Let's talk: editor@tmv.in
బంగ్లాలో ఇంధన సెగ: పొదుపు బాటలో ప్రభుత్వం

బంగ్లాలో ఇంధన సెగ: పొదుపు బాటలో ప్రభుత్వం

Shaik Mohammad Shaffee
4 ఏప్రిల్, 2026

పశ్చిమాసియాలో సాగుతున్న యుద్ధ జ్వాలలు బంగ్లాదేశ్‌ను ఇంధన సంక్షోభంలోకి నెట్టాయి. దేశంలో ఇంధన వినియోగాన్ని తగ్గించి, పొదుపు చర్యలను అమలు చేసేందుకు ప్రధానమంత్రి తారిఖ్ రెహ్మాన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల పనివేళలను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పరిమితం చేసింది. బ్యాంకులు మధ్యాహ్నం 3 గంటల వరకు లావాదేవీలు నిర్వహించి, సాయంత్రం 4 గంటలకల్లా పూర్తిగా మూసివేయాలని ఆదేశించింది. నిత్యావసరాలు, మందుల దుకాణాలు, హోటళ్లు మినహా మిగిలిన షాపింగ్ మాల్స్, వ్యాపార సంస్థలన్నీ సాయంత్రం 6 గంటలకే మూసివేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ప్రభుత్వ ఖర్చుల్లో భారీ కోత

కేవలం ఇంధనం మాత్రమే కాకుండా ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించుకునేందుకు బంగ్లాదేశ్ కఠిన నిబంధనలను విధించింది. సమావేశాలు, సెమినార్ల నిర్వహణలో అతిథి మర్యాదల ఖర్చును 50 శాతం తగ్గించుకోవాలని నిర్ణయించింది. దేశీయ శిక్షణా కార్యక్రమాలను సగానికి పైగా నిలిపివేయడంతో పాటు, అత్యవసరం కాని ప్రయాణాలను 30 శాతం మేర తగ్గించుకోవాలని అధికారులను ఆదేశించింది. వివాహాలు, ఇతర వేడుకల్లో అలంకారపు విద్యుత్ దీపాల వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది. పర్యావరణ హితమైన రవాణాకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ పాఠశాలలు విద్యుత్ బస్సులను దిగుమతి చేసుకుంటే సుంకం మినహాయింపు ఇవ్వాలని, వాణిజ్య విద్యుత్ బస్సులపై కేవలం 20 శాతం పన్ను విధించాలని నిర్ణయించింది.

డీజిల్ కోసం భారత్‌కు విన్నపం

దేశంలో ఇంధన కొరతను అధిగమించేందుకు బంగ్లాదేశ్ భారత్ సాయాన్ని అర్థించింది. తమకు డీజిల్ సరఫరా చేయాలని కోరుతూ ఢాకా నుంచి అభ్యర్థన అందిందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భారత్ ఎప్పుడూ పొరుగు దేశాలకు ఇంధన ఎగుమతుల్లో అగ్రస్థానంలో ఉంటుందని, బంగ్లాదేశ్ అభ్యర్థనను ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు. బంగ్లాదేశ్‌తో పాటు శ్రీలంక, మాల్దీవులు కూడా ఇంధన సాయం కోరాయని, భారత్ తన సొంత అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ దేశాలకు సాయం చేసే విషయంపై నిర్ణయం తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.

మైత్రీ పైప్‌లైన్ ద్వారా ఇంధన ప్రవాహం

భారత్-బంగ్లాదేశ్ మధ్య 2017 నుంచి ఇంధన సరఫరా కొనసాగుతోందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి గుర్తుచేశారు. నుమాలిఘర్ రిఫైనరీ నుంచి బంగ్లాదేశ్ పెట్రోలియం కార్పొరేషన్‌కు రైలు, జలమార్గాలు, 'భారత్-బంగ్లాదేశ్ ఫ్రెండ్‌షిప్ పైప్‌లైన్' ద్వారా డీజిల్ సరఫరా జరుగుతోంది. గతంలో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం ఇంధనం పంపిణీ సాగుతున్నప్పటికీ, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా దేశీయ అవసరాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూనే పొరుగు దేశాలకు అండగా ఉంటామని భారత్ స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ పొదుపు చర్యలు తాత్కాలికమేనని, ఆర్థిక వ్యవస్థను నిలబెట్టేందుకు ఇవి అనివార్యమని అధికారులు వివరిస్తున్నారు.