Let's talk: editor@tmv.in
బంజారాలేక్‌ను ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌

బంజారాలేక్‌ను ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌

Gaddamidi Naveen
9 ఏప్రిల్, 2026

హైదరాబాద్ నగరంలోని చెరువులు, కుంటల పరిరక్షణే ధ్యేయంగా హైడ్రా తన దూకుడును పెంచింది. ప్రజావాణిలో అందిన ఫిర్యాదుల నేపథ్యంలో బుధవారం నిర్వహించిన క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బంజారా లేక్, మామిడిపల్లి ప్రాంతాల్లోని ఆక్రమణలను స్వయంగా పరిశీలించారు.

బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 01లోని తాజ్ బంజారా లేక్ దుస్థితిపై స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ తో కలిసి కమిషనర్ సమీక్ష జరిపారు. ఒకప్పుడు స్వచ్ఛమైన నీటితో కళకళలాడిన ఈ సరస్సు, ప్రస్తుతం మురుగునీరు, ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయి, నగరంలోనే అత్యంత కలుషిత జలవనరుగా మారడం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నేరుగా మురుగునీరు చెరువులోకి చేరడం వల్ల దుర్వాసన వెదజల్లుతోంది. ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలోనే నిర్మాణాలు చేపట్టడం, వ్యర్థాలను పారబోసడం వల్ల చెరువు ఉనికి ప్రమాదంలో పడిందని పేర్కొన్నారు.

కట్టమైసమ్మ దేవాలయానికి వెళ్లే మార్గాన్ని ఆక్రమణదారులు మూసివేయడంపై భక్తుల నుంచి వచ్చిన ఫిర్యాదులను కూడా కమిషనర్ సీరియస్‌గా తీసుకున్నారు. ఈ అంశంపై పూర్తి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చెరువు పైభాగంలో ఉన్న ప్రభుత్వ భూమిని రక్షిస్తూ, సమగ్ర నివేదిక తయారు చేసి పునరుద్ధరణ చర్యలు చేపడతామని తెలిపారు. నివాసాలపై ప్రభావం లేకుండా చెరువును పరిరక్షించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.

మామిడిపల్లిలో మాయమైన చెరువులు

ఇదే సందర్భంగా శంషాబాద్ మండలం మామిడిపల్లి ప్రాంతంలో చెరువుల ఆక్రమణలపై కూడా కమిషనర్ పరిశీలన చేపట్టారు. ఒంగోని కుంట, కనకయ్య కుంట, మర్రివాణి కుంట, ఎర్రకుంట వంటి చెరువులు పూర్తిగా లేదా భాగంగా ఆక్రమణకు గురైనట్టు గుర్తించారు. వరద కాలువలను మూసివేయడం లేదా ఆక్రమించడం వల్ల వర్షాకాలంలో నీరు వెళ్లే మార్గం లేక నివాసాలు మునిగే ప్రమాదం ఉందని స్థానికులు చేసిన ఫిర్యాదులను పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులతో సమన్వయం చేసి చెరువులు, కాలువలపై పూర్తి సమాచారం సేకరించాలని కమిషనర్ ఆదేశించారు. ఆక్రమణదారులతో సమావేశం నిర్వహించి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని, అవసరమైతే హైడ్రా నేరుగా చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం అనుమతి లభించిన వెంటనే చెరువుల పునరుద్ధరణ, అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు.

బంజారాలేక్‌ను ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌ - Tholi Paluku