
బంగ్లాదేశ్ లో మరోసారి భూకంపం
బంగ్లాదేశ్‌లో మరోసారి భూమి కంపించింది. శుక్రవారం దేశంలో సంభవించిన 5.7 తీవ్రత భూకంపం వచ్చి 24 గంటలు కూడా గడవకముందే శనివారం ఉదయం మరోసారి ప్రకంపనలు నమోదయ్యాయి. ఈసారి ఢాకా నగరానికి సమీపంలోని బైపైల్–అశులియా ప్రాంతంలో రిక్టర్ స్కేల్ పై 3.3 తీవ్రతతో భూమి కంపించింది.
బంగ్లాదేశ్ వాతావరణ శాఖకు చెందిన ఎర్త్‌క్వేక్ ఆబ్జర్వేషన్, రీసెర్చ్ సెంటర్ అధికారులు ఉదయం 10:36 గంటలకు స్వల్ప ప్రకంపనలు నమోదైన తేదిని నమోదు చేశారు. ఈ మేరకు సంస్థ అధికారి నిజాముద్దీన్ అహ్మద్ మాట్లాడుతూ ఇది చాలా స్వల్ప భూకంపం మాత్రమే… దాని ఎపిసెంటర్ బైపైల్ అని పిలుస్తారన్నారు.
9కి చేరిన మృతుల సంఖ్య
శుక్రవారం వచ్చిన 5.7 తీవ్రత భూకంపం దేశవ్యాప్తంగా విధ్వంసం సృష్టించింది. ఇప్పటివరకు 9 మంది మృతి చెందారు. 100 మందికి పైగా గాయాలు అయినట్లు అధికారులు ధృవీకరించారు. తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ ముహమ్మద్ యునస్ ప్రాణనష్టం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అలాగే ఢాకా అర్మానిటోలా–కోసైతోలి ప్రాంతంలో ఉన్న 8 అంతస్తుల భవనం గోడలు, కార్నిసు నుంచి ఇటుకలు–టైళ్లు కూలిపోవడంతో అక్కడున్న కస్టమర్లు, పాదచారులు తీవ్రంగా గాయపడ్డారు. బీఫ్ స్టాల్ ముందు ప్రమాదం జరగడంతో ప్రజలు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది రాకముందే గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
అయితే అక్కడికి తీసుకెళ్లేలోపు ముగ్గురు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
పలువురు మృతి
ముగ్దా మెదీనాబాగ్‌లో నిర్మాణంలో ఉన్న భవనంలో రైలింగ్ కూలిపోవడంతో సెక్యూరిటీ గార్డు మక్సుద్ (50) మృతి చెందాడు. అతని స్వగ్రామం లక్ష్మీపూర్ జిల్లా రామ్‌గతి ఉపజిల్లా అని చీఫ్ అడ్వైజర్ కార్యాలయం వివరించింది. దీంతో పాటు నర్సింఘ్డి జిల్లాలో భయంతో హైరైజ్ భవనాల నుంచి పరుగులు తీస్తూ 4 మృతి చెందారు. వంద మందికి పైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. చినిష్‌పూర్ యూనియన్ గబ్తలిలో నిర్మాణ సామగ్రి కూలడంతో నలుగురు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన 8 ఏళ్ల హాఫేజ్ ఉమర్ ను ఢాకా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరణించాడు. అతని తండ్రి దెల్వార్ హొసైన్ ఉజ్జల్ పరిస్థితి విషమంగా ఉంది. పాలాష్ ఉపజిల్లా – చార్సిందూర్ యూనియన్‌లోని మలితా పశ్చిమపారా గ్రామానికి చెందిన కాజేం అలీ భుయియన్ (75) మట్టి ఇల్లు కూలి శిథిలాల క్రింద పడి మరణించాడు. డంగా యూనియన్ – ఉస్లాంపారా నయాపారా గ్రామానికి చెందిన నసిరుద్దీన్ (60) కూడా అదే ప్రాంతంలో భూకంప సమయంలో ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
