
బకాయిలు విడుదల చేయండి!
పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే బకాయి నిధులు విడుదల చేయాలని సీపీఎం పార్టీ అల్లూరి సీతారామరాజు జిల్లా కార్యదర్శి అప్పల నరస డిమాండ్ చేశారు. బకాయిల చెల్లింపుపై నిర్లక్ష్యం, వైద్య కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన అరణ్య గర్జన యాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. అరణ్య గర్జన యాత్రలో భాగంగా పాడేరు చేరుకున్న సీపీఎం నాయకులు, మినుములూరు, గుర్రాగరువు గ్రామాల్లో పర్యటన పూర్తి చేసుకొని, అనంతరం పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించి, అక్కడి దయనీయ పరిస్థితులను పరిశీలించారు.
పాడేరు వైద్య కళాశాల నిర్మాణానికి ప్రభుత్వం నాడు రూ.500 కోట్లు కేటాయించగా, ఇప్పటి వరకు కేవలం రూ. 170 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, మిగిలిన రూ.330 కోట్ల నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేయకపోవడంతో కళాశాలలో కనీస సౌకర్యాలు లేకుండా పోయాయని పేర్కొన్నారు. దీని ఫలితంగా రోజువారీ అవుట్‌పేషెంట్ సంఖ్య పెరగక, వైద్య సేవలు అందించడంలో తీవ్ర అవాంతరాలు ఏర్పడ్డాయని, ఈ పరిస్థితి కారణంగా గతంలో 150 ఎంబీబీఎస్ సీట్లను 50కి కుదించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో స్థానిక ఆదివాసీ విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం దురదృష్టకరమని, ప్రస్తుతం కేవలం ఇద్దరు ఎస్టీ విద్యార్థులు మాత్రమే ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారని పేర్కొన్నారు.
స్థానిక ఆదివాసీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావడం, మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం పాడేరులో వైద్య కళాశాల స్థాపన కోసం ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారని గుర్తు చేశారు. అయినప్పటికీ, నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని, పైగా, ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తామని ప్రకటించడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు . ఇప్పటికే వైద్య విద్య గిరిజన ప్రాంతాల్లో అందని ద్రాక్షగా మారిందని, రేడియాలజిస్ట్, ఎమర్జెన్సీ విభాగాలకు సిబ్బంది నియమించకపోవడం, వసతి సౌకర్యాలు లేకపోవడంతో వైద్యులు, సిబ్బంది ఇక్కడ విధులు నిర్వహించడానికి సుముఖత చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాడేరు వైద్య కళాశాల నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి బకాయి నిధులు విడుదల చేయాలని, ప్రైవేటీకరణ ప్రతిపాదనలను రద్దు చేయాలని, స్థానిక ఆదివాసీ విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తూ వైద్య విద్య, సేవలను మెరుగుపరచాలని కోరారు. ఈ సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి, పాడేరు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని సీపీఎం డిమాండ్ చేసింది. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఒప్పందలు రద్దు చేయాలని నిర్వహిస్తున్న అరణ్య గర్జన యాత్ర సెప్టెంబర్ 27వ తేదీతో ముగుస్తుంది. ఈ పర్యటనలో యాత్ర బృందం పాల్గొన్నారు.
