Let's talk: editor@tmv.in
బడ్జెట్ సమతుల్యత - అభివృద్ధి మధ్య సమన్వయం

బడ్జెట్ సమతుల్యత - అభివృద్ధి మధ్య సమన్వయం

Shashank Sekhar
14 మార్చి, 2026

నీతి ఆయోగ్ విడుదల చేసిన ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2026 భారత రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి, వారి ప్రజా ఆర్థిక వ్యవస్థల స్థిరత్వంపై తాజా దృశ్యాన్ని అందించింది. 2023-24 ఆర్దిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక గణాంకాల ఆధారంగా రూపొందించిన ఈ నివేదికలో 67.8 స్కోర్‌తో ఒడిశా మొదటి స్థానంలో నిలిచింది, తరువాత ఛత్తీస్‌గఢ్, గోవా ఉన్నాయి. ఈ రాష్ట్రాలు బలమైన ఆదాయ సమతుల్యత, మితమైన రుణభారం, మెరుగైన ప్రజా వ్యయ నాణ్యతను కొనసాగించగలిగిన రాష్ట్రాలుగా గుర్తించబడ్డాయి.

ఈ ఎడిషన్‌లో ముఖ్యమైన మార్పుగా ఉత్తర-తూర్పు హిమాలయ రాష్ట్రాలను ప్రత్యేక విశ్లేషణ వర్గంగా మొదటిసారి చేర్చడం జరిగింది. దీని వల్ల విభిన్న ఆర్థిక పరిస్థితుల మధ్య మరింత సమగ్ర, సున్నితమైన పోలికలు సాధ్యమయ్యాయి. మరోవైపు పట్టిక చివర్లో పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు కొనసాగుతున్న ఆర్థిక ఒత్తిడిని ప్రతిబింబిస్తున్నాయి. అధిక రుణభారం, పెరుగుతున్న వడ్డీ చెల్లింపులు, అభివృద్ధి ఖర్చులకు పరిమిత ఆర్థిక స్థలం వంటి అంశాలు వీటి బలహీన స్థితికి కారణాలుగా పేర్కొనబడ్డాయి.

గత ఎడిషన్‌లో కూడా ఒడిశా అగ్రస్థానంలో నిలవడం, ఆ రాష్ట్రం దీర్ఘకాలంగా పాటిస్తున్న ఆర్థిక క్రమశిక్షణను సూచిస్తుంది. గోవా, ఛత్తీస్‌గఢ్ వంటి ఇతర రాష్ట్రాలు కూడా ఉన్నత స్థాయిలోనే కొనసాగాయి. ఈ నివేదిక 18 ప్రధాన రాష్ట్రాల ఆర్థిక పనితీరును ఆదాయ సేకరణ, రుణ స్థిరత్వం, ఆర్థిక క్రమశిక్షణ, ప్రజా వ్యయ నాణ్యత వంటి సూచికల ఆధారంగా విశ్లేషించింది. ఈ సూచికల సమ్మిళిత స్కోర్ ద్వారా రాష్ట్రాల ఆర్థిక స్థితిపై స్పష్టత పెంచడం, విధాన నిర్ణేతలకు అవసరమైన సంస్కరణల దిశను సూచించడం లక్ష్యంగా ఈ సూచిక రూపొందించబడింది.

సూచిక ఆర్థిక బలాన్ని ఎలా కొలుస్తుంది

ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ రాష్ట్రాల ఆర్థిక స్థితిని ఐదు ప్రధాన స్తంభాల ఆధారంగా కొలుస్తుంది. వీటిలో అత్యధిక బరువు వ్యయ నాణ్యతకు 30శాతం ఉంది. ఇది రాష్ట్ర వ్యయంలో ఎంత భాగం మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, విద్య వంటి ఉత్పాదక మూలధన పెట్టుబడులకు వెళ్తుందో అంచనా వేస్తుంది.

రెవెన్యూ మొబిలైజేషన్ (20శాతం) రాష్ట్రాలు తమ స్వంత పన్నులు, ఇతర ఆదాయ వనరుల ద్వారా ఎంత ఆదాయం సమీకరిస్తున్నాయో కొలుస్తుంది. ఫిస్కల్ ప్రూడెన్స్ (20శాతం) రాష్ట్రాలు ఆర్థిక లోటు లక్ష్యాలను ఎంతవరకు పాటిస్తున్నాయో,వార్షిక బడ్జెట్ నిర్వహణలో ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నాయో పరిశీలిస్తుంది. డెబ్ట్ ఇండెక్స్ (15శాతం) రాష్ట్ర రుణాల పరిమాణం, డెబ్ట్-టు-GSDP నిష్పత్తి, వడ్డీ భారం వంటి అంశాలను విశ్లేషిస్తుంది. డెబ్ట్ సస్టైనబిలిటీ (15శాతం) రాష్ట్రాలు దీర్ఘకాలంలో తమ రుణ బాధ్యతలను అభివృద్ధి ఖర్చులను తగ్గించకుండా చెల్లించగల సామర్థ్యాన్ని అంచనా వేస్తుంది. ఈ ఐదు స్తంభాలు కలిపి రాష్ట్రాల ఆర్థిక నిర్వహణను సమగ్రంగా అంచనా వేస్తాయి.

ఉత్తర-తూర్పు, హిమాలయ రాష్ట్రాల ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సూచిక విధానంలో మార్పులు చేశారు. ఈ ప్రాంతాల్లో భౌగోళిక కష్టతర పరిస్థితులు, విస్తరించిన జనాభా, తక్కువ స్వీయ ఆదాయ సామర్థ్యం, అధిక స్థిర వ్యయాలు ఉన్నందున సంప్రదాయ పోలికలు సరిపోవు. అందుకే పబ్లిక్ సర్వీస్ డెలివరీ ఖర్చులు, యూనియన్ బదిలీలపై ఆధారపడటం, వాటి అస్థిరత, ఆదాయ సామర్థ్యం వంటి అదనపు సూచికలు చేర్చారు. ఫలితంగా 10 ఉత్తర-తూర్పు, హిమాలయ రాష్ట్రాలకు ప్రత్యేక ర్యాంకింగ్ రూపొందించబడింది.

నివేదికపై సమగ్ర దృశ్యం

ఒడిశా, గోవా ,ఝార్ఖండ్ రాష్ట్రాలు “అచీవర్” వర్గంలో ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో మొత్తం ఆదాయంలో 60శాతం కు పైగా స్వంత పన్ను ఆదాయం ఉండగా, జీస్డీపీలో 4నుంచి 5 వరకు మూలధన వ్యయం కనిపిస్తుంది.

గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ ,కర్ణాటక రాష్ట్రాలు ఉన్నత స్థాయి వర్గంలో కొనసాగుతున్నాయి. తెలంగాణలో స్వల్ప మెరుగుదల కనిపించగా, ఆంధ్రప్రదేశ్‌లో అధిక లోటు ,వ్యయ ఒత్తిళ్ల కారణంగా ఆర్థిక ఒత్తిడి కొనసాగుతోంది.

ఉత్తర-తూర్పు ,హిమాలయ రాష్ట్రాలను కూడా అచీవర్స్ (అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్), పెర్ఫామర్స్ (అస్సాం, మేఘాలయ, మిజోరం, సిక్కిం, త్రిపుర) ,ఏఎస్పిరేషనల్ స్టేట్స్ (హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్)గా వర్గీకరించారు. ఈ వర్గంలో అరుణాచల్ ప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది.

అగ్రస్థాన రాష్ట్రాల విజయానికి కారణాలు

67.8 స్కోర్‌తో ఒడిశా అగ్రస్థానంలో నిలవడానికి ప్రధాన కారణాలు దృఢమైన రుణ నిర్వహణ, తక్కువ ఆర్థిక లోటు ,స్థిరమైన ఆదాయ మిగులు. ముఖ్యంగా ఖనిజ రాయల్టీలు ,మైనింగ్ ప్రీమియంల ద్వారా అధిక నాన్-టాక్స్ ఆదాయం రాష్ట్రానికి బలమైన ఆదాయ వనరుగా ఉంది. గోవాలో పర్యాటకం ,సేవల రంగం ద్వారా అధిక స్వంత ఆదాయం లభించడం ఆర్థిక స్థిరత్వాన్ని పెంచింది. ఝార్ఖండ్ కూడా అధిక మూలధన వ్యయం ,మెరుగైన ఆదాయ సేకరణ ద్వారా తన ఆర్థిక స్థితిని బలపరచుకుంది.

దిగువ రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఆర్థిక ఒత్తిడి

పంజాబ్ అత్యధిక రుణభారం ఎదుర్కొంటున్న రాష్ట్రాలలో ఒకటి. రాష్ట్ర డెబ్ట్-టు-జీఎస్డీపీ నిష్పత్తి 45శాతం కు పైగా ఉంది. వడ్డీ చెల్లింపులు, జీతాలు ,పెన్షన్లకు పెద్ద భాగం వెళ్తుండటంతో అభివృద్ధి ఖర్చులకు తక్కువ స్థలం మిగులుతోంది.

పశ్చిమ బెంగాల్ ,కేరళ కూడా ఇలాంటి నిర్మాణాత్మక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. అధిక స్థిర వ్యయాలు ,పెద్ద రుణభారం కారణంగా మూలధన పెట్టుబడులకు పరిమిత వనరులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

ఆర్థిక ఆరోగ్యం ఎందుకు ముఖ్యమైంది

ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ రుణాలు పెరుగుతున్న సమయంలో రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్యం దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వానికి కీలకం అని నివేదిక పేర్కొంది. తక్కువ లోటు, మితమైన రుణభారం ,అధిక మూలధన వ్యయం ఉన్న రాష్ట్రాలు అభివృద్ధి ఖర్చులను స్థిరంగా కొనసాగించగలవు.

ఇదే సమయంలో అధిక రుణాలు ,స్థిర వ్యయాలు ఉన్న రాష్ట్రాల్లో వడ్డీ చెల్లింపులు, జీతాలు ,పెన్షన్లు బడ్జెట్‌లో పెద్ద భాగాన్ని ఆక్రమించి అభివృద్ధి పెట్టుబడులను తగ్గించే ప్రమాదం ఉంది.

రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి నివేదిక కొన్ని కీలక సూచనలు చేసింది. వాటిలో పన్ను ఆధారాన్ని విస్తరించడం, GST సహా రాష్ట్ర పన్నులలో అనుసరణ మెరుగుపరచడం, రెవెన్యూ వ్యయాల కంటే మూలధన వ్యయాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఉన్నాయి.

అలాగే ఫిస్కల్ రెస్పాన్సబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ పరిధిలో ఆర్థిక లోటు పరిమితులను పాటించడం, మెరుగైన రుణ నిర్వహణ పద్ధతులను అమలు చేయడం అవసరమని నివేదిక పేర్కొంది.

మొత్తానికి రాష్ట్రాలు తమ అభివృద్ధి లక్ష్యాలను సాధించాలంటే ఆర్థిక క్రమశిక్షణ ,దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం మధ్య సమతుల్యతను సాధించాల్సిందేనని నివేదిక స్పష్టం చేసింది.