Let's talk: editor@tmv.in
బడ్జెట్ 2026: 7 హైస్పీడ్ రైలు కారిడార్ల మ్యాప్‌లో తెలంగాణ

బడ్జెట్ 2026: 7 హైస్పీడ్ రైలు కారిడార్ల మ్యాప్‌లో తెలంగాణ

Gaddamidi Naveen
2 ఫిబ్రవరి, 2026

కేంద్ర బడ్జెట్ 2026లో తెలంగాణ రైల్వే రంగానికి మ‌రో ముంద‌డుగు ప‌డింది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలను అనుసంధానిస్తూ 7 కొత్త హైస్పీడ్ రైలు కారిడార్లను నిర్మించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ 3 ప్రధాన కారిడార్లతో అనుసంధానం కాబోతుండటం విశేషం.

కేంద్ర బడ్జెట్‌లో భాగంగా పర్యావరణ అనుకూలమైన, వేగవంతమైన ప్రయాణాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది.

తెలంగాణకు లాభం చేకూర్చే హైస్పీడ్ రైల్ కారిడార్లు ఇవి:

• హైదరాబాద్ – బెంగళూరు

• పుణే – హైదరాబాద్

• హైదరాబాద్ – చెన్నై

ఇవే కాకుండా దేశవ్యాప్తంగా అభివృద్ధిని వేగవంతం చేసేలా కింది కారిడార్లు కూడా ప్రకటించారు.

• ముంబై – పుణే

• చెన్నై – బెంగళూరు

• ఢిల్లీ – వారణాసి

• వారణాసి – సిలిగురి

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మౌలిక సదుపాయాల కల్పనను ఒక 'ఎకనామిక్ మల్టిప్లైయర్'గా పరిగణిస్తున్నట్లు కేంద్ర‌మంత్రి బండి సంజ‌య్ త‌న ఎక్స్ లో పేర్కొన్నారు. ఈ కారిడార్లు కేవలం వేగవంతమైన ప్రయాణానికే కాకుండా, పర్యావరణ అనుకూల రవాణాను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఉన్నాయి. తక్కువ సమయంలో ప్రజల ప్ర‌యాణం, ప్రాంతీయ అభివృద్ధిని ఈ ప్రాజెక్టులు వేగవంతం చేస్తాయని పేర్కొన్నారు.

వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా వార్షిక గణాంకాలకు అతీతంగా, సుదీర్ఘ కాలం పాటు దేశ సామర్థ్యాన్ని పెంచే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ హైస్పీడ్ రైళ్ల రాకతో హైదరాబాద్ నుంచి దక్షిణ భారతదేశంలోని ప్రధాన నగరాలకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది.

ఆర్థిక వృద్ధికి ఊతం

ఈ హైస్పీడ్ రైలు కారిడార్లు కేవలం వేగవంతమైన ప్రయాణానికే పరిమితం కాకుండా, 'వికసిత్ భారత్' లక్ష్యంలో భాగంగా ఆర్థిక చోదకాలుగా పనిచేస్తాయి. పర్యావరణ హితమైన రవాణా వ్యవస్థను నిర్మించడం, ప్రాంతీయ అభివృద్ధిని వేగవంతం చేయడం పారిశ్రామిక వృద్ధిని రెట్టింపు చేయడం ఈ ప్రాజెక్టుల ప్రధాన ఉద్దేశ్యం. గంటకు 250-300 కి.మీ పైగా వేగంతో ప్రయాణించే ఈ రైళ్ల వల్ల భవిష్యత్తులో విమాన ప్రయాణానికి ప్రత్యామ్నాయంగా రైల్వే రంగం అవతరించనుంది.

బడ్జెట్ 2026: 7 హైస్పీడ్ రైలు కారిడార్ల మ్యాప్‌లో తెలంగాణ - Tholi Paluku