Let's talk: editor@tmv.in
బంగ్లాదేశ్ మూకదాడి ఘటనపై ఢిల్లీలో ఆందోళన

బంగ్లాదేశ్ మూకదాడి ఘటనపై ఢిల్లీలో ఆందోళన

Pinjari Chand
24 డిసెంబర్, 2025

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడు దీపు చంద్ర దాస్‌ను మూక దాడిలో హత్య చేసిన ఘటనను నిరసిస్తూ మంగళవారం ఢిల్లీలోని బంగ్లాదేశ్‌ హైకమిషన్‌ సమీపంలో చేపట్టిన ఆందోళనల సందర్భంగా విశ్వ హిందూ పరిషత్‌తో పాటు ఇతర హిందూ సంఘాల కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులను, దారుణ హింసకు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ పెద్ద సంఖ్యలో నిరసనకారులు హైకమిషన్‌ వద్దకు చేరుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా భద్రతా బలగాలను మోహరించారు.

నిరసనకారులు పోలీసు బ్యారికేడ్లను తోసుకుంటూ భవనం లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని పలువురు నిరసనకారులను బస్సుల్లో ఎక్కించి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా నిరసనకారులు జై శ్రీరామ్ నినాదాలు చేశారు. ఈ ఆందోళనల సమయంలో బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. నోబెల్‌ విజేత మహ్మద్‌ యూనస్‌ ఫోటోలు, బంగ్లాదేశ్‌ జెండాను కాల్చుతూ నిరసనకారులు నినాదాలు చేశారు. బంగ్లాదేశ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు మారుమోగాయి.

ఒక మహిళా కార్యకర్త మాట్లాడుతూ ఒక హిందువును చంపారు. మేమెప్పుడైనా వారిపై దాడి చేశామా? ప్రభుత్వం వెంటనే బంగ్లాదేశ్‌పై చర్యలు తీసుకోవాలి. అవసరమైతే మా ప్రాణాలనైనా త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించారు. ఇది దేవతల దేశం. ఇక్కడ హిందువుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. మేమెవ్వరినీ చంపం. కానీ మా సోదరీమణులు, కుమార్తెల గౌరవం ప్రమాదంలో పడుతోందని అన్నారు.

బంగ్లాదేశ్ పాకిస్థాన్లా ప్రవర్తిస్తోంది

ఇంకొకరు 1971 యుద్ధాన్ని ప్రస్తావిస్తూ, భారత సైన్యం వల్లే బంగ్లాదేశ్‌కు విముక్తి లభించింది. ఆ యుద్ధంలో సుమారు ఐదు లక్షల మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు అదే బంగ్లాదేశ్‌ పాకిస్తాన్‌లా ప్రవర్తిస్తోంది అని ఆరోపించారు. ఈ నిరసనల నేపథ్యంలో బంగ్లాదేశ్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ భారత హైకమిషనర్‌ ప్రణయ్‌ వర్మను పిలిపించి వివరణ కోరినట్లు సమాచారం. 27 ఏళ్ల హిందూ యువకుడు దీపు చంద్ర దాస్ బంగ్లాదేశ్‌లోని మైమెన్సింగ్‌లో డిసెంబర్‌ 18న మూకదాడిలో దారుణంగా హత్యకు గురయ్యాడు. దైవదూషణ ఆరోపణలతో అతడిని కొట్టి చంపిన అనంతరం మృతదేహాన్ని తగలబెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటన బంగ్లాదేశ్‌లో మైనారిటీల భద్రతపై అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది.

బంగ్లాదేశ్ మూకదాడి ఘటనపై ఢిల్లీలో ఆందోళన - Tholi Paluku