
బంధువుల వివాహ వేడుకకు వైఎస్ జగన్ హాజరు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం తమిళనాడు రాజధాని చెన్నైలో పర్యటించారు. తన బంధువుల వివాహ వేడుకకు హాజరయ్యేందుకు ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. వైఎస్ మామ జార్జ్ రెడ్డి కుమారుడు వైఎస్ సునీల్ రెడ్డి తనయుడు సాహిల్ వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఈ శుభకార్యానికి జగన్ తన తల్లి విజయమ్మ, సతీమణి భారతితో కలిసి విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
నగరంలోని ప్రతిష్టాత్మక 'లీలా ప్యాలెస్' హోటల్ వేదికగా జరిగిన ఈ వివాహ వేడుక రాజకీయ సినీ ప్రముఖుల కలయికతో కోలాహలంగా మారింది. తమిళనాడు ముఖ్యమంత్రి డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ ప్రత్యేకంగా తరలివచ్చి వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జగన్, స్టాలిన్ కొద్దిసేపు ఆప్యాయంగా పలకరించుకున్నారు. అదేవిధంగా కోలీవుడ్ స్టార్ హీరో, టీవీకే అధినేత విజయ్, సీనియర్ నటుడు మోహన్ బాబు, హీరోలు సూర్య, కార్తి సోదరులు ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు. ప్రముఖ సినీ తారలు, రాజకీయ నేతల రాకతో హోటల్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.
వివాహ కార్యక్రమం కంటే ముందుగా చెన్నైలోని ఇంజంబక్కం వీజీపీ లేఅవుట్‌లో ఉన్న అనిల్ నివాసంలో జగన్ బస చేశారు. తమ నాయకుడు నగరానికి వస్తున్నారన్న సమాచారంతో పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు అక్కడకు చేరుకున్నారు. జగన్ వారికి అభివాదం చేస్తూ కాసేపు గడిపారు. ఈ వేడుకలో వైసీపీ ముఖ్య నేతలు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీలు మిథున్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ మంత్రి విడదల రజిని తదితరులు పాల్గొన్నారు.
రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు ఒకే వేదికపైకి రావడంతో ఈ వివాహ వేడుక రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా దళపతి విజయ్‌తో జగన్ ముచ్చటిస్తున్న దృశ్యాలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
