
బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు: కేర్‌టేకర్ ప్రభుత్వ వ్యవస్థ పునరుద్ధరణ
బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశ సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పును వెలువరించింది. దేశంలో విద్యార్థుల అల్లర్ల కారణంగా మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయి, ప్రస్తుతం నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో కేర్‌టేకర్ (తాత్కాలిక) ప్రభుత్వం నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజా తీర్పు ద్వారా ఎన్నికల సమయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించే పార్టీ రహిత కేర్‌టేకర్ ప్రభుత్వ వ్యవస్థను తిరిగి అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. 2011లో సుప్రీంకోర్టే ఈ వ్యవస్థను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని చట్టవిరుద్ధమని ప్రకటిస్తూ, ప్రధాన న్యాయమూర్తి సయ్యద్ రెఫాత్ అహ్మద్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల అప్పిలేట్ డివిజన్ ఈ చారిత్రక తీర్పును ఇచ్చింది.
1996లో రాజ్యాంగానికి 13వ సవరణ ద్వారా ఈ కేర్‌టేకర్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఏ రాజకీయ పార్టీ ప్రభావం లేకుండా, కేవలం 90 రోజుల పాటు తటస్థ ప్రభుత్వం పాలనలో స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడమే దీని ముఖ్య లక్ష్యం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, ప్రస్తుతం ఉన్న యూనస్ కేర్‌టేకర్ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే త్వరలో రాబోయే 13వ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత జరిగే 14వ పార్లమెంట్ ఎన్నికల నుంచి మాత్రమే ఈ పునరుద్ధరించబడిన కేర్‌టేకర్ వ్యవస్థ పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుంది. ఈ తీర్పు యూనస్ ప్రభుత్వ అధికార పరిధిని, విశ్వసనీయతను మరింతగా పెంచే అవకాశం ఉంది.
మరోవైపు మాజీ ప్రధాని షేక్ హసీనాకు సంబంధించిన అంశం కూడా బంగ్లాదేశ్ రాజకీయాలను ప్రభావితం చేస్తోంది. గత ఏడాది జరిగిన ఆందోళనల సమయంలో "మానవత్వంపై చేసిన నేరాలకు" గాను బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్, హసీనాకు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై షేక్ హసీనా స్పందిస్తూ, ఎన్నిక కాని ప్రభుత్వం ఏర్పాటు చేసి, దాని ద్వారా నిర్వహించబడుతున్న ట్రిబ్యునల్ నిర్ణయానికి ప్రజాస్వామ్య అధికారం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె భారత్‌లో ఉన్నారు. హసీనాను తమకు అప్పగించాలని యూనస్ ప్రభుత్వం కోరుతున్నప్పటికీ, భారత్ ఈ విషయంలో ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఈ కీలక సమయంలో యూనస్ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు ఈ తీర్పునివ్వడం రాజకీయంగా కీలక పరిణామంగా నిలిచింది.
