Let's talk: editor@tmv.in
బంగ్లాదేశ్‌ హైకమిషనర్‌కు భారత్ సమన్లు

బంగ్లాదేశ్‌ హైకమిషనర్‌కు భారత్ సమన్లు

Shaik Mohammad Shaffee
18 డిసెంబర్, 2025

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉన్న భారత హైకమిషన్‌కు భద్రతా ముప్పు ఉందన్న సమాచారంతో భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం బంగ్లాదేశ్ హైకమిషనర్ ఎం. రియాజ్ హమీదుల్లాను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పిలిపించి వివరణ కోరింది.

భారత హైకమిషన్‌కు ముప్పు ఉందని హెచ్చరిక అందిన తర్వాత ఈ చర్య తీసుకున్నారు. అలాగే, బంగ్లాదేశ్‌లోని నేషనల్ సిటిజన్ పార్టీ నాయకుడు హస్నాత్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు కూడా ఈ వివాదానికి కారణమయ్యాయి. ఆయన బహిరంగంగా మాట్లాడుతూ, ఒకవేళ బంగ్లాదేశ్‌లో అస్థిరత ఏర్పడితే, భారత ఈశాన్య రాష్ట్రాలను (సెవెన్ సిస్టర్స్) ఒంటరి చేస్తామని, అక్కడి వేర్పాటువాదులకు ఆశ్రయం ఇస్తామని ఆయన బహిరంగంగా హెచ్చరించారు. అబ్దుల్లా తన ప్రసంగంలో 'చికెన్స్ నెక్' (సిలిగురి కారిడార్) గురించి ప్రస్తావిస్తూ, భౌగోళికంగా ఆ ప్రాంతం బలహీనంగా ఉందని, భారత్‌కు ఆ ప్రాంతంతో సంబంధాలు తెంచేస్తామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.దీంతో హస్నాత్ అబ్దుల్లా భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడే నాయకుడిగా గుర్తింపు పొందారు. ఈ పరిణామాల నేపథ్యంలో, భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ అధికారులను అప్రమత్తం చేస్తూ, భారత దౌత్య కార్యాలయ భద్రతపై పూర్తి బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేసింది.

విజయ్ దివస్ వేడుకలు

ఒకవైపు రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, 1971 విముక్తి యుద్ధం (లిబరేషన్ వార్) 54వ వార్షికోత్సవం సందర్భంగా రెండు దేశాల మధ్య స్నేహపూర్వక వేడుకలు జరిగాయి. డిసెంబర్ 16న 'విజయ్ దివస్' సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 1971 యుద్ధంలో పాల్గొన్న ఎనిమిది మంది బంగ్లాదేశ్ ముక్తియోధులు కోల్‌కతా వేడుకలకు రాగా, ఎనిమిది మంది భారత మాజీ సైనిక వీరులు ఢాకాలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. ఇది ఇరు దేశాల మధ్య స్నేహబంధానికి నిదర్శనంగా నిలిచింది.

ఢిల్లీలోని బంగ్లాదేశ్ దౌత్య కార్యాలయంలో బంగ్లాదేశ్ విజయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బంగ్లాదేశ్ హైకమిషనర్ ఎం. రియాజ్ హమీదుల్లా పాల్గొని ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ, “బంగ్లాదేశ్ ప్రజల ఆకాంక్షలను, ముఖ్యంగా యువత ఆశయాలను నెరవేర్చడమే మా లక్ష్యం. మా దేశంలో యువత సంఖ్య ఎక్కువగా ఉంది. భారత్‌తో మా సంబంధాలు పరస్పర ప్రయోజనాలపై ఆధారపడి ఉన్నాయి. శాంతి, అభివృద్ధి, ప్రాంతీయ భద్రత కోసమే మేము కలిసి పనిచేస్తున్నాం” అని చెప్పారు. భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉన్న పరస్పర ఆధారపడే సంబంధాలు ఇరు దేశాలకు మేలు చేస్తాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బంగ్లాదేశ్ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే సాంస్కృతిక ప్రదర్శనలు కూడా నిర్వహించారు. దేశ స్వాతంత్య్రం, విముక్తి పోరాటాన్ని గుర్తుచేసేలా ఈ వేడుకలు జరిగాయి.

బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయినప్పటి నుండి భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు కాస్త క్లిష్టంగా మారాయి. ముఖ్యంగా హస్నత్ అబ్దుల్లా వంటి నాయకుల వ్యాఖ్యలు భారత్‌కు ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే, దౌత్య మార్గాల ద్వారా భద్రతను నిర్ధారించుకుంటూనే, స్నేహ సంబంధాలను కొనసాగించడానికి భారత్ ప్రయత్నిస్తోంది.

బంగ్లాదేశ్‌ హైకమిషనర్‌కు భారత్ సమన్లు - Tholi Paluku