
బంజారాహిల్స్‌లో ఆక్రమణల తొలగింపు
హైడ్రా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రభుత్వ భూముల ఆక్రమణలు నగర అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని, అందుకే చర్యలు తక్షణం మరింత కఠినతరం చేయాలని సూచించింది. ఆక్రమణలు తొలగింపు సందర్భంగా హైడ్రా ప్రత్యేక పోలీసులచే బందోబస్తు ఏర్పాటు చేసి, శాంతిభద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకుంటుదని హైడ్రా అధికారులు పేర్కొన్నారు. భవిష్యత్‌లో కూడా జలమండలి, రెవెన్యూ శాఖల సహకారంతో ఆక్రమణలపై దృష్టి పెట్టబోతున్నట్లు హైడ్రా ప్రకటించింది. అలాగే, ఆక్రమణల నివారణకు అవగాహన కార్యక్రమాలు స్థానికులతో సుదీర్ఘ చర్చలు నిర్వహించి, ప్రభుత్వ భూముల రక్షణలో సమగ్ర చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
నగరంలో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుందని మొత్తం రూ.750 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా రక్షించిందన్నారు. షేక్ పేట్ మండలం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో ఉన్న ఆక్రమణలను హైడ్రా తొలగించిందన్నారు. జలమండలి కోసం గతంలో 5 ఎకరాలలో 1.20 ఎకరాలను ప్రభుత్వం కేటాయించిందని, ఆ 1.20 ఎకరాల భూమితో పాటు మొత్తం 5 ఎకరాల భూమిని పార్థసారథి తనదంటూ కోర్టును ఆశ్రయించాడని అధికారులు తెలిపారు. పార్థసారథి ఆ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి, బౌన్సర్లతో పాటు వేటుకుక్కలతో రక్షణ ఏర్పాటు చేశాడన్నారు. కోర్టులో వివాదం కొనసాగుతుంటే కూడా పార్థసారథి ఆ 5 ఎకరాల భూమిని తన ఆధీనంలోకి తీసుకుని అందులో షెడ్లు నిర్మించి పహరాలు ఏర్పాటు చేశాడన్నారు. ప్రభుత్వ భూమిలోనే అడ్డా వేసుకొని మద్యం సేవించి, స్థానికులకు భయభ్రాంతులు కలిగిస్తున్నారనే ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు.
జలమండలి తాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్న వాటర్ రిజర్వాయర్ నిర్మాణాన్నీ పార్థసారథి అడ్డుకున్నాడని జలమండలి, రెవెన్యూ అధికారులు ఈ విషయమై హైడ్రాకు ఫిర్యాదు చేశారని హైడ్రా అధికారులు పేర్కొన్నారు. పార్థసారథి ఫేక్ సర్వే నంబర్ (403/52) చేజిక్కించుకొని ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించాడని, దీనిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో రెవెన్యూ, జలమండలి ఆధ్వర్యంలో పార్థసారథిపై 4 క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయని, అధికారుల పరిశీలనలో 403 సర్వే నంబర్‌లో నిజంగా ప్రభుత్వ భూమి ఉంటే, పార్థసారథి 403/52 బై నంబర్ ఉపయోగించి అక్రమాలు చేశాడని నిర్ధారణ అయిందన్నారు. అన్ రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా పార్థసారథి 5 ఎకరాల ప్రభుత్వ భూమిని తనదంటూ ఆక్రమణ చేస్తున్నాడని హైడ్రా గుర్తించిందన్నారు. షేక్ పేట్ రెవెన్యూ అధికారుల లేఖ ప్రకారం భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఆక్రమణలు తొలగించబడ్డాయని, పార్థసారథి వేసిన ఫెన్సింగ్ లోపల ఉన్న షెడ్లను హైడ్రా తొలగించిందన్నారు. హైడ్రా ఆ 5 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి "ప్రభుత్వ భూమి" అని స్పష్టం చేసి బోర్డులు ఏర్పాటు చేసిందన్నారు. ఆక్రమణకు సంబధించి రెవెన్యూ, పోలీస్ శాఖల మధ్య సమన్వయన్ని పెంచుతూ కాలక్రమేణ చర్యలను చేపట్టతామని హైడ్రా తెలిపింది.
హైడ్రాను ప్రభుత్వం జులై 2024లో అధికారికంగా స్థాపించింది. ఇది పబ్లిక్ ఆస్తులు కాపాడుకోవడం, ఆక్రమణలు తొలగించడం, విపత్తుల నిర్వహణ కోసం ఏర్పడ్డ సంస్థ. ప్రభుత్వ ఆఫీసర్లు, హైడ్రా కమిషనర్ ప్రకారం, స్థాపన జరిగినప్పటి నుంచి హైడ్రా అనేక ఆపరేషన్ల ద్వారా సుమారు 900కి పైగా ఎకరాల పరిధిలోని ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంది.
