
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు
బంగ్లాదేశ్ రాజకీయాల్లో దశాబ్దాల పాటు తనదైన ముద్ర వేసిన మాజీ ప్రధాని ఖలీదా జియా (80) అంత్యక్రియలు బుధవారం సాయంత్రం ముగిశాయి. ఢాకాలోని పార్లమెంట్ భవనం సమీపంలో ఉన్న మానిక్ మియా అవెన్యూ వద్ద లక్షలాది మంది అభిమానులు, ప్రజల మధ్య ఆమెకు కన్నీటి వీడ్కోలు పలికారు.
అశేష జనవాహిని మధ్య తుది యాత్ర
మంగళవారం తుదిశ్వాస విడిచిన ఖలీదా జియా భౌతికకాయాన్ని బుధవారం భారీ కాన్వాయ్‌లో ఆమె నివాసం నుండి అంతిమ సంస్కారాలు జరిగే ప్రదేశానికి తీసుకువచ్చారు. తమ ప్రియతమ నాయకురాలిని చివరిసారిగా చూసేందుకు బంగ్లాదేశ్ నలుమూలల నుండి ప్రజలు భారీగా తరలివచ్చారు. జాతీయ జెండాతో కప్పిన ఆమె శవపేటిక వద్ద బీఎన్‌పీ కార్యకర్తలు ఆమె ఫోటోలు పట్టుకుని అశ్రునయనాల మధ్య వీడ్కోలు పలికారు.
హాజరైన భారత విదేశాంగ మంత్రి
అంత్యక్రియలకు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్, ప్రధాన న్యాయమూర్తి జుబయేర్ రెహ్మాన్ చౌదరి, ఖలేదా జియా కుమారుడు, బీఎన్‌పీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారిక్ రెహ్మాన్ హాజరయ్యారు. భారతదేశం తరఫున విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఈ అంత్యక్రియలకు హాజరయ్యారు.
ఎస్. జైశంకర్ ఢాకా చేరుకోగానే ఖలీదా జియా కుమారుడు, బీఎన్‌పీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారిక్ రెహమాన్‌ను కలిసి ప్రధాని నరేంద్ర మోడీ పంపిన సంతాప లేఖను అందజేశారు. భారత్ తరఫున ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. పాకిస్థాన్, నేపాల్, భూటాన్, శ్రీలంక, మాల్దీవుల నుండి కూడా ఉన్నత స్థాయి ప్రతినిధులు ఈ అంత్యక్రియలకు హాజరయ్యారు. ఢాకాలోని వివిధ దేశాల రాయబారులు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
భర్త సమాధి పక్కనే..
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా అంత్యక్రియలు బుధవారం సాయంత్రం స్థానిక కాలమానం ప్రకారం 4:30 గంటలకు ముగిశాయి. 1981లో హత్యకు గురైన ఆమె భర్త, మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహమాన్ సమాధి పక్కనే ఆమెను పూర్తి అధికారిక లాంఛనాలతో ఖననం చేశారు. ఈ సందర్భంగా బైతుల్ ముకర్రం జాతీయ మసీదు ప్రధాన ఇమామ్ మహమ్మద్ అబ్దుల్ కాదర్ ఆధ్వర్యంలో 'నమాజ్-ఏ-జనాజా' (అంత్యక్రియల ప్రార్థనలు) నిర్వహించారు. ఆమె మృతికి సంతాపంగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం మూడు రోజుల పాటు జాతీయ సంతాప దినాలను ప్రకటించింది.
అనారోగ్యంతో పోరాటం
ఖలీదా జియా గత కొంతకాలంగా కాలేయం, మూత్రపిండాల సమస్యలతో పాటు గుండె జబ్బు, మధుమేహంతో బాధపడుతున్నారు. నవంబర్ 21న సాయుధ దళాల దినోత్సవం సందర్భంగా ఆమె చివరిసారిగా బహిరంగంగా కనిపించారు. ఆ తర్వాత ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో నవంబర్ 23న ఆసుపత్రిలో చేరిన ఆమె, దాదాపు 36 రోజుల పాటు మృత్యువుతో పోరాడి మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు.
నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన ఆమె రాజకీయ ప్రస్థానం అనేక ఎత్తుపల్లాలతో కూడి ఉంది. 1981లో భర్త హత్య తర్వాత అనివార్య పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చిన ఆమె, 1991లో బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. ఆమె మరణంతో బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఒక సుదీర్ఘ అధ్యాయం ముగిసింది.
