
బడ్జెట్2026… సీఎం ఢిల్లీ యాత్రల ఫలితం ఏమిటి?: కేటీఆర్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ మరోసారి తెలంగాణ పట్ల కేంద్ర సర్కార్‌కు ఉన్న వివక్షను బట్టబయలు చేసింది. పునరావాస చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన రాజ్యాంగబద్ధమైన కేటాయింపులు, ప్రాజెక్టుల విషయంలో కేంద్రం మరోసారి మొండిచేయి చూపడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదిక ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఢిల్లీ యాత్రలు ఏమయ్యాయి?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు 60 సార్లు ఢిల్లీ పర్యటనలు చేసినా, ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులను కలిసినా రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని కేటిఆర్ విమర్శించింది. ఈ పర్యటనల ద్వారా రాష్ట్రానికి చేకూరిన ఒక్క రూపాయి ప్రయోజనాన్ని కూడా చూపలేకపోవడం శోచనీయం. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే ఈ యాత్రలు పరిమితమయ్యాయని ఆయన ఆరోపించారు. ఈ ఢిల్లీ పర్యటనల వల్ల రాష్ట్రానికి ఏం సాధించాం? అనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
గత 12 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, ప్రత్యేక హామీలను కావాలని పక్కన పెడుతూ వస్తోందన్నారు. పార్లమెంట్ ఆమోదించిన బిఫర్కేషన్ హామీలను అమలు చేయడంలో బీజేపీ పూర్తిగా విఫలమైంది అని పేర్కొన్నారు. ఈ బడ్జెట్ కూడా కేంద్ర ప్రభుత్వ వివక్షతా ధోరణికి మరో నిదర్శనంగా నిలిచిందని తెలిపారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, హైదరాబాద్ మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్, కొత్త రైల్వే లైన్లు, వరంగల్‌లో కోచ్ ఫ్యాక్టరీ, ఐఐఎం స్థాపన, బయ్యారం స్టీల్ ప్లాంట్, మెగా టెక్స్టైల్ పార్క్ వంటి కీలక డిమాండ్లను కేంద్రం మరోసారి పూర్తిగా విస్మరించింది.
ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే తెలంగాణ నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు, అలాగే కాంగ్రెస్ ఎంపీల మౌనం. ఇతర రాష్ట్రాల ప్రతినిధులు తమ రాష్ట్రాలకు భారీ కేటాయింపులు సాధిస్తుంటే, తెలంగాణ గొంతు ఢిల్లీలో పూర్తిగా బలహీనంగా మారిందని కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ బడ్జెట్ మరోసారి స్పష్టం చేసింది,జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు తెలంగాణ ప్రయోజనాలను కాపాడలేవు. రాష్ట్ర హక్కులు, వనరులు, గౌరవాన్ని సాధించగల శక్తి బలమైన ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్‌కే ఉందని ఈ సందర్భం రుజువు చేస్తోందని కేటీఆర్ తెలిపారు. బడ్జెట్ అన్యాయంపై చర్చ జరగకుండా ఉండేందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాలనే ఇతర రాజకీయ డ్రామాలకు తెరలేపిందని ఆయన మండిపడ్డారు.
