Let's talk: editor@tmv.in
బడ్జెట్‌‌లో హామీలకు నిధులు కేటాయించాల్సిందే: హరీష్ రావు డిమాండ్

బడ్జెట్‌‌లో హామీలకు నిధులు కేటాయించాల్సిందే: హరీష్ రావు డిమాండ్

Gaddamidi Naveen
21 ఫిబ్రవరి, 2026

తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. శుక్రవారం సిద్దిపేట పట్టణంలోని 37వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన, ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లో ప్రజలకిచ్చిన హామీలకు తక్షణమే నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

800 రోజులు దాటినా.. ఆరు గ్యారెంటీలు ఎక్కడ?

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రజలకు ఇచ్చిన హామీలకు తగిన నిధులు కేటాయించాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను ఆయన డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సగం కాలం పూర్తయిందని, ఎన్నికల సమయంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, రేవంత్ రెడ్డి కలిసి బాండ్ పేపర్లపై రాసిచ్చి 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే 100 రోజులు కాదు, 800 రోజులు గడిచినా ఆ గ్యారెంటీలు అమలవుతున్న ఆనవాళ్లు కనిపించడంలేదని ఆయ‌న‌ విమర్శించారు.

ఎస్సీ డిక్లరేషన్ పేరిట దళితులకు 18 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ సబ్ ప్లాన్ అమలు చేస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. టెన్త్ పాస్ అయితే రూ.10,000, ఇంటర్‌కు రూ.25,000, డిగ్రీకి రూ.50,000, పీజీకి రూ.1 లక్ష ఇస్తామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు ఒక్క విద్యార్థికి కూడా రూపాయి అందలేదన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కూడా చెల్లించడం లేదని ఆయ‌న‌ అన్నారు.

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఏటా రూ.20,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని ప్రకటించి, అధికారంలోకి వచ్చాక ఆ హామీలను విస్మరించారని విమర్శించారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో ఏటా రూ.15,000 రైతుబంధు, పంటల బీమా, అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి రైతులను మోసం చేశారని ఆయ‌న‌ పేర్కొన్నారు.

పెన్షన్ల విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. గతంలో రూ.200 ఉన్న పెన్షన్‌ను కేసీఆర్ రూ.2,000కు పెంచారని, తాము అధికారంలోకి వచ్చాక రూ.4,000 ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. 27 నెలలు గడిచినా ఆ పెన్షన్ అమలు కాలేదన్నారు. బీడీ కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఎయిడ్స్ బాధితులు, గీత, చేనేత కార్మికులకు వెంటనే రూ.4,000 పెన్షన్ కల్పించేలా బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని ఆయ‌న డిమాండ్ చేశారు.

బడ్జెట్ వాస్తవికంగా ఉండాలి..

గత బడ్జెట్‌లో గొప్పగా ప్రసంగాలు దంచి, బల్లలు చరిచి చెప్పిన పథకాలు ఏవీ అమలు కాలేదని ఆయన గుర్తు చేశారు. కనీసం ఈ బడ్జెట్‌నైనా అంకెల గారడీ లేకుండా, వాస్తవాల ఆధారంగా రూపొందించాలని కోరారు. మహిళలకు రూ. 2500 వృద్ధులకు రూ. 4000 పెన్షన్ అంశాలకు బడ్జెట్‌లో నిధులు పొందుపరచకపోతే అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఎండగడతామని బీఆర్ఎస్ పక్షాన హరీష్ రావు హెచ్చరించారు.