
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష
బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్-1 (ఐసీటీ-1) సంచలన తీర్పునిచ్చింది. గత ఏడాది జూలై-ఆగస్టులో జరిగిన విద్యార్థి నిరసనలను అణచివేసే సమయంలో మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాలపై ఆమెను దోషిగా తేల్చిన కోర్టు, మరణశిక్ష విధిస్తూ సోమవారం తీర్పు వెలువరించింది. హసీనాతో పాటు మాజీ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్‌కు సైతం మరణశిక్ష విధించగా, మాజీ పోలీస్ చీఫ్ చౌధురీ అబ్దుల్లా అల్-మామున్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధించారు.
జస్టిస్ గోలం మూర్తజా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పును ప్రకటించింది. 2024 జూలై-ఆగస్టు ఆందోళనల్లో దాదాపు 1,400 మంది మృతి చెందారని కోర్టు పేర్కొంది. "హసీనా మానవత్వాన్ని మరిచారు. ఆందోళనకారులను చంపాలని ఆమె ఆదేశించారు. చేసిన నేరంపై ఆధారాలు ఉన్నాయి. ఆమెకు మరణశిక్షే సరి" అని ట్రిబ్యునల్ వ్యాఖ్యానించింది.
బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలకు ప్రధాన సూత్రధారి షేక్ హసీనానే అని కోర్టు స్పష్టం చేసింది. ప్రధానిగా ఉంటూ ఒక వ్యవస్థీకృత పద్ధతిలో ఆందోళనకారులను చంపాలని ఆదేశించారని తెలిపింది. తనకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వారిని చంపాలని ఆమె ఆదేశాలు ఇచ్చారని, 2024 ఆగస్టు 5న ఢాకాలో నిరసనకారులపై ఆర్మీ కాల్పులు జరిపిందని, ఈ సందర్భంగా హెలికాప్టర్లు, ప్రాణాంతక ఆయుధాలు ఉపయోగించాలని ఆమె ఆదేశించారని న్యాయమూర్తి దర్యాప్తు నివేదికను చదివి వినిపించారు. గాయపడినవారికి వైద్యం అందించేందుకు కూడా నిరాకరించారని పేర్కొన్నారు.
2024 జూలై 14వ తేదీన ఢాకా యూనివర్సిటీ వీసీకి ఫోన్ చేసి, నిరసనకారులను ఉద్దేశించి "ఆ రజాకార్లను ఉరి తీస్తా. వాళ్లకు మద్దతుగా నిలుస్తున్నవాళ్లను కూడా చంపేస్తా. ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు" అంటూ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని కోర్టు పేర్కొంది. విద్యార్థి నాయకుడు అబూ సయ్యద్ మృతి చెందిన పోస్ట్‌మార్టం నివేదికను ప్రభుత్వ వైద్యుడిని బెదిరించి ఐదుసార్లు మార్పించినట్లు కూడా కోర్టు దృష్టికి వచ్చింది.
దేశవ్యాప్తంగా హై అలర్ట్
తీర్పు నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో, ముఖ్యంగా రాజధాని ఢాకాలో హై అలర్ట్ ప్రకటించారు. ఐసీటీ చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేసి, భారీగా ఆర్మీని మోహరించారు. హసీనా మద్దతుదారులు, అవామీ లీగ్ కార్యకర్తలు దేశవ్యాప్తంగా నిరసనలకు దిగడంతో హింస చెలరేగే అవకాశం ఉందని భావించి, వాహనాలు తగలబెట్టేందుకు, బాంబులు విసిరేందుకు ప్రయత్నిస్తే వారిని కాల్చివేయాలని ('షూట్ ఎట్ సైట్') ఢాకా పోలీస్ చీఫ్ షేక్ మహమ్మద్ సజ్జత్ అలీ ఆదేశాలు జారీ చేశారు.
భారత్ నుండి హసీనా స్పందన
విద్యార్థుల ఆందోళనల కారణంగా గతేడాది ఆగస్టు 5న బంగ్లాదేశ్‌ను వీడి భారత్‌కు వచ్చిన షేక్ హసీనా, ఢిల్లీలోని ఓ రహస్య ప్రదేశంలో ఆశ్రయం పొందుతున్నారు. తీర్పు వెలువడడానికి ముందు, తర్వాత కూడా ఆమె అవామీ లీగ్ కార్యకర్తలను ఉద్దేశించి ఆడియో సందేశాలు విడుదల చేశారు.
"నేను బతికే ఉన్నాను, ఉంటాను. ప్రజల సంక్షేమం కోసం నా పనిని ప్రారంభిస్తాను. వాళ్లు ఏ తీర్పు అయినా ఇవ్వనివ్వండి. నాకు సంబంధం లేదు. దేవుడు ఇచ్చిన ప్రాణం ఆయనే తీసుకుంటాడు. అప్పటివరకు నా ప్రజల కోసం పనిచేస్తాను" అని హసీనా ధైర్యంగా ప్రకటించారు. తనపై వచ్చినవి తప్పుడు ఆరోపణలని తోసిపుచ్చిన ఆమె, ఈ తీర్పు పక్షపాతంతో కూడినదని, రాజకీయ ప్రేరేపితమైనదని విమర్శించారు. తాత్కాలిక ప్రభుత్వం తన పార్టీని నాశనం చేయాలని చూస్తోందని, కానీ అవామీ లీగ్ అనేది ప్రజల్లోంచి పుట్టుకొచ్చిందని ఆమె పేర్కొన్నారు. అయితే, కోర్టు తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా పూర్తి లాక్‌డౌన్ తీసుకురావాలని ఆమె తన కార్యకర్తలకు పిలుపునివ్వడం ఉద్రిక్తతలను మరింత పెంచింది.
షేక్ హసినా తీర్పును సవాల్ చేయగలరా?
బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు మరణశిక్ష విధించబడినప్పటికీ, ఆమె ప్రవాసంలో ఉన్నప్పటికీ ఈ తీర్పును సవాలు చేసే హక్కు చట్టబద్ధంగా ఉంది. బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ చట్టం-1973 ప్రకారం, ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై ఆమెకు సుప్రీం కోర్టు అప్పీలేట్ డివిజన్‌లో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. ఈ అప్పీల్‌ను సాధారణంగా తీర్పు వెలువడిన 30 రోజుల్లోపు దాఖలు చేయాల్సి ఉంటుంది.
అయితే, హసీనా ప్రస్తుతం భారత్‌లో ప్రవాసంలో ఉన్నందున, ఈ అప్పీల్‌ను వాస్తవంగా దాఖలు చేయడం కష్టమవుతుంది. చట్టపరమైన మార్గాలు ఉన్నప్పటికీ, ఆమె బంగ్లాదేశ్‌కు తిరిగి రావడం లేదా అరెస్ట్ కావడం వంటి షరతులు అప్పీల్ ప్రక్రియకు ఆటంకం కలిగించవచ్చు. చివరికి, ఈ న్యాయ ప్రక్రియలు ముగిసిన తర్వాత కూడా, ఆమెకు బంగ్లాదేశ్ అధ్యక్షుని వద్ద క్షమాభిక్ష కోరే అవకాశం ఉంటుంది. మొత్తంగా చూస్తే, చట్టపరమైన మార్గాలు ఉన్నప్పటికీ, హసీనా భవిష్యత్తు రాజకీయ, అంతర్జాతీయ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు.
