
బీఆర్ఎస్, కాంగ్రెస్లపై బండి ఫైర్
కేంద్ర మంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్, కాంగ్రెస్ విద్యార్థులను, నిరుద్యోగులను పట్టించుకోవడం లేదని ఆ పార్టీలపై ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ పదేళ్ల పాలనలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ వేల కోట్ల బకాయిలు పెట్టారని బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. గత పదేళ్లలో ఒకసారి కూడా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడం దుర్మార్గమని అన్నారు. మంచిర్యాలలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేపర్ లీక్, ఉద్యోగాలు అమ్ముకోవడం జరిగిందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో బీఆర్ఎస్ విఫలమైదని చెప్పారు. బీఆర్ఎస్ అడుగులోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందని విమర్శించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను విడుదలచేయకుండా, విద్యార్థులను వేధిస్తుందన్నారు.
కాంగ్రెస్ పాలన వచ్చినా పరిస్థితి మారలేదని విమర్శించారు. కాలేజీల విద్యార్థులతో యజమానులతో టైంపాస్ చేస్తున్నారని విమర్శించారు. కాలేజీలు బంద్ చేస్తే విద్యార్థుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని బండిసంజయ్ మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్ మెంట్ వెంటనే విడుదలచేయలని కోరారు. గ్రూప్1 ఉద్యోగాలు భర్తీలో అక్రమాలు జరిగాయని, దీనికి పాలకులు ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ఎక్కువగా పెంచారని, అలాగే కేంద్రప్రభుత్వం భారీస్థాయిలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పుకొచ్చారు.
