Let's talk: editor@tmv.in
బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో మంత్రి నిమ్మల

బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో మంత్రి నిమ్మల

Dantu Vijaya Lakshmi Prasanna
3 ఏప్రిల్, 2026

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కలెక్టరేట్‌లో నిర్వహించిన బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్ర జనాభాలో ఏపీ వాటా 58 శాతం కాగా, వనరుల కేటాయింపులో కేవలం 46 శాతం మాత్రమే దక్కిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అసమానత వల్ల రాష్ట్రం మొదటి నుంచీ ఆర్థిక లోటుతోనే ప్రయాణం చేయాల్సి వచ్చిందని ఆయన వివరించారు.

రాష్ట్ర విభజన కంటే కూడా గత ఐదేళ్ల వైసీపీ పాలన వల్లే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిందని మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి, ఆర్థిక వ్యవస్థను 'వెంటిలేటర్' మీదకు చేర్చిందని విమర్శించారు. అభివృద్ధిని పక్కనపెట్టి కేవలం తాడేపల్లి, ఇడుపులపాయ ఖజానాలను నింపుకోవడమే లక్ష్యంగా గత పాలకులు పనిచేశారని, రాష్ట్ర ఖజానాను పూర్తిగా లూటీ చేసి, కూటమి ప్రభుత్వానికి 'చిల్లు కుండ'ను అప్పగించి వెళ్లారని ఆయన ఘాటుగా విమర్శించారు.

పుంజుకుంటున్న ఆర్థిక వ్యవస్థ - జీఎస్‌డీపీ వృద్ధి

వైసీపీ హయాంలో కుదేలైన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోందని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న సమర్థవంతమైన చర్యల వల్ల 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ 11.89 శాతం జీఎస్‌డీపీ వృద్ధిని సాధించిందని ఆయన వెల్లడించారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఈ స్థాయి వృద్ధిని నమోదు చేయడం తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని ఆయన గర్వంగా ప్రకటించారు.

స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 'స్వర్ణాంధ్ర విజన్ 2047' లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో 15 శాతం వృద్ధి రేటును సాధించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ విజన్ ద్వారా రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలపడానికి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామికాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన వివరించారు.

గత ప్రభుత్వం చేసిన అప్పులకు భారీగా వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ, కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తోందని మంత్రి నిమ్మల తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 'సూపర్ సిక్స్' హామీలను అమలు చేస్తూనే, మరోవైపు రాష్ట్రాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు నిరంతరాయంగా అందుతాయని ఆయన భరోసా ఇచ్చారు.