Let's talk: editor@tmv.in
బాగ్రామ్ ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు

బాగ్రామ్ ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు

Venkatesh Balusula
22 సెప్టెంబర్, 2025

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ పాలిత ప్రభుత్వానికి కఠిన హెచ్చరికలు జారీ చేశారు. 2021లో అమెరికా దళాలు వదిలిపెట్టిన బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని తిరిగి ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. తాలిబాన్ అధికారులు ట్రంప్ డిమాండ్‌ను తిరస్కరించిన రోజే ఈ బెదిరింపు వ‌చ్చింది. కాబూల్ నుంచి సుమారు 64 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ విస్తృత ఎయిర్‌బేస్‌ను అమెరికాకు తిరిగి అప్పగించమని ట్రంప్ ఇప్ప‌టికే ప‌లుమార్లు డిమాండ్ చేశారు.

బాగ్రామ్‌పై ప‌ట్టుద‌ల‌తో ట్రంప్

బాగ్రామ్ వైమానిక స్థావ‌రం గురించి ట్రంప్ త‌న సోష‌ల్ మీడియా వేదిక‌ ట్రూత్ సోషల్‌లో అభిప్రాయాన్ని వెల్ల‌డించారు. ఆఫ్ఘనిస్తాన్ బాగ్రామ్ ఎయిర్‌బేస్‌ నిర్మించిన అమెరికా సంయుక్త రాష్ట్రాలకు తిరిగి ఇవ్వకపోతే, దారుణాలు జరుగుతాయ‌ని హెచ్చరించారు. శనివారం వైట్ హౌస్‌లో రిపోర్టర్లతో మాట్లాడుతూ ఆఫ్ఘాన్‌తో చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ట్లు చెప్పారు. బాగ్రామ్ ఎట్టిప‌రిస్థితుల్లో అమెరికాకు ద‌క్కాల్సిందేన‌ని, ఇది జ‌ర‌గ‌ని రోజు చాలా క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకోవాల్సి వ‌స్తుంద‌ని చెప్పారు. దీనికి ఒక రిపోర్ట‌ర్ ప్ర‌శ్నిస్తూ ఈ ఎయిర్ బేస్ తిరిగి తీసుకోవడానికి దళాల‌ను పంపిస్తారా అని అడిగారు. అయితే ట్రంప్ దీనికి స‌మాధానం చెప్పేందుకు నిరాక‌రించారు. దీనిపై ఇప్పుడేం మాట్లాడ‌ము అని చెప్పారు. బాగ్రామ్ వైమానిక స్థావ‌రం ఒకప్పుడు అమెరికా ఆఫ్ఘాన్‌ కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా నిలిచింది. 2001 దాడుల తర్వాత మొదలైన యుద్ధంలో ఇక్కడ అమెరికా దళాలు వేలాది మంది ఉగ్రవాదులను అభియోగాలు లేకుండా జైలు పాలు చేశాయి. చాలామంది హింసాత్మక దాడులు ఎదుర్కొన్నారు. రెండు మైళ్ల రన్‌వే, బీ-52 బాంబర్లు, బ్లాక్ హాక్ హెలికాప్టర్లు ఇక్కడ నిల్వ చేసేవారు. సుమారు 40 వేల మంది సైనికులతో పాటు సివిల్ కాంట్రాక్టర్లు కూడా ఇక్కడ పనిచేసే వారు. అయితే 2021 జులై 2న అమెరికా దళాలు ఇక్కడి నుంచి ఉపసంహరణ చేసి వదిలిపెట్టాయి. తర్వాత దీనిని తాలిబాన్ స్వాధీనం చేసుకుంది.

చైనా కార్య‌క‌లాపాల‌పై నిఘా

ట్రంప్ ఈ బేస్ కోల్పోవడాన్ని తరచూ విమర్శిస్తూ, గ‌త‌ అధ్యక్షుడు జో బైడెన్ పాల‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. బేస్ చైనాకు సమీపంలో ఉండటం వల్ల పశ్చిమ చైనాలోని కాఖ్గర్ ప్రాంతంలోని అణు కార్యకలాపాలపై నిఘా పెట్టడానికి ఇది వ్యూహాత్మకంగా ముఖ్యమని ఆయన భావిస్తున్నారు. ఇటీవ‌ల‌ యూకే సందర్శనలో ఆ దేశ‌ ప్రధాని కీర్ స్టార్మర్‌తో ఈ బేస్‌ను తిరిగి పొందేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు చెప్పారు. బాగ్రామ్ గురించి ట్రంప్ బ‌హిరంగంగా ప్ర‌క‌టించ‌డం ఇదే మొద‌టిసారి. తాలిబాన్ అధికారులు ఈ డిమాండ్‌ను తీవ్రంగా తిరస్కరించారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి జకీర్ జలాల్ ఆఫ్ఘనిస్తాన్, అమెరికా ప‌ర‌స్ప‌రం చ‌ర్చించుకోవాల‌న్నారు. ఇది ఆఫ్ఘాన్‌లో ఎలాంటి సైనిక చ‌ర్య‌లు నిర్వ‌హించ‌కుండా చేప‌ట్టాల‌ని చెప్పారు. తాలిబాన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ కూడా దీనిపై స్పందించారు. బాగ్రామ్ ఆఫ్ఘన్ నేల అని, ఇది చైనా అవుట్‌పోస్ట్ కాద‌ని స్పష్టం చేశారు. కాబుల్ వాషింగ్టన్‌తో రాజకీయ, ఆర్థిక సంబంధాలు కొన‌సాగించేందుకు, పరస్పర గౌరవంతో ఉమ్మడి శ్రేయ‌స్సు కోసం ముందుకు సాగేందుకు సిద్ధమని చెప్పారు.

అసాధ్య‌మ‌ని భావిస్తున్న అమెరికా అధికారులు?

అమెరికా ప్రభుత్వ వర్గాలు బాగ్రామ్ బేస్ డిమాండ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ఒక ఉన్నతాధికారి ఆ బేస్‌ను మళ్లీ తమ స్వాధీనంలోకి తీసుకోవడం అంత సులభం కాద‌ని, ఎలాంటి సులభ మార్గాలు కూడా లేవ‌ని మీడియాతో చెప్ప‌న‌ట్లు వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఐసిస్, అల్-ఖైదా లాంటి ఉగ్రవాద సంస్థల నుంచి బేస్‌ను రక్షించడానికి వేల‌ సంఖ్యలో సైనికులు అవసరమవుతార‌ని భావిస్తున్నారు. అంతేకాకుండా, బేస్‌ను మళ్లీ సరిగ్గా నిర్మించడానికి చాలా పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చవుతుంది. ఈ పరిస్థితులు ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా, తాలిబాన్ మధ్య సంబంధాలను మరింత ఉద్రిక్తంగా మారుస్తాయని నిపుణులు భావిస్తున్నారు.. చైనా ప్రభావం ఆఫ్ఘాన్‌లో పెరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యూహాత్మక ప్ర‌ణాళిక‌ను ముందుకు తీసుకువెళ్తారా లేదా అనేది రానున్న కొన్ని రోజుల్లో స్పష్టమవుతుంది.

బాగ్రామ్ ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు - Tholi Paluku