
బంగ్లాదేశ్ హైకమిషన్ ఎదుట నిరసనపై తప్పుడు ప్రచారాన్ని ఖండించిన భారత్
దేశ రాజధానిలోని బంగ్లాదేశ్ హైకమిషన్ ఎదుట జరిగిన నిరసనపై బంగ్లాదేశ్ మీడియాలో వచ్చిన కొన్ని కథనాలను భారత్ తప్పుడు ప్రచారంగా ఖండించింది. ఈ నిరసన వల్ల ఎలాంటి భద్రతా సమస్య తలెత్తలేదని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రంధీర్ జైస్వాల్ ఆదివారం ఈ విషయంపై మాట్లాడారు. బంగ్లాదేశ్‌లోని మైమెన్సింగ్ ప్రాంతంలో హిందూ యువకుడు దీపు చంద్ర దాస్ హత్యకు నిరసనగా డిసెంబర్ 20న న్యూఢిల్లీలో సుమారు 20 నుంచి 25 మంది యువకులు బంగ్లాదేశ్ హైకమిషన్ ఎదుట కొద్దిసేపు నిరసన తెలిపారని ఆయన చెప్పారు.
“ఆ యువకులు దీపు చంద్ర దాస్ హత్యను తీవ్రంగా ఖండిస్తూ నినాదాలు చేశారు. అలాగే బంగ్లాదేశ్‌లో మైనారిటీలకు రక్షణ కల్పించాలని కూడా కోరారు” అని జైస్వాల్ తెలిపారు. అయితే ఈ నిరసన పూర్తిగా శాంతియుతంగా సాగిందని, దౌత్య కార్యాలయ భద్రతకు ఎలాంటి ముప్పు ఏర్పడలేదని ఆయన స్పష్టం చేశారు.
నిరసనకారులు హైకమిషన్ ప్రాంగణంలోకి చొరబడేందుకు ప్రయత్నించలేదని, ఫెన్సింగ్‌ను దాటే ప్రయత్నం కూడా జరగలేదని చెప్పారు. అక్కడ ఉన్న పోలీసులు కొన్ని నిమిషాల్లోనే గుంపును చెదరగొట్టారని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోలు, దృశ్యాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని కూడా ఆయన పేర్కొన్నారు. భారత్‌లోని విదేశీ దౌత్య కార్యాలయాలు, రాయబారుల భద్రతకు తాము కట్టుబడి ఉన్నామని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. వియన్నా ఒప్పందం ప్రకారం విదేశీ రాయబార కార్యాలయాలకు భద్రత కల్పించడం భారత్ బాధ్యత అని జైస్వాల్ గుర్తు చేశారు.
ఇదిలా ఉండగా, బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న దాడులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని, బంగ్లాదేశ్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నామని విదేశాంగ శాఖ తెలిపింది.దీపు చంద్ర దాస్ హత్యలో పాల్గొన్న నిందితులను కఠినంగా శిక్షించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని భారత్ కోరిందని జైస్వాల్ వెల్లడించారు. ఈ హత్య “అమానుషమైనది” అని ఆయన అభివర్ణించారు.
డిసెంబర్ 18న దీపు చంద్ర దాస్‌పై మతదూషణ ఆరోపణలతో గుంపు దాడి చేసి హత్య చేయగా, అనంతరం మృతదేహాన్ని తగులబెట్టిన ఘటన తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఈ ఘటనపై అంతర్జాతీయ స్థాయిలో కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
స్పందించిన బంగ్లా ప్రభుత్వం
భారత ప్రకటనను బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ విదేశీ వ్యవహారాల సలహాదారు తౌహిద్ హొస్సేన్ పూర్తిగా తిరస్కరించారు. భారత్ ఈ విషయాన్ని చాలా సింపుల్‌గా చూపిస్తోందని ఆయన విమర్శించారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే దౌత్య ప్రాంతంలోకి నిరసనకారులు అంత దగ్గరకు ఎలా రాగలిగారని ఆయన ప్రశ్నించారు. "అధికారులు అనుమతిస్తే తప్ప, సాధారణ పరిస్థితుల్లో అది సాధ్యం కాదు" అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. తమ దేశ పత్రికల్లో వచ్చిన వార్తలు నిజమేనని, అవి తప్పుడు ప్రచారం కావని హొస్సేన్ స్పష్టం చేశారు. నిరసనకారులు కేవలం స్లోగన్లు మాత్రమే ఇవ్వలేదని, ఇతర వ్యాఖ్యలు కూడా చేశారని ఆయన పేర్కొన్నారు. అయితే, ఢిల్లీలో ఉన్న బంగ్లాదేశ్ రాయబారికి ప్రాణహాని ఉందని వస్తున్న వార్తలకు మాత్రం తన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని ఆయన స్పష్టం చేశారు.
