Let's talk: editor@tmv.in
బంగ్లాదేశ్‌ స్పీకర్‌గా హఫీజుద్దీన్‌ అహ్మద్‌

బంగ్లాదేశ్‌ స్పీకర్‌గా హఫీజుద్దీన్‌ అహ్మద్‌

Shaik Mohammad Shaffee
13 మార్చి, 2026

బంగ్లాదేశ్‌లో గురువారం జరిగిన 13వ జాతీయ సంసద్ (పార్లమెంట్) ప్రారంభ సమావేశాల్లో స్పీకర్‌గా హఫీజుద్దీన్‌ అహ్మద్‌, డిప్యూటీ స్పీకర్‌గా బారిస్టర్‌ కైసర్‌ కమల్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సభానాయకుడు, ప్రధానమంత్రి తారిఖ్‌ రెహమాన్‌ సూచన మేరకు సీనియర్‌ సభ్యుడు ఖండకర్‌ మొషారఫ్‌ హుస్సేన్‌ అధ్యక్షతన ఈ ఎన్నిక ప్రక్రియ కొనసాగింది. 2024 జూలైలో విద్యార్థుల ఉద్యమం, తదనంతర పరిణామాల తర్వాత ఫిబ్రవరి 12న జరిగిన ఎన్నికల్లో బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (బీఎన్‌పీ) ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.

వీర యోధుడు.. ఆరు సార్లు ఎంపీ

నూతన స్పీకర్‌గా ఎన్నికైన హఫీజుద్దీన్ అహ్మద్ 'బీర్ బిక్రమ్' బిరుదు పొందిన విశ్రాంత సైనిక అధికారి, స్వాతంత్ర్య సమరయోధుడు. భోలా-3 నియోజకవర్గం నుంచి ఆయన ఆరుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. గతంలో విముక్తి యుద్ధ శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన, ప్రస్తుతం బీఎన్‌పీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. హఫీజుద్దీన్ పేరును చీఫ్ విప్ నూరుల్ ఇస్లాం మణి ప్రతిపాదించగా, అధికార పార్టీ విప్ రకీబుల్ ఇస్లాం బలపరిచారు. సభలో ఎలాంటి వ్యతిరేకత లేకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.

యువ నేతకు డిప్యూటీ స్పీకర్ బాధ్యత

నెట్రకోనా-1 నియోజకవర్గ ప్రతినిధి బారిస్టర్ కైసర్ కమల్ డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు. జాతీయ రాజకీయాల్లో యువ నేతగా గుర్తింపు పొందిన ఈయన వృత్తిరీత్యా బారిస్టర్. గతంలో భూసంస్కరణల శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన కైసర్, బీఎన్‌పీలో న్యాయ వ్యవహారాల కార్యదర్శిగా ఉన్నారు. విప్ రుహుల్ ఖుద్దూస్ తాలూక్దార్ దూలు ఈయన పేరును ప్రతిపాదించగా, విప్ ఏబీఎం అష్రఫ్ ఉద్దీన్ బలపరిచారు. ఎన్నిక ప్రక్రియ అనంతరం అధ్యక్షుడు మొహమ్మద్ షహాబుద్దీన్ వీరిద్దరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రధాని తారిఖ్ రెహమాన్ సమక్షంలో జరిగిన ఈ వేడుకతో 13వ పార్లమెంటు ప్రస్థానం అధికారికంగా మొదలైంది.