Let's talk: editor@tmv.in
బంగ్లా కోసం రూ.64 లక్షలు

బంగ్లా కోసం రూ.64 లక్షలు

FL - YUGDR
28 సెప్టెంబర్, 2025

ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ రాజ శేఖర్ తన స్వంత ప్రయోజనాలకు ఇస్తున్న ప్రాధాన్యత విద్యార్థులకు, సిబ్బందికి ఇవ్వడం లేదు. రాజశేఖర్ పదవీ బాధ్యతల్ని స్వీకరించినప్పటి నుంచీ ఏయూ లో ఏదో ఒక దుమారం రేగుతూనే వుంది. గతంలో పని చేసిన వైస్ ఛాన్సల్లందరూ టీమ్ వర్క్ చేస్తూ ఎక్కడికక్కడ సమస్యల్ని పరిష్కరించుకునే వారు. కానీ రాజశేఖర్ మాత్రం స్థానిక ఎంపీ శ్రీ భరత్ అండ చూసుకొని ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఎప్పటికప్పుడు యూనివర్శిటీ ప్రతిష్టకు భంగం కలిగి స్తున్నారన్న ఆరోపణలు వుండనే వున్నాయి.

అంతా నా ఇష్టం అంటూ యూనివర్శిటీ పరిపాలనా వ్యవస్థని సర్వనాశనం చేసేస్తున్నారు. ఏయూ శతాబ్ది ఉత్సవాలను కూడా పూర్తిగా నీరు గార్చేశారు. వందేళ్ళ ఏయూ చరిత్రలో 'మాయని మచ్చ'గానే రాజశేఖర్ పాలన సాగుతోంది. నిన్న గాక మొన్న సరైన సమయంలో వైద్యం అందక మణికంఠ అనే విద్యార్థి మృతి చెందిన విషయంలో యావత్ విద్యార్థి లోకం ఏలా స్పందించారో అందరికీ తెలిసిందే. ఇది కేవలం ఈ సమస్యకు సంబంధించిన స్పందన మాత్రమే కాదు. ఏయూ లో వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ పాలన పట్ల ఎంతటి అసంతృప్తి వుందో తెలిపే సంఘటన .

పదవీ బాధ్యతలు స్వీకరించిన మూడు నెలల్లోనే తాను నివాసముంటున్న రిజిస్ట్రార్ బంగ్లాకు మెరుగులు దిద్దడానికి 64 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. పైగా ఈ బంగ్లా నివాస యోగ్యంగానే వుంది. దీని కోసం కొత్తగా 64 లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ తన సొమ్ము కాదు గనుక తన ఇష్టం వచ్చినట్టు 64 లక్షల రూపాయలు ఈ బంగ్లా మెరుగులకు ఖర్చు చేశారు. ఇదే సమయంలో డాక్టర్ క్వార్టర్స్ కు లక్ష రూపాయల అంచనా ఖర్చుతో చిన్నపాటి మరమ్మత్తులు చేయించాలని రిజిస్ట్రార్ ఆరుసార్లు ఫైలు పంపినా వీసీ రాజశేఖర్ అందుకు నిరాకరించి ఫైలును వెనక్కు పంపేశారు. ఇది క్షమించరాని నేరం గానే పరిగణించాలి.

తమ క్వార్టర్స్లోమరమ్మత్తులు జరక్కే వైద్యులు బయటకు మరమ్మత్తులు జరగనందు వల్ల డాక్టర్ ఖాళీ చేసి బయటకు వెళ్లిపోయారు. ఫలితంగా అత్యవసర పిలుపు లకు డాక్టర్ అందుబాటులో లేకుండా పోయారు. మణికంఠ కు ఫిట్స్ వ్యాధి కొత్తగా వున్నది కాకపోవచ్చు. ఇంతవరకూ అత్యవసర వైద్యం అందుబాటులో వున్నందు వల్ల అతడి ప్రాణాలకు ముప్పు లేకుండా కాపాడ గలిగారు. మరి ఏయూలో డాక్టర్ అందుబాటులో వుండి వుంటే మణికంఠ ప్రాణానికి ముప్పు వాటిల్లి వుండేది కాదు కదా. గత మూడు నెలల్లోనూ ఇలాంటి అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి.

కానీ వీసీ ప్రతిదానికి కమిటీలను నియమించి తను తప్పించుకోడానికి ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు విద్యార్థుల్లో వినిపిస్తోంది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆవేశంతో విద్యార్థులు వీ సీ చాంబర్ లోకి వెళ్లి బీభత్సం సృష్టించారు అంటే పరిస్థితులు ఎంతగా దిగజారాయో అర్థం చేసుకోవచ్చు. వి సీ రాజశేఖర్ కేవలం విశాఖ ఎంపీ శ్రీ భరత్ మాట మాత్రమే వింటున్నారన్న అభిప్రాయంతో కూటమికి చెందిన మిగిలిన ప్రజాప్రతినిధులు విశ్వవిద్యాలయ వ్యవహారాలకు దూరంగా ఉండటం సమస్యను మరింత పెంచింది.

బంగ్లా కోసం రూ.64 లక్షలు - Tholi Paluku