
‘బడి బాట’లో ఉపాధ్యాయుడిగా భువనగిరి జిల్లా కలెక్టర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు,రాష్ట్రంలో జరుగుతున్న మధ్యాహ్న భోజన అమలు,ఆహార సమస్యలు మొదలైన వాటిపై ఈ సందర్బంలో యాదాద్రి, భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు మంగళవారం రోజు తన అధికారపు హోదాను పక్కన పెట్టి,ఉపాధ్యాయుడిగా, విద్యార్థిగా మారి అందరినీ ఆకట్టుకున్నారు.‘బడి బాట’ కార్యక్రమం భాగంగా ఆయన పోచంపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు.
మధ్యాహ్న భోజన పథకం అమలు పరిస్థితిని పరిశీలిస్తూ,విద్యార్థులతో కలిసి భోజనం క్యూలో నిలబడి,వారి పక్కనే కూర్చుని భోజనం చేశారు.ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో ఆప్యాయంగా మాట్లాడి,వారి సమస్యలు తెలుసుకున్నారు.భోజనానికి వడ్డించిన ఆహారం మెనూకు అనుగుణంగా ఉందో లేదో,నాణ్యత బాగుందో స్వయంగా తనిఖీ చేశారు.
గణిత బోధన, పరీక్షల సలహాలు
కలెక్టర్ నేరుగా తరగతి గదిలోకి వెళ్లి గణితశాస్త్ర ఉపాధ్యాయుడిగా మారి పదో తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించారు.వారిలో చదువుపై ఆసక్తి పెంచేలా ప్రేరణనిచ్చారు. రాబోయే వార్షిక పరీక్షలకు సక్రమంగా సిద్ధమయ్యే విధానాన్ని వివరించారు.టీవీ,మొబైల్ మాయాజాలాల నుంచి దూరంగా ఉండి పాఠాలపై దృష్టి పెట్టాలని సూచించారు.100 శాతం ఫలితాలు సాధించే విద్యార్థులకు 200సైకిళ్లు బహుమతిగా అందజేస్తామని,అలాగే వారి తల్లిదండ్రులను సన్మానిస్తామని ప్రకటించారు.
సమస్యల పరిష్కారం, ప్రోత్సాహకాలు
విద్యార్థులు తాగునీటి,మరుగుదొడ్ల కొరతల గురించి కలెక్టర్‌కు తెలిపారు.దీనిపై వెంటనే స్పందించిన ఆయన కొత్త టాయిలెట్లు నిర్మించేలా,తాగునీటి సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.అలాగే అధ్యాపకులు పాఠశాలకు వాచ్‌మన్ లేనందున కొంతమంది తెలియని వ్యక్తులు ఇటీవల రాత్రి వేళల్లో పాఠశాలలోకి ప్రవేశించి అల్లరి చేస్తున్నారని వివరించారు.దీనిపై వెంటనే స్పందించిన కలెక్టర్,చౌటుప్పల్ ఏసీపీకి ఫోన్ చేసి పాఠశాల పరిసరాల్లో ప్రతిరోజు పోలీస్ పహారా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యార్థులతో కలెక్టర్ గడిపిన ఈ రోజు అందరికీ ఒక ప్రేరణగా నిలిచింది.కర్తవ్యబద్ధత, దయ, వినయం సమ్మిళితమైన నాయకత్వ పాఠంగా ఆయన సందర్శన నిలిచింది.
