Let's talk: editor@tmv.in
బంగారం మాయంపై హైకోర్టు ఆగ్రహం

బంగారం మాయంపై హైకోర్టు ఆగ్రహం

T Venkata Ramana
19 సెప్టెంబర్, 2025

కోట్లాది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచే కేరళలోని ప్రఖ్యాత శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో చోటుచేసుకున్న ఓ తీవ్రమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టిస్తోంది. గర్భగుడి ద్వారపాలక విగ్రహాలకు అమర్చిన బంగారు పూత తాపడాల బరువులో ఏకంగా 4.5 కిలోలకు పైగా తేడా రావడంపై కేరళ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతులు లేకుండా తాపడాలను తొలగించడం, బరువు తగ్గడం వెనుక భారీ కుట్ర జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తూ ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తునకు విజిలెన్స్ కమిటీని ఆదేశించింది.

అసలేం జరిగింది?

శబరిమల గర్భగుడికి ఇరువైపులా ఉండే ద్వారపాలక విగ్రహాలు రాగితో చేసి వాటికి బంగారు పూత పూసిన తాపడాలు (కవచాలు) అమర్చారు. 2019లో ఈ తాపడాలు పాడయ్యాయని, వాటికి మరమ్మతులు చేసి కొత్తగా బంగారు పూత వేయిస్తానని ఉన్నికృష్ణన్ అనే ఓ భక్తుడు ముందుకొచ్చారు. ఈ పనిని చెన్నైలోని ఓ ప్రముఖ సంస్థకు అప్పగిస్తానని తెలిపారు. ఈ ప్రక్రియకు ట్రావెన్కోర్ దేవస్యం బోర్డు నుంచి గానీ, శబరిమల స్పెషల్ కమిషనర్ నుంచి గానీ ఎలాంటి ముందస్తు అనుమతులు తీసుకోలేదు. నిబంధనలకు విరుద్ధంగా తాపడాలను విగ్రహాల నుంచి తొలగించారు. తాపడాలను తొలగించే సమయంలో అధికారులు వాటి బరువును 42.8 కిలోలుగా నమోదు చేశారు. దాత ఉన్నికృష్ణన్ ఆ తాపడాలను తీసుకుని దాదాపు 40 రోజుల తర్వాత చెన్నైలోని కంపెనీకి అప్పగించారు. అయితే ఆ కంపెనీ తమకు తాపడాలు అందినప్పుడు వాటి బరువు కేవలం 38.28 కిలోలు మాత్రమే ఉందని రికార్డుల్లో పొందుపరిచింది. ఈ లెక్కన ఆలయం నుంచి కంపెనీకి చేరేలోపు ఏకంగా 4.524 కిలోల బరువు మాయమైంది. ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్ను విచారించిన కేరళ హైకోర్టు అనేక కీలక అంశాలను లేవనెత్తింది.

భారీగా బరువు ఎలా తగ్గింది?

మరమ్మతుల కోసం తీసుకెళ్లిన తాపడాల బరువు ఉన్నట్టుండి 4.524 కిలోలు ఎలా తగ్గిందని న్యాయస్థానం తీవ్రంగా ప్రశ్నించింది. ఇది కేవలం బంగారు పూత తగ్గడం వల్ల సాధ్యం కాదని, దీని వెనుక ఏదో మోసం జరిగిందని అభిప్రాయపడింది. ఆలయం నుంచి తొలగించిన తాపడాలను చెన్నైలోని కంపెనీకి అప్పగించడానికి 40 రోజుల సమయం ఎందుకు పట్టిందని కోర్టు అనుమానం వ్యక్తం చేసింది. ఈ మధ్యకాలంలోనే అసలు మోసం జరిగి ఉండవచ్చని పేర్కొంది. దాత ఆలయం నుంచి తీసుకెళ్లిన అసలు తాపడాల స్థానంలో, తక్కువ బరువున్న మరో సెట్ను కంపెనీకి ఇచ్చి ఉండే అవకాశం కూడా లేకపోలేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. మరమ్మతుల తర్వాత తాపడాలను తిరిగి విగ్రహాలకు అమర్చే సమయంలో వాటి బరువును దేవస్వం బోర్డు అధికారులు ఎందుకు సరిచూడలేదని తీవ్రంగా మందలించింది.ఈ వ్యవహారంలో అనేక లోపాలు, అనుమానాలు ఉన్నాయని నిర్ధారించిన హైకోర్టు పూర్తి సత్యాసత్యాలు నిగ్గు తేల్చేందుకు విజిలెన్స్ కమిటీ దర్యాప్తునకు ఆదేశించింది. ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు ఈ దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. మూడు వారాల్లోగా నివేదికను కోర్టుకు సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను సెప్టెంబరు 30వ తేదీకి వాయిదా వేసింది. ఈ ఘటన శబరిమల ఆలయ నిర్వహణలో పారదర్శకత లోపాన్ని, అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజిలెన్స్ దర్యాప్తులో అసలు దోషులు ఎవరో తేలనుంది.

బంగారం మాయంపై హైకోర్టు ఆగ్రహం - Tholi Paluku