Let's talk: editor@tmv.in
బంజారా హిల్స్‌లో కల్తీ నెయ్యి గుట్టు రట్టు..

బంజారా హిల్స్‌లో కల్తీ నెయ్యి గుట్టు రట్టు..

Dantu Vijaya Lakshmi Prasanna
6 మార్చి, 2026

ఇటీవల ఎక్కడ చూసినా ఆహార పదార్థాల్లో కల్తీ ఘటనలు పెరుగుతున్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్ని తనిఖీలు, ప్రత్యేక దాడులు నిర్వహిస్తున్నా ఈ కల్తీ వ్యాపారం పూర్తిగా ఆగడం లేదు. ముఖ్యంగా ప్రజలు ఏమి కొనలన్నా, ఏమి తినాలన్నా ఏమవుతుందో అని బయపడుతున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో కల్తీ పాల ఘటన మరువకముందే అనేక సందర్భాల్లో ఉపయోగించే నెయ్యి వంటి ఆహార పదార్థాల్లో కూడా కల్తీ జరుగుతున్న ఘటనలు వెలుగులోకి వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో హైదరాబాద్‌ మహానగరంలో భారీగా కల్తీ నెయ్యి, ఇతర డెయిరీ ఉత్పత్తులు పట్టుబడటం కలకలం రేపింది.

తాజాగా హైదరాబాద్‌లో కల్తీ డెయిరీ ఉత్పత్తుల తయారీపై పోలీసులు భారీగా దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున నకిలీ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. బంజారా హిల్స్ ప్రాంతంలో ఉన్న ఒక డెయిరీ యూనిట్‌పై చేసిన దాడిలో సుమారు 3,790 కిలోల కల్తీ పాల ఉత్పత్తులు పట్టుబడ్డాయి. వీటి విలువ సుమారు రూ.18.26 లక్షలుగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో డెయిరీ యజమాని అయిన మహమ్మద్ జునైద్ హుస్సేన్ (26)ను పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసుల సమాచారం ప్రకారం, బంజారా హిల్స్ రోడ్ నెంబర్-12లోని భోలానగర్ ప్రాంతంలో “ప్రైడ్ డెయిరీ” అనే పేరుతో జునైద్ హుస్సేన్ అక్రమంగా డెయిరీ ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్‌లో విక్రయిస్తున్నాడు. ఈ విషయంపై అందిన సమాచారం మేరకు పోలీసులు ఆ ప్రదేశంపై దాడి నిర్వహించారు. దాడి సమయంలో అక్కడ పెద్ద ఎత్తున కల్తీ ఉత్పత్తులు నిల్వ ఉంచినట్లు గుర్తించారు.

దర్యాప్తులో భాగంగా నెయ్యి తయారీలో పామ్ ఆయిల్, వనస్పతి (వెజిటబుల్ ఆయిల్) వంటి తక్కువ నాణ్యత గల పదార్థాలను కలిపి అసలు నెయ్యిలా తయారు చేసి విక్రయిస్తున్నట్లు బయటపడింది. ఈ ఉత్పత్తులను స్వచ్ఛమైన నెయ్యిగా చూపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

దాడిలో పోలీసులు 460 కిలోల కల్తీ నెయ్యి, 70 కిలోల మిక్స్‌డ్ కల్తీ నెయ్యి, 2,090 కిలోల కల్తీ ఆవు క్రీమ్, 1,170 కిలోల కల్తీ ఎద్దు క్రీమ్ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం కలిపి 3,790 కిలోల కల్తీ డెయిరీ ఉత్పత్తులు పట్టుబడ్డాయి.

పోలీసుల కథనం ప్రకారం, ఈ కల్తీ ఉత్పత్తులను ప్రజలకు మాత్రమే కాకుండా హోటళ్లు, క్యాటరింగ్ సర్వీసులు, ఈవెంట్ నిర్వాహకులకు కూడా సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. ఈ చర్యల వల్ల ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కల్తీ ఆహార పదార్థాల తయారీ, విక్రయంపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.