Let's talk: editor@tmv.in
బీజేపీ-జేడీయూ సీఎం అభ్యర్థి నితీశ్ కుమార్ కాదా..?

బీజేపీ-జేడీయూ సీఎం అభ్యర్థి నితీశ్ కుమార్ కాదా..?

Dr.Chokka Lingam
17 సెప్టెంబర్, 2025

పొత్తు పెట్టుకున్న పార్టీ కన్నా అతి తక్కువ సీట్లు గెలుచుకున్నా, పదే పదే కూటములు మార్చినా మధ్యలో కొంతకాలం తప్ప 20ఏళ్లగా బీహార్ పీఠంపై కూర్చున్న నితీశ్ కుమార్ ఎన్నికల తర్వాత ఇక మాజీ ముఖ్యమంత్రిగా మిగిలిపోనున్నారా? కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి కీలక మద్దతుదారుగా ఉన్నప్పటికీ బీహార్ పీఠంపై నితీశ్ను ఇంకోసారి కూర్చోపెట్టడానికి బీజేపీ సిద్ధంగా లేదా..? గత ఎన్నికల్లోలా ఎక్కువ సీట్లు గెలుచుకుని కూడా సీఎం కుర్చీని నితీశ్కు త్యాగం చేసిన బీజేపీ ఈసారి మాత్రం ఎన్నికల్లో గెలిస్తే అలా చేయబోదా...? అవుననే అనిపిస్తోంది ప్రధాని నరేంద్రమోడీ నితీశ్ కుమార్తో కలిసి పూర్ణియాలో చేసిన ఎన్నికల ప్రచారం గమనిస్తే. నితీశ్ కుమార్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈ సభలో ప్రధాని ప్రకటించలేదు. దీంతో బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ పదవీకాలం ముగిసినట్టేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా, పదే పదే కూటములు మార్చినా సీఎం కుర్చీ చేజారిపోకుండా చూసుకోవడం నితీశ్కు వెన్నెతో పెట్టిన విద్య. 2015లో ఆర్జేడీ, కాంగ్రెస్తో కలిసి మహాఘట్బంధన్ పేరుతో పోటీచేసినప్పుడు కూడా నితీశ్ కుమారే సీఎం అభ్యర్థి. 2020ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ కలిసి పోటీచేశాయి. జేడీయూ కన్నా ఎక్కువగా బీజేపీ భారీగా సీట్లు గెలుచుకుంది. అయినా సరే బీజేపీ సీఎం పదవి కోసం పట్టుబట్టలేదు.

ఆ తర్వాత బీజేపీతో విభేదించి నితీశ్ కుమార్ కాంగ్రెస్, ఆర్జేడీతో కలిసినప్పుడు కూడా ఆ పార్టీల నేతలెవరూ నితీశ్తో సీఎం కుర్చీకోసం పోటీపడలేదు. తిరిగి లోక్సభ ఎన్నికల ముందు బీజేపీతో జతకట్టినా మోదీ, అమిత్ షా బీజేపీ అభ్యర్థికి సీఎం పదవి ఇవ్వాలన్న కండిషన్ పెట్టలేదు. అంతగా కూటమి రాజకీయాలపైనా, సీఎం పదవి కోసం జరిగే కుర్చీలాటపైన పట్టు సాధించిన నితీశ్ కుమార్కు ఈ సారి మాత్రం పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. 20ఏళ్లగా అధికారంలో ఉన్న నితీశ్ కుమార్ పైనా, పదే పదే కూటములు మార్చే ఆయన రాజకీయ వ్యూహాల తీరుపైనా, రాష్ట్రంలో పేరుకుపోయిన అవినీతిపైనా బీహార్ ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అందుకే ప్రధాని మోదీ కూడా ముందు జాగ్రత్తగా బీజేపీ-జేడీయూ-ఎల్జేపీ కూటమి గెలిస్తే నితీశ్ సీఎం కాదన్న సంకేతాలను బీహార్ ప్రజలకు పరోక్షంగా పంపిస్తున్నారు. అసలు ఈ సారి బీహార్ ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ రాష్ట్రంలో ప్రధాని విస్తృతంగా పర్యటిస్తున్నారు. బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కులగణన ప్రకటించారు. ఎనిమిదేళ్ల తర్వాత జీఎస్టీ సంస్కరణలకు, అనేక వస్తువులపై ధరలు తగ్గేలా చేయడానికి కారణం బీహార్ ఎన్నికలే అన్న వాదన ఉంది. ప్రధాన ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఓట్ల చోరీ ఆరోపణలను బీజేపీ తీవ్రంగా భావిస్తోంది. బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే రాహుల్ ఓట్ల చోరీ అంశాన్ని తెరపైకి తెచ్చారని భావిస్తున్న బీజేపీ, అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి రాహుల్ ఆరోపణలకు ఆదిలోనే చెక్ పెట్టాలని అనుకుంటోంది. అందుకే బీహార్ ఎన్నికల కోసం గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో సర్వశక్తులూ ఒడ్డుతోంది కమలం పార్టీ. ఎన్నికల్లో వీలయినన్ని ఎక్కువ సీట్లు గెలిచి బీజేపీ నేతను ముఖ్యమంత్రిగా చేయాలన్నది కమలదళం వ్యూహం. బీహార్ ఎన్నికల అనంతరం నితీశ్ కుమార్ను ఎన్డీఏ ప్రభుత్వంలోకి తీసుకుని కీలకశాఖను కట్టబెడతారని ప్రచారం జరుగుతోంది. అసలు జగ్దీప్ ధన్ఖడ్ రాజీనామా తర్వాత ఉపరాష్ట్రపతి రేసులో నితీశ్ పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ ఎన్నికలకు ముందు ప్రయోగాలు చేయకూడదన్న ఉద్దేశంతో ఆ అంశాన్ని పక్కనపెట్టినట్టు తెలుస్తోంది.

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఎన్ని స్థానాల్లో గెలిచినప్పటికీ సీఎం కుర్చీ కోసం పట్టుబట్టే స్థితి నితీశ్ కుమార్కు లేదనే చెప్పాలి. 20ఏళ్ల క్రితం నితీశ్ కుమార్పై బీహార్ ప్రజల్లో ఎన్నో ఆశలుండేవి. అభివృద్ధికి ఆమడదూరంలో ఉండే బీహార్ తలరాతను ఆయన మారుస్తారని అంతా భావించారు. అయితే ప్రజల ఆకాంక్షలు పూర్తిస్థాయిలో అందుకోలేకపోయినప్పటికీ బీహార్ స్థితిగతులను నితీశ్ కుమార్కు ముందూ, తర్వాత అనే స్థాయిలో ఆయన మార్చగలిగారన్నది అంగీకరించాలి. వ్యక్తిగతంగా ఆయనపై ప్రజలకు పెద్దగా ఫిర్యాదులు లేకపోవచ్చు గానీ, పదే పదే కూటములను మార్చడం, పాలనపై పట్టుకోల్పోయారన్న భావన నితీశ్కు ప్రతికూల అంశాలు. దాదాపు 20 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిపై ప్రజల్లో వ్యతిరేకత ఉండడం సహజమైన విషయం. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే సీఎం పదవిపై నితీశ్ కుమార్కు బీజేపీ హామీ ఇవ్వలేదని భావిస్తున్నారు.

అలాగే బీజేపీ కూడా తమ పార్టీ అభ్యర్థిని సీఎంగా చేసి రాష్ట్రంలో మరింత పట్టు పెంచుకోవాలని భావిస్తోంది. ఉపముఖ్యమంత్రి, మంత్రులు పదవులతో సరిపెట్టుకోకుండా ఈ సారి బీహార్ కుర్చీని కాషాయమయం చేయాలన్నది మోదీ, అమిత్ షా లక్ష్యం.

సీఎం పదవి ఇచ్చినా, లేకపోయినా ఇప్పుడప్పుడే నితీశ్ కుమార్ ఎన్డీఏకు దూరం జరిగే పరిస్థితి కనిపించడం లేదు. కేంద్రంలో ఏదో ఒక పదవి దక్కే అవకాశముంది కాబట్టి ముందు ప్రజల్లో తన విశ్వసనీయతను తిరిగి తెచ్చుకోవాల్సిన తక్షణ బాధ్యత నితీశ్పై ఉంది.

బీజేపీ-జేడీయూ సీఎం అభ్యర్థి నితీశ్ కుమార్ కాదా..? - Tholi Paluku