
బీఆర్ఎస్ను బెంబేలెత్తిస్తున్న కవిత
తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలు హాట్ హాట్గా సాగుతున్నాయి. ఎన్నికల వేడి చల్లారకముందే కొత్త రాజకీయ సమీకరణాలు మొదలయ్యాయి. ఈ మధ్యకాలంలో వార్తల్లో బాగా వినిపిస్తున్న పేరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. పార్టీ కంటే సొంతంగానే కార్యక్రమాలు చేస్తూ సొంత ఎజెండాను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉన్నట్టు కనిపిస్తున్నా కేసీఆర్, కేటీఆర్లను ప్రస్తావించడం, తెలంగాణ జాగృతి పేరుతో కార్యక్రమాలను నిర్వహించడం వంటివి చూస్తుంటే ఆమె వ్యూహాలు మరింత స్పష్టమవుతున్నాయి.
ఎందుకీ పంథా?
కవిత అనుసరిస్తున్న ఈ కొత్త పంథా పార్టీలో అంతర్గత చర్చకు దారితీస్తోంది. అసలు కవిత ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఆమె లక్ష్యం ఏమిటి? అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణుల్లో పెద్ద చర్చకు దారితీశాయి. కేటీఆర్కు పోటీగా ఎదగడానికే ఈ ప్రయత్నాలు చేస్తున్నారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. కుటుంబ సభ్యులు కానీ, పార్టీ నాయకులు కానీ ఆమెకు మద్దతుగా లేకపోయినా ఆమె మాత్రం ఒంటరిగానే ముందుకు సాగుతూ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీకి లాభమా? నష్టమా? అనే చర్చ కూడా జరుగుతోంది.
సొంత రాజకీయాలు
కవిత తాను బీఆర్ఎస్ నాయకురాలిని అని చెప్పుకుంటూనే తన కార్యక్రమాలన్నింటినీ తెలంగాణ జాగృతి పేరుతో చేస్తున్నారు. ఇది భవిష్యత్తులో జాగృతి నేతలకు పార్టీ టికెట్లు కావాలనే డిమాండ్కు దారితీస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ పార్టీ తన డిమాండ్లను పట్టించుకోకపోతే వేరే కుంపటి పెట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయని కొందరు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.
బీఆర్ఎస్ను ఇరుకునపెడుతున్న నిర్ణయాలు
బీఆర్ఎస్ పార్టీకి సరైన వ్యూహాలు లేని సమయంలో కవిత వరుస కార్యక్రమాలను నిర్వహిస్తూ దూసుకుపోతున్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం రైల్ రోకోకు పిలుపునివ్వడం, భద్రాచలం భూముల గురించి చంద్రబాబుకు లేఖ రాయడం, మహిళలకు డబ్బుల హామీపై పోస్ట్ కార్డుల ఉద్యమం చేపట్టడం వంటివి పార్టీలో చర్చకు దారితీశాయి. ఇది పార్టీలో ఉన్న శ్రేణులను గందరగోళానికి గురిచేస్తోంది. ఇక జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డితో కవిత భేటీ కావడంతో ఉపఎన్నికల పోటీపై చర్చ ప్రారంభమైంది. జూబ్లీహిల్స్ లో జాగృతి తరపున అభ్యర్థిని పోటీకి దింపితే బీఆర్ఎస్ విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని కొందరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అంటున్నారు. దీంతో పార్టీకి మరింత తలనొప్పి తెచ్చిపెట్టే అవకాశం ఉంది.
కవిత ప్లాన్ ఏంటి?
కవిత అనుసరిస్తున్న ఈ రాజకీయ వ్యూహాల వెనక చాలా ప్లాన్లు ఉన్నాయని తెలుస్తోంది. బీఆర్ఎస్పార్టీ నాయకత్వం తనను పక్కన పెడుతుందనే భావనతో, తన శక్తిని చాటుకుని పార్టీపై ఒత్తిడి తీసుకురావడమే కవిత ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ఆమె వరుస కార్యక్రమాలతో పార్టీలో తాను ఇప్పటికీ శక్తిమంతమైన నాయకురాలినని నిరూపించుకోవాలని చూస్తున్నారు. తెలంగాణ జాగృతి పేరుతో కవిత తన అనుచర వర్గాన్ని నిర్మించుకుంటున్నారు. బీసీ సంఘాల నాయకులతో ఆమె నిరంతరం చర్చలు జరపడం ఈ గ్రూపు నిర్మాణంలో భాగమేనని తెలుస్తోంది. భవిష్యత్తులో తన వెంట ఉన్న వారికి టికెట్లు ఇప్పించుకోవడానికి ఇది ఒక బలమైన సాధనంగా తెలుస్తోంది.
ప్రజల్లో ఉనికి చాటుకోవడం
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ నాయకులందరూ కొంత స్తబ్దుగా ఉన్నారని చెప్పాలి. ఈ సమయంలో కవిత మాత్రం వరుసగా ప్రజా సమస్యలపై స్పందిస్తూ, ధర్నాలు చేస్తూ, లేఖలు రాస్తూ ప్రజల్లో తన ఉనికిని చాటుకుంటున్నారు. ఇది రాజకీయంగా ఆమెకు మరింత మైలేజీని తీసుకొస్తుందని చెప్పొచ్చు. కవిత దూకుడు రాజకీయాలపై బీఆర్ఎస్ నేతలు అయోమయంలో ఉన్నారు. కవితను సస్పెండ్ చేయాలా వద్దా అనే విషయంలో కూడా కొంత ఆలోచనలో పడ్డారు. చివరికి సస్పెండ్ చేశారు.
ఈ కసితోనే ఆమె మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశాలున్నాయి. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడినట్లుంటుందనే పరిస్థితిలో ఉంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. కేసీఆర్ నుంచి ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో నేతలంతా కిమ్మనకుండా ఉంటున్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం కవిత దీక్ష చేపడితే, ఆ తర్వాత అదే అంశంపై బీఆర్ఎస్ కూడా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని అనుకుంది. ఇది కవిత వ్యూహాల ముందు పార్టీ వెనుకబడి ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. మొత్తం మీద కవిత తన అడుగులతో బీఆర్ఎస్ పార్టీలో నాయకులకు నిద్ర లేకుండా చేస్తున్నారు. భవిష్యత్తులో ఆమె తీసుకునే నిర్ణయాలు తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తెస్తాయో చూడాలి.
