Let's talk: editor@tmv.in
బడ్డీల తొలగింపు పై ఆగ్రహం

బడ్డీల తొలగింపు పై ఆగ్రహం

FL - YUGDR
23 సెప్టెంబర్, 2025

విశాఖ నగరంలో చిరు వ్యాపారుల కడుపు కొడుతూ జీవీఎంసీ చేపట్టిన తోపుడు బండ్లు, బడ్డీలు తొలగింపు పై దక్షిణ నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవీఎంసీ ప్రాంతంలో దక్షిణ వైసీపీ శ్రేణులతో కలిసి సోమవారం ఆపరేషన్ స్టమక్ పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ జీవీఎంసీ అధికారులు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తొలగించడం దుర్మార్గమన్నారు. నమ్మి ఓటు వేసి గెలిపించినందుకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పేదల కడుపు కొడుతున్నారని మండిపడ్డారు. పరిపాలన చేతకాకపోతే గద్దె దిగిపోవాలన్నారు. ఎన్నికల ముందు ప్రశ్నిస్తామంటూ ప్రసంగాలతో ఊగిపోయిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవి పొంది సినిమాలకు మొగ్గు చూపిస్తున్నాడని వాసుపల్లి ఎద్దేవా చేశారు. 40 ఏళ్ల రాజకీయ ఇండస్ట్రీ అబద్దాల చంద్రబాబు ముందు నుండి పేదలు అట్టడుగు కులాలు వారు అంటే చిన్న చూపేనని వాసుపల్లి అన్నారు. కూటమి ప్రభుత్వం తక్షణమే పేదల పొట్ట కొట్టే బడ్డీలు తొలగింపులు ఆపకపోతే వారికి అండగా వైసిపి పోరాటం చేయడానికి సిద్ధమని వాసుపల్లి తెలిపారు.స్టేట్ క్రిస్టియన్ మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ బోలవరపు జాన్ వెస్లీ, స్టేట్ అధికార ప్రతినిధి కొండ రాజీవ్ గాంధీ,వైస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి రామానంద్, పడాల సూర్య ,మాణిక్యం శ్రీను,లండ త్రినాధ్ తదితరులు పాల్గొన్నారు.

బడ్డీల తొలగింపు పై ఆగ్రహం - Tholi Paluku