
2వ రోజు: అటుకుల బతుకమ్మ
తిథి: ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి.
ప్రత్యేకత: ఈ రోజు అటుకులు, బెల్లం, పాలు కలిపి నైవేద్యం పెడతారు.
3వ రోజు : ముద్దపప్పు బతుకమ్మ
తిథి: ఆశ్వయుజ శుద్ధ విదియ.
ప్రత్యేకత: నైవేద్యంగా ముద్దపప్పు, పాలు, బెల్లం సమర్పిస్తారు.
4వ రోజు: నానబియ్యం బతుకమ్మ
తిథి: ఆశ్వయుజ శుద్ధ తదియ
ప్రత్యేకత: నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం సమర్పిస్తారు.
5వ రోజు: అట్ల బతుకమ్మ
తిథి: ఆశ్వయుజ శుద్ధ చవితి.
ప్రత్యేకత: ఈ రోజు అట్లు లేదా దోసెలు నైవేద్యంగా పెడతారు
6వ రోజు : అలిగిన బతుకమ్మ
తిథి: ఆశ్వయుజ శుద్ధ పంచమి.
ప్రత్యేకత: ఈ రోజున నైవేద్యం సమర్పించరు. బతుకమ్మ ఆడరు. అందుకే దీనిని 'అలిగిన బతుకమ్మ' అంటారు.
7వ రోజు: వేపకాయల బతుకమ్మ
తిథి: ఆశ్వయుజ శుద్ధ షష్ఠి.
ప్రత్యేకత: బియ్యం పిండిని వేపకాయల ఆకారంలో చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.
8వ రోజు: వెన్నముద్దల బతుకమ్మ
తిథి: ఆశ్వయుజ శుద్ధ సప్తమి (దుర్గాష్టమి ముందు రోజు)
ప్రత్యేకత: నువ్వులు, వెన్న, బెల్లంతో చేసిన నైవేద్యం గౌరమ్మకు సమర్పిస్తారు.
9వ రోజు: సద్దుల బతుకమ్మ
తిథి: ఆశ్వయుజ శుద్ధ అష్టమి (దుర్గాష్టమి)
ప్రత్యేకత: ఇది బతుకమ్మ పండుగకు చివరి రోజు.
ఆ రోజున బతుకమ్మను అన్ని రకాల పూలతో అత్యంత శోభాయమానంగా పేరుస్తారు. తొమ్మిది రకాల సద్దులను (నైవేద్యాలను) సమర్పిస్తారు. ఈ సద్దులలో పెరుగన్నం, పులిహోర, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం, నిమ్మకాయ అన్నం, వేరుశనగ పప్పు అన్నం, చక్కెర అన్నం వంటివి ఉంటాయి.
పువ్వులతో అద్భుత కలయిక
బతుకమ్మ తయారీలోనే ప్రకృతి పట్ల మనకున్న ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది. గునుగు, తంగేడు, బంతి, చామంతి వంటి పూలనే ఈ పండుగలో ఎక్కువగా ఉపయోగిస్తారు. గునుగు పూలు గులాబీ రంగులో, తంగేడు పూలు పసుపు రంగులో ఉంటాయి. వీటితో పాటు ఇతర స్థానిక పూలనూ చేర్చి రాగి తాంబూలంలో వలయాకారంగా, గోపుర ఆకారంలో పేర్చుతారు. మధ్యలో గౌరమ్మను పసుపు ముద్దతో చేసి ప్రతిష్ఠిస్తారు.
మహిళల ఐక్యతకు ప్రతీక
సాయంత్రం వేళల్లో ఆడబిడ్డలంతా కొత్త దుస్తులు ధరించి ఒకచోట చేరి బతుకమ్మలను మధ్యలో ఉంచుతారు. ఆ తర్వాత వాటి చుట్టూ తిరుగుతూ, పాటలు పాడుతూ గౌరమ్మను కీర్తిస్తారు. ఈ పాటల్లో పురాణ గాథలు, కుటుంబ అనుబంధాలు, మహిళల కష్ట సుఖాలు అన్నీ మిళితమై ఉంటాయి. ఈ ఉత్సవం మహిళలందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తుంది.బతుకమ్మ ఆట పూర్తయ్యాక, మహిళలు బతుకమ్మలను ఊరేగింపుగా చెరువులు, నదులు లేక ఇతర జల వనరుల వద్దకు తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు. దీనివల్ల పూలలోని ఔషధ గుణాలు నీటిలో కలిసి, నీటిని శుద్ధి చేస్తాయని నమ్మకం. ఇది మన సంస్కృతిలో ఉన్న ప్రకృతి ఆరాధనా తత్వాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని తెలియజేస్తుంది.
సాంస్కృతిక పునరుజ్జీవనం
బతుకమ్మ పండుగ కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు. ఇది తెలంగాణ ఉద్యమానికి కూడా ఒక కీలక శక్తిగా నిలిచింది. తెలంగాణ సంస్కృతిని, భాషను చిన్నచూపు చూస్తున్న తరుణంలో, "మా బతుకమ్మ మాకుంది" అంటూ ప్రజలు తమ ఆత్మగౌరవాన్ని చాటి చెప్పారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఈ పండుగకు అధికారిక గుర్తింపు లభించింది. రాష్ట్ర పండుగగా ప్రకటించడమే కాకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తోంది. ఈ బతుకమ్మ వేడుకలు కేవలం తెలంగాణకే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తూ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్నారు. ఇది ఒకప్పుడు పల్లె గడపలకే పరిమితమైన పండుగ కాగా నేడు ప్రభుత్వ లాంఛనాలతో ప్రపంచ వేదికలపై కీర్తి ప్రతిష్టలు అందుకుంటూ తెలంగాణకు ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తోంది. బతుకమ్మ కేవలం పండుగ కాదు. అది ఒక జీవన వేదం, ఒక సాంస్కృతిక వారసత్వం, మహిళల ఐక్యతకు దర్పణం.
ముస్తాబైన ఆలయం
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మ సంబరాలు నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొదలుకానున్నాయి. బతుకమ్మ ప్రారంభ వేడుకలకు చారిత్రక వేయి స్తంభాల గుడిని ముస్తాబు చేశారు. బతుకమ్మ ఆరంభ వేడుకలో తెలంగాణ పర్యాటక శాఖ, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. సకల జనులు, సబ్బండ వర్ణాలు కలిసి ఏకత్వ స్ఫూర్తిని చాటేలా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు రూపొందించింది. చారిత్రక ప్రదేశాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, వారసత్వ కట్టడాలు, పర్యాటక ప్రాంతాల్లో 9 రోజుల పాటు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసిందని మంత్రి జూపల్లి తెలిపారు.
బతుకమ్మ ఉత్సవాల షెడ్యూల్
సెప్టెంబర్ 21వ తేదీన
•వేయి స్తంభాల గుడి, వరంగల్ – బతుకమ్మ ప్రారంభోత్సవం (సాయంత్రం)
• అదే రోజు ఉదయం హైదరాబాద్ శివారులో మొక్కలు నాటడం
సెప్టెంబర్ 22వ తేదీన
•శిల్పరామం, హైదరాబాద్
•పిల్లలమర్రి, మహబూబ్‌నగర్
సెప్టెంబర్ 23వ తేదీన
•బుద్ధవనం, నాగార్జునసాగర్, నల్గొండ
సెప్టెంబర్ 24వ తేదీన
•కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం, భూపాలపల్లి
•సిటీ సెంటర్, కరీంనగర్
సెప్టెంబర్ 25వ తేదీన
•భద్రాచలం ఆలయం- కొత్తగూడెం, ఖమ్మం
•జోగులాంబ అలంపూర్, గద్వాల
•స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, హైదరాబాద్ – బతుకమ్మ ఆర్ట్ క్యాంప్ (సెప్టెంబర్ 25వ తేదీ నుంచి సెప్టెంబర్ 29 వరకు)
సెప్టెంబర్ 26వ తేదీన
•అలీ సాగర్ రిజర్వాయర్, నిజామాబాద్
•ఆదిలాబాద్, మెదక్
•నెక్లెస్ రోడ్, హైదరాబాద్ – సైకిల్ ర్యాలీ (ఉదయం)
సెప్టెంబర్ 27వ తేదీన
•మహిళల బైక్ ర్యాలీ - నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్ (ఉదయం)
•ఐటీ కారిడార్, హైదరాబాద్ – బతుకమ్మ కార్నివాల్ (సాయంత్రం)
సెప్టెంబర్ 28వ తేదీన
•ఎల్బీ స్టేడియం, హైదరాబాద్ – గిన్నీస్ వరల్డ్ రికార్డ్ (10 వేల మంది మహిళలతో 50 అడుగుల బతుకమ్మ)
సెప్టెంబర్ 29వ తేదీన
•పీపుల్స్ ప్లాజా, హైదరాబాద్ – ఉత్తమ బతుకమ్మ పోటీల నిర్వహణ
• రెసిడెంట్ వెల్పేర్ అసోసియేషన్స్, హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఎంటర్ ప్రైజెస్ అసోషియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతాల్లో బతుకమ్మ పోటీలు
సెప్టెంబర్ 30వ తేదీన
• హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ – గ్రాండ్ ఫ్లోరల్ పరేడ్, వింటేజ్ కారు ర్యాలీ, బతుకమ్మ లైటింగ్ ఫ్లోట్స్, ఇకెబానా - జపనీయుల ప్రదర్శన, సెక్రటేరియట్‌పై త్రీడీ మ్యాప్ లేజర్ షో నిర్వహిస్తారు.
