Let's talk: editor@tmv.in
బడి పిల్లల కంటి రక్షణలో ఏపీ భేష్ :

బడి పిల్లల కంటి రక్షణలో ఏపీ భేష్ :

Panthagani Anusha
17 జనవరి, 2026

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి అద్దాలు పంపిణీ చేయడంలో ఏపీ ప్రభుత్వం చూపుతున్న చొరవను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ (జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమం) కొనియాడింది. గత రెండేళ్లుగా రాష్ట్రంలో అమలు చేస్తున్న వినూత్న విధానాలు, లక్ష్య సాధనలో చూపిస్తున్న వేగం ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని కేంద్రం తన నివేదికలో పేర్కొంది. ఏపీలోని 'బెస్ట్ ప్రాక్టీసెస్ ను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు త్వరలోనే ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేస్తామని వెల్లడించడం రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా నిలిచింది.

ఇక రాష్ట్రం సాధించిన ఈ అద్భుత ప్రగతిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం, 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏపీకి కేటాయించిన వార్షిక లక్ష్యాన్ని భారీగా పెంచింది. కాగా గతంలో ఉన్న 90 వేల లక్ష్యాన్ని ఏకంగా 2.50 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ఘనత సాధించడంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో అంకితభావంతో పనిచేసిన అధికారులను, సిబ్బంది ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ విద్యార్థుల ఆరోగ్య సంరక్షణలో రాజీ పడకుండా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.

పకడ్బందీ ప్రణాళికతో కంటి పరీక్షలు

కంటి పరీక్షల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పకడ్బందీ ప్రణాళికను అనుసరిస్తోంది. 6 నుంచి 18 ఏళ్ల లోపు విద్యార్థులకు పారా మెడికల్ ఆఫాల్మిక్ అధికారుల ద్వారా ప్రతి ఏటా జూలై నుంచి నవంబర్ వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో ఈ ఖర్చును భరిస్తుండగా ప్రతి కంటి అద్దానికి గరిష్ఠంగా రూ. 280 వరకు వెచ్చిస్తున్నారు. కేవలం పరీక్షలు నిర్వహించడమే కాకుండా అద్దాల నాణ్యత విషయంలోనూ రాజీ పడకుండా 'లెన్సో మీటర్' ద్వారా పరీక్షలు నిర్వహించి నాణ్యమైన వాటినే విద్యార్థులకు అందజేస్తున్నారు.

రాష్ట్రంలో ఈ కార్యక్రమం లక్ష్యానికి మించి విజయవంతం కావడంలో స్వచ్ఛంద సంస్థల సహకారం కూడా మరువలేనిదని అధికారులు తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరంలో 90 వేల లక్ష్యానికి గాను ఏకంగా 1.89 లక్షల మందికి అద్దాలు పంపిణీ చేయడం విశేషం. ప్రస్తుత ఏడాదిలోనూ ఇప్పటికే 94 వేల మందికి పైగా విద్యార్థులకు సేవలందించారు. పెరిగిన కొత్త లక్ష్యం (2.50 లక్షలు) ద్వారా 2026-27లో సుమారు రూ. 7.70 కోట్ల వ్యయంతో మరింత మంది పేద విద్యార్థులకు కంటి చూపు ప్రసాదించేందుకు మార్గం సుగమమైంది.