
బకాయిలు చెల్లిస్తూ.. కానుకలంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు:
రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్ల విషయంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై వైయస్‌ఆర్‌సీపీ ఎంప్లాయిస్ అండ్ పెన్షనర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్రాంతి సందర్భంగా ప్రభుత్వం ఉద్యోగులకు వరాలు కురిపించిందంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, ప్రభుత్వం ఒకటి చేస్తే అనుకూల మీడియాలో మరొకటి ప్రచారం చేస్తున్నారని ఆయన అర్పించారు. శుక్రవారం విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో ఆయన మాట్లాడుతూ, డీఏ, డీఆర్‌ల విషయంలో ప్రభుత్వం చేస్తున్న ప్రచారం వల్ల ఉద్యోగులు, పెన్షనర్లలో తీవ్ర గందరగోళం నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
పెన్షనర్లకు 60 నెలల డీఆర్ ఇచ్చామంటూ పత్రికల్లో కథనాలు రాపిస్తున్నారని, కానీ వాస్తవానికి ఎవరికీ 60 నెలల బకాయిలు అందలేదని చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. కేవలం కొంతమందికి మాత్రమే 30 నెలలకు సంబంధించి అరకొరగా రూ. 4 వేల నుంచి రూ. 10 వేల లోపు మాత్రమే జమ అయ్యాయని వివరించారు. సీపీఎస్ ఉద్యోగులకు, పెన్షనర్లకు రూ. 1,100 కోట్లు ఇస్తున్నామని పోలీసులకు సరెండర్ లీవ్స్ బకాయిలు చెల్లిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారని నిజానికి ఉద్యోగులకు చట్టబద్ధంగా రావాల్సిన పాత బకాయిలను చెల్లిస్తూ వాటిని సంక్రాంతి కానుకలుగా అభివర్ణించడం హాస్యాస్పదమని ఆయన ఎద్దేవా చేశారు.
అధికారంలోకి వస్తే పీఆర్‌సీ, ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినా వాటి ఊసే ఎత్తడం లేదని ఆయన విమర్శించారు. కనీసం పీఆర్‌సీ కమిషన్ చైర్మన్‌ను కూడా ఇంతవరకు నియమించకపోవడం ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోందన్నారు. జీపీఎఫ్, మెడికల్ రీయింబర్స్‌మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి సుమారు రూ. 35 వేల కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
గత వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ పెండింగ్‌లో పెట్టిన డీఏలకు జీవోలు ఇచ్చిందని, ఆనాడు ఇచ్చిన జీవోల ఆధారంగానే ఇప్పుడు ఈ ప్రభుత్వం చెల్లింపులు చేస్తోందని చంద్రశేఖర్ రెడ్డి గుర్తు చేశారు. 2018 నుంచే టీడీపీ ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేస్తోందని ఇప్పటికైనా ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు మానుకోవాలని పేర్కొన్నారు. అదేవిదంగా వెంటనే ఐఆర్‌ను ప్రకటించాలని పీఆర్‌సీ కమిషన్ చైర్మన్‌ను నియమించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
