Let's talk: editor@tmv.in
బతుకమ్మ, దసరాకు 7,754 ప్రత్యేక బస్సులు

బతుకమ్మ, దసరాకు 7,754 ప్రత్యేక బస్సులు

T Venkata Ramana
19 సెప్టెంబర్, 2025

బతుకమ్మ, దసరా పండగ సమీపిస్తున్న వేళ తెలంగాణ ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది. 7,754 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలిపింది. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 2 వరకు స్పెషల్ సర్వీసులు అందుబాటులోకి వస్తాయని ప్రకటించింది. ప్రజలను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎండీ సజ్జనార్ వెల్లడించారు.

బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ప్రజలకు రవాణాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఈ పండుగలకు రాష్ట్రవ్యాప్తంగా 7,754 స్పెషల్ బస్సులను బస్సులను నడపడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. అందులో 377 స్పెషల్ సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించింది.

ఈనెల 20 నుంచి

ఈ నెల 20 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రత్యేక బస్సులను నడపనుంది. సద్దుల బతుకమ్మ ఈ నెల 30న, దసరా అక్టోబర్ 2న ఉన్నందున ఈ నెల 27 నుంచే సొంతూళ్లకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముండటంతో ఆ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచనుంది. అలాగే తిరుగు ప్రయాణానికి సంబంధించి అక్టోబర్ 5, 6వ తేదీల్లోనూ రద్దీకి అనుగుణంగా బస్సులను సంస్థ ఏర్పాటు చేయనుంది.

ప్రధాన బస్టాండ్ల నుంచి

హైదరాబాద్లో ప్రధాన బస్టాండ్లైన ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్ తో పాటు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే కేపీహెచ్ బీ కాలనీ, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను సంస్థ నడిపించనుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు ఈ ప్రత్యేక బస్సులు నడుపుతోంది.

ఛార్జీల్లో మార్పులు

దసరా స్పెషల్ బస్సుల్లో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 16 ప్రకారం తిరుగు ప్రయాణంలో ఖాళీగా వచ్చే బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చుల మేరకు టికెట్ ధరలను సంస్థ సవరించనుంది. ఈ నెల 20తో పాటు 27 నుంచి 30 తేదివరకు వరకు, అలాగే అక్టోబర్ 1, 5, 6 వ తేదిల్లో నడిచే స్పెషల్ బస్సుల్లోనే సవరణ ఛార్జీలు అమల్లో ఉంటాయి. ఆయా రోజుల్లో తిరిగే రెగ్యూలర్ సర్వీసుల చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదు. అవి యధావిధిగా ఉంటాయి.

ఈసారి అదనంగా 617 బస్సులు

బతుకమ్మ, దసరా పండుగల దృష్ట్యా ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి సంస్థ సంసిద్ధంగా ఉందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. గత దసరా కంటే ఈ సారి అదనంగా 617 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంప్ లను ఏర్పాటు చేసి ప్రయాణికులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. ముఖ్యంగా ఎల్బీనగర్, ఉప్పల్, ఆరాంఘర్, కేపీహెచ్బీ, సంతోష్ నగర్ తదితర ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం షామియానాలు, కుర్చీలు, తాగునీరు, తదితర మౌలిక సదుపాయాలతో పాటు పబ్లిక్ అడ్రస్ సిస్టంను ఏర్పాటు చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని సజ్జనార్ తెలిపారు. ప్రతి రద్దీ ప్రాంతం వద్ద పర్యవేక్షణ అధికారులను నియమిస్తున్నామని, ప్రయాణికుల రద్దీని బట్టి వారు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచుతారని చెప్పారు. పోలీస్, రవాణా, మున్సిపల్ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యంగా సంస్థ అన్ని చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. పండుగలకు రద్దీ ఎక్కువగా ఉందని వైట్ నంబర్ ప్లేట్ గల ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించి ఇబ్బందులు పడొద్దని ఆయన సూచించారు. టీజీఎస్ఆర్టీసీలో ఎంతో అనుభవం గల డ్రైవర్లు ఉన్నారని, వారు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తారని చెప్పారు.

బతుకమ్మ, దసరాకు 7,754 ప్రత్యేక బస్సులు - Tholi Paluku