
బిట్ కాయిన్తో ట్రంప్ స్వర్ణ విగ్రహం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్తల్లోకెక్కారు. అమెరికా క్యాపిటల్ భవనం సమీపంలో 12 అడుగుల ఎత్తున్న ట్రంప్ బంగారు విగ్రహాన్ని ప్రదర్శించారు. ఈ విగ్రహంలో ట్రంప్ చేతిలో బిట్కాయిన్ పట్టుకొని ఉండటం విశేషం. ఫెడరల్ రిజర్వ్ 25 బేసిస్ పాయింట్ల వడ్డీరేటు కోత ప్రకటించిన సమయంలో ఈ విగ్రహ ఏర్పాటు జరిగింది. ఇది ట్రంప్ క్రిప్టో కరెన్సీలకు మద్దతిచ్చే వైఖరిని సూచిస్తుందని విశ్లేషకులు అంటున్నారు.
డిజిటల్ కరెన్సీకి ప్రాముఖ్యత పెంచేందుకే
ఈ విగ్రహం ఏర్పాటుకు క్రిప్టోకరెన్సీ పెట్టుబడిదారుల బృందం నిధులు సమకూర్చినట్లు తెలుస్తోంది. వారు ఈ విగ్రహం ద్వారా డిజిటల్ కరెన్సీల భవిష్యత్తు, ద్రవ్య విధానాలు, ప్రభుత్వ ఆర్థిక విధానాలపై చర్చను రేకెత్తించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ బృందంలోని సభ్యుడు హిచెం జగ్డౌడి మాట్లాడుతూ "ఈ విగ్రహం ఆర్థిక ఆవిష్కరణలు, రాజకీయాల కలయికకు చిహ్నంగా నిలుస్తుంది. డిజిటల్ కరెన్సీల ప్రాముఖ్యతను గుర్తు చేయడమే మా ఉద్దేశం" అని తెలిపారు. సోషల్ మీడియాలో ఈ విగ్రహం ఫొటోలు వైరల్ అవుతున్నాయి. కొందరు ట్రంప్ విగ్రహం అద్భుతంగా ఉందంటూ ప్రశంసిస్తున్నారు. అమెరికాను క్రిప్టో రాజధానిగా మార్చే ప్రయత్నంలో ట్రంప్ మరో మెట్టు ఎక్కాడని కొనియాడుతున్నారు. మరికొందరు దీనిని రాజకీయ ఎత్తుగడగా విమర్శిస్తున్నారు. ఈ సంఘటన క్రిప్టో మార్కెట్లో కూడా ఉత్తేజాన్ని కలిగించింది. డైజెటీజీఎస్టీ వంటి మెమ్ కాయిన్ల ధరలు గణనీయంగా పెరిగాయి.
క్రిప్టో కరెన్సీ భవిష్యత్తుపై చర్చ
క్రిప్టోకరెన్సీ అనేది డిజిటల్ లేదా వర్చువల్ కరెన్సీ. దీనిని ఏ బ్యాంక్ లేదా ప్రభుత్వం నియంత్రించదు. బిట్కాయిన్, ఈథరియం వంటివి ఇందులో ఉంటాయి. ఇవి సురక్షిత లావాదేవీల కోసం క్రిప్టోగ్రఫీని ఉపయోగిస్తాయి. ట్రంప్ మొదటి నుంచి క్రిప్టో కరెన్సీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు. అమెరికాను క్రిప్టో హబ్గా మార్చాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నాడు. ట్రంప్ క్రిప్టోను సాంప్రదాయ బ్యాంకింగ్కు ప్రత్యామ్నాయంగా ప్రోత్సహిస్తున్నాడు. ట్రంప్ మద్దతు క్రిప్టో పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచుతోంది. ఈ విగ్రహ ఏర్పాటు అమెరికా ఆర్థిక వ్యవస్థలో కేంద్రీకృత ద్రవ్య విధానాలకు వ్యతిరేకంగా డీసెంట్రలైజ్డ్ డిజిటల్ కరెన్సీల ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును 4.3% నుంచి 4.1%కి తగ్గించడం, కార్మిక మార్కెట్ బలహీనతలను దృష్టిలో ఉంచుకొని తీసుకున్న నిర్ణయం. ఈ నేపథ్యంలో క్రిప్టో వంటి రిస్కీ ఆస్తులకు డిమాండ్ పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది రాజకీయ, ఆర్థిక చర్చలను ఒకే వేదికపైకి తీసుకొచ్చే ప్రయత్నంగా కనిపిస్తోంది. ఫెడ్ తాజా నిర్ణయం, ట్రంప్ విగ్రహం ఏర్పాటు ఒకదానికొకటి అనుకూలంగా ఉండటం క్రిప్టోకరెన్సీల భవిష్యత్తుపై చర్చకు తెరలేపాయి. ఈ సంఘటన అమెరికాలో క్రిప్టో ఆమోదాన్ని వేగవంతం చేయవచ్చని, అదే సమయంలో రాజకీయ విబేధాలను కూడా పెంచవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
