Let's talk: editor@tmv.in
బంగ్లాదేశ్‌ నూతన ప్రధానిగా తారిఖ్ రెహమాన్ ప్రమాణస్వీకారం

బంగ్లాదేశ్‌ నూతన ప్రధానిగా తారిఖ్ రెహమాన్ ప్రమాణస్వీకారం

Shaik Mohammad Shaffee
18 ఫిబ్రవరి, 2026

పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో సుదీర్ఘ రాజకీయ విరామం తర్వాత పెను మార్పు చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) ఛైర్మన్ తారిఖ్ రెహమాన్ మంగళవారం ఆ దేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గత 20 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న ఆ పార్టీ, తాజాగా జరిగిన 13వ జాతీయ పార్లమెంట్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి మళ్లీ పీఠాన్ని దక్కించుకుంది. మంగళవారం సాయంత్రం 4:15 గంటలకు జాతీయ పార్లమెంట్ భవనంలోని సౌత్ ప్లాజాలో జరిగిన అట్టహాసమైన కార్యక్రమంలో అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ ఆయనతో ప్రమాణం చేయించారు. 2001-2006 మధ్య చివరిసారిగా అధికారంలో ఉన్న బీఎన్‌పీ, మళ్లీ ఇన్నేళ్లకు అధికార పగ్గాలు చేపట్టడం గమనార్హం.

కొలువుదీరిన కొత్త మంత్రిమండలి

తారిఖ్ రెహమాన్ నేతృత్వంలోని నూతన మంత్రిమండలిలో యువతకు, కొత్త నాయకత్వానికి ప్రాధాన్యం లభించింది. మొత్తం 17 మంది మంత్రులు, 24 మంది సహాయ మంత్రులతో కూడిన ఈ కేబినెట్‌లో మెజారిటీ సభ్యులు తొలిసారిగా పదవులు చేపట్టిన వారే కావడం విశేషం. స్వయంగా ప్రధాని తారిఖ్ రెహమాన్ కూడా తన రాజకీయ జీవితంలో తొలిసారిగా కేబినెట్ సభ్యునిగా బాధ్యతలు చేపట్టారు. గతంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎలాంటి ప్రభుత్వ పదవులను నిర్వహించలేదు. ఈ చారిత్రక ఘట్టాన్ని వీక్షించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న బీఎన్‌పీ శ్రేణులు, సామాన్య ప్రజలు భారీగా తరలివచ్చారు. మానిక్ మియా అవెన్యూ పరిసర ప్రాంతాలన్నీ మధ్యాహ్నం నుంచే జనసంద్రాన్ని తలపించాయి.

ప్రమాణ స్వీకారంపై ‘రెఫరెండం’ చిచ్చు

కొత్త ప్రభుత్వం కొలువుదీరే వేళ ‘జూలై చార్టర్’ అమలుపై నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం) తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చే ఈ ప్రతిపాదనకు 60 శాతం మంది ఓటర్లు అనుకూలంగా ఓటు వేయడంతో, ఎంపీలందరూ ‘రాజ్యాంగ సంస్కరణల మండలి’ సభ్యులుగా రెండోసారి ప్రమాణం చేయాలని నిబంధన విధించారు. అయితే, దీనిని బీఎన్‌పీ తీవ్రంగా వ్యతిరేకించింది. తాము కేవలం ఎంపీలుగానే ఎన్నికయ్యామని, రాజ్యాంగంలో ఇంకా చేర్చని మండలి సభ్యులుగా ప్రమాణం చేయబోమని స్పష్టం చేసింది. దీనికి భిన్నంగా, జమాతే ఇస్లామీ పార్టీ మాత్రం సంస్కరణలు లేకుండా పార్లమెంటుకు అర్థం లేదని వాదిస్తూ తొలుత ప్రమాణ స్వీకారానికి నిరాకరించింది. దీంతో కొంతసేపు గందరగోళం నెలకొన్నప్పటికీ, చివరకు జమాతే ఇస్లామీ మెట్టు దిగడంతో ప్రతిష్టంభన తొలగి ఎంపీలందరూ బాధ్యతలు చేపట్టారు.

ఉద్యమ సెగ నుంచి.. ప్రజాస్వామ్యం వైపు!

2024లో విద్యార్థులు, ప్రజలు చేపట్టిన భారీ ఉద్యమ ఫలితంగా గత అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రొఫెసర్ ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం గత గురువారం ఎన్నికలను నిర్వహించింది. సుమారు 15 ఏళ్లపాటు అణచివేతకు గురయ్యామని చెప్పుకొచ్చిన బీఎన్‌పీ, ఈ ఎన్నికల్లో 209 స్థానాలను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. ఈ ఎన్నికలు పండుగ వాతావరణంలో, అత్యంత పారదర్శకంగా జరిగాయని పరిశీలకులు అభివర్ణించారు. ఢాకాలో జరిగిన ఈ ప్రతిష్ఠాత్మక ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత్ తరఫున లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరై, నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు.

లక్ష్యం.. జాతీయ సమగ్రత

బాధ్యతలు చేపట్టిన అనంతరం ప్రధాని తారిఖ్ రెహమాన్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. విభేదాలను వీడి 'జాతీయ ఐక్యత'ను స్థాపించడమే తన ప్రథమ ప్రాధాన్యమని ప్రకటించారు. దేశంలో రాజకీయ, ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకురావడంతో పాటు, శాంతిభద్రతలను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. చట్టబద్ధమైన పాలనను అందిస్తూ అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని ముందుకు సాగుతామని ఆయన పేర్కొన్నారు. ఎన్నికైన కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో బంగ్లాదేశ్ ప్రజల్లో సరికొత్త ఆశలు చిగురించాయి.

బంగ్లాదేశ్ ఇక ఎవరికీ తలవంచదు: యూనస్

బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ ముఖ్య సలహాదారు ముహమ్మద్ యూనస్ తన 18 నెలల పాలన ముగియడంతో దేశాన్ని ఉద్దేశించి భావోద్వేగ ప్రసంగం చేశారు. బంగ్లాదేశ్ ఇకపై ఏ దేశానికీ లొంగి ఉండే దేశం కాదని, సార్వభౌమాధికారం, గౌరవంతో కూడిన స్వతంత్ర విదేశీ విధానాన్ని పునరుద్ధరించామని ఆయన స్పష్టం చేశారు. తన హయాంలో 130 కొత్త చట్టాలు తెచ్చామని, ప్రజాస్వామ్య విలువల కోసం పోరాడామని పేర్కొంటూ.. అభివృద్ధిలో సముద్ర తీరం కీలక ఆస్తి అని అభివర్ణించారు. కొత్తగా ఎన్నికైన బీఎన్‌పీ ప్రభుత్వానికి బాధ్యతలు అప్పగిస్తూ ఆయన వీడ్కోలు పలికారు.