
బండి సంజయ్పై పరువు నష్టం దావా
తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర మంత్రి బండి సంజయ్పై పరువు నష్టం దావా వేశారు. తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ బండి సంజయ్పై రూ.10 కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేశారు. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో దాఖలైన ఈ పిటిషన్ను న్యాయస్థానం డిసెంబర్ 15కి వాయిదా వేసింది.
ఎందుకీ వివాదం
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బండి సంజయ్ గతంలో కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ బ్యూరో ను కేటీఆర్ సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా కేసీఆర్ దగ్గర పనిచేసిన మంత్రులు, ప్రముఖులు, జర్నలిస్టులు, సినిమా వాళ్లు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని సంజయ్ ఆరోపించారు. అంతేకాకుండా గ్రూప్-1 పేపర్ లీకేజీ ఆందోళన సమయంలో తన ఫోన్ను ట్యాప్ చేసి పోలీసులు ముందే తన ఇంటికి వచ్చారని, ఈ కేసును విచారించిన న్యాయమూర్తి ఫోన్ను కూడా ట్యాప్ చేశారని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు జరుగుతుండగా బండి సంజయ్ చేసిన ఈ ఆరోపణలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.
లీగల్ నోటీసు నుంచి...
బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కేటీఆర్ ఆయనకు ఆగస్ట్ 12న లీగల్ నోటీస్ పంపారు. తనపై చేసిన నిరాధార ఆరోపణలకు 48 గంటల్లోగా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అయితే ఈ నోటీసుపై బండి సంజయ్ స్పందించకపోవడంతో కేటీఆర్ పరువు నష్టం దావా వేసేందుకు నిర్ణయించుకున్నారు.
ఇదే అంశంపై గతంలో బండి సంజయ్ మాట్లాడుతూ కేటీఆర్, కేసీఆర్ లాంటి వారి దగ్గర పనిచేసిన మంత్రుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని, ఎస్ఐబీని తమ ఇష్టానుసారం వాడుకున్నారని విమర్శించారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపడినప్పటి నుంచి బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. బండి సంజయ్ ఆరోపణలు, వాటిపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేయడం ఈ రాజకీయ వివాదాన్ని మరింత పెంచాయి.ఫోన్ ట్యాపింగ్ కేసుతో ఇబ్బందులు పడుతున్న బీఆర్ఎస్ పార్టీ, బండి సంజయ్ వంటి బీజేపీ నాయకుల విమర్శలను ఎదుర్కొంటూనే ఉంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ న్యాయపోరాటం రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కోర్టు విచారణ ముందుకు సాగుతున్న కొద్దీ ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. డిసెంబర్ 15న సిటీ సివిల్ కోర్టులో జరిగే తదుపరి విచారణపై అందరి దృష్టి నెలకొంది.
