
బడ్జెట్‌లో బీసీలకు 20,000 కోట్లు కేటాయించాలని కేటీఆర్ డిమాండ్
తెలంగాణలోని బీసీల రిజర్వేషన్ల అంశంతో పాటు, బీసీలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న "ద్రోహం" పై పార్టీ తీరును ఎక్కడికక్కడ నిలదీస్తామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణ భవన్‌లో బీసీ ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలతో జరిగిన సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ఎన్నికల ముందు బీసీ డిక్లరేషన్ పేరిట ఇచ్చిన హామీలను కాంగ్రెస్ తుంగలో తొక్కేసి, అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క హామీ కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. తెలంగాణ బీసీలకు జరిగిన అన్యాయం పై ఢిల్లీలో పెద్ద ఎత్తున పోరాటం చేయనున్నట్లు ప్రకటించారు.
రాహుల్ గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు
కేటీఆర్ మాట్లాడుతూ, ఎలాంటి రిజర్వేషన్ల పెంపు జరగకముందే తెలంగాణలో 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చినట్లు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ప్రచారం చేయడం మోసపూరితమని విమర్శించారు. నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే, లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ వెంటనే పార్లమెంటులో చర్చకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సవాల్ విసిరారు.బీజేపీ సహకరించకుంటే ప్రైవేట్ మెంబర్ బిల్లైనా ఎందుకు ప్రవేశపెట్టరు? బీసీల హక్కుల కోసం రాహుల్ గాంధీ నిజంగా కట్టుబడి ఉంటే ఇది పెద్ద సమస్యే కాదు అని కేటీఆర్ ప్రశ్నించారు.
బీజేపీపైనా ఎద్దేవా
బీజేపీ పదేపదే బీసీల సంక్షేమం గురించి మాట్లాడుతుంటే, అమలు విషయంలో మాత్రం పూర్తిగా వైఫల్యం చెందిందని కేటీఆర్ విమర్శించారు. రిజర్వేషన్ల నుంచి నిధుల కేటాయింపు, ఓబీసీ సంక్షేమ శాఖ ఏర్పాటు వరకు ప్రతి అంశంలో కేంద్ర ప్రభుత్వం ద్రోహం చేసిందని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్‌పై ఒత్తిడి తెస్తామని హెచ్చరిక
బీసీ డిక్లరేషన్‌లో చేసిన కీలక హామీలను కాంగ్రెస్ పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని కేటీఆర్ మండిపడ్డారు. ముఖ్యంగా విద్య, ఉపాధి, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 42 శాతం రిజర్వేషన్ల హామీ ప్రతి సంవత్సరం 20,000 కోట్లు బడ్జెట్ కేటాయింపు ఈ రెండింటిపై కాంగ్రెస్ ఒక్క అడుగు కూడా వేయలేదని ఆయన తెలిపారు. రాబోయే బడ్జెట్‌లో బీసీ సంక్షేమానికి రూ.20,000 కోట్లు కేటాయించేలా పార్టీ ఒత్తిడి తెస్తుందని కేటీఆర్ ప్రకటించారు.
పార్లమెంట్‌లో గళం లేవనెత్తాలని సూచన
రానున్న పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ నుంచి ఎన్నికైన బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఈ అంశాన్ని తప్పనిసరిగా లేవనెత్తాలని కేటీఆర్ కోరారు. బీసీలకు జరిగే అన్యాయం విషయంలో అన్ని పార్టీలూ రాజకీయాలకు అతీతంగా స్పందించాలని సూచించారు.
గ్రామ స్థాయికి ఉద్యమాన్ని విస్తరించాలి
బీసీ రిజర్వేషన్ల అంశాన్ని గ్రామ స్థాయి వరకు వివిధ రూపాల్లో ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ మోసపూరిత ధోరణి ప్రజలకు అర్థమయ్యేలా భారీ ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగేందుకు అవసరమైన కార్యాచరణపై మార్గదర్శకాలు కూడా కేటీఆర్ అందజేశారు. బీసీల హక్కుల కోసం బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా పోరాటానికి సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.
రాష్ట్రంలోని బీసీలు కేసీఆర్ వెంటే ఉన్నారు మాజీమంత్రి హరీష్ రావు
బీఆర్ఎస్ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్ర నిర్మాణం తర్వాత బీసీ వర్గాల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలు దేశ చరిత్రలో ఏ ఇతర ప్రభుత్వం చేయలేనంత విస్తృతంగా అమలయ్యాయని పేర్కొన్నారు. కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వాలు బీసీ సముదాయానికి చేసిన మేలును ప్రజలు మరువలేరని, అందుకే రాష్ట్రంలోని ఎక్కువ శాతం బీసీలు నేడు కేసీఆర్ వెంటే నిలబడ్డారని ఆయన పేర్కొన్నారు.తెలంగాణలో సంప్రదాయ కుల వృత్తుల పునరుద్ధరణకు పెద్దపీట వేసిన ప్రభుత్వంగా కేసీఆర్ నాయకత్వం నిలిచిందని హరీష్ రావు గుర్తుచేశారు. మత్స్యకారులు, నాయీ బ్రాహ్మణులు, వడ్రంగులు, కమ్మర్లు వంటి వృత్తివర్గాల అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలు, ఆర్థిక సహాయాలు అందించడమే కాకుండా, విద్యా రంగంలో బీసీ విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలు, విద్యాసంస్థలు భారీ ఎత్తున ఏర్పాటు చేయడం వల్ల సముదాయం ఆత్మవిశ్వాసం పెరిగిందని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ మోసాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తాం: తలసాని
సమావేశానికి అధ్యక్షత వహించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తోందని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ధోరణిని ప్రజల ముందుకు తీసుకువెళ్లడానికి పార్టీ పట్టు బిగుస్తుందని వెల్లడించారు. ఇందుకు సంబంధించి కార్యాచరణను త్వరలోనే పార్టీ శ్రేణులకు అందజేస్తామని ఆయన తెలిపారు.ఈ సమావేశంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, జోగు రామన్న, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
