
బంగ్లాదేశ్ జాతీయ గీతం పాడిన కాంగ్రెస్ నేతలపై దేశద్రోహం కేసు: అస్సాం సీఎం
అస్సాం రాష్ట్రంలోని శ్రీభూమి జిల్లాలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో భారత జాతీయ గీతానికి బదులుగా బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని ఆలపించినందుకు ఆ జిల్లా కాంగ్రెస్ నాయకులపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పోలీసులను ఆదేశించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని పాడడం అంటే, ఈశాన్య భారతదేశం బంగ్లాదేశ్‌లో భాగమని కొందరు బంగ్లా నాయకులు చేస్తున్న వాదనకు కాంగ్రెస్ మద్దతు తెలిపినట్టేనని ఆరోపించారు. ఇక అసోం కాంగ్రెస్ మాత్రం బీజేపీ “ప్రజల దృష్టి మళ్లించేందుకు తప్పుడు వివాదం సృష్టిస్తోంది” అని పేర్కొంది.
ముఖ్యమంత్రి మాట్లాడుతూ “కాంగ్రెస్ సమావేశం భారత జాతీయ గీతం స్థానంలో బంగ్లాదేశ్ జాతీయ గీతంతో ప్రారంభమైంది. ఇది భారత ప్రజలకు, భారత జాతీయ గీతానికి అవమానం” అని అన్నారు. శ్రీభూమి జిల్లా కాంగ్రెస్ కమిటీ, నాయకులపై దేశద్రోహం కింద వివిధ చట్టపరమైన సెక్షన్లతో కేసు నమోదు చేయమని ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు ఇచ్చానని సీఎం తెలిపారు.
మంగళవారం శ్రీభూమి పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన సేవాదళ్ సమావేశంలో, నేతలు నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన బంగ్లాదేశ్ జాతీయ గీతం “అమర్ సోనార్ బంగ్లా” పాటలోని రెండు పంక్తులు పాడిన తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించారు.
“బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని మన జాతీయ గీతానికి ఇచ్చే గౌరవంతో సమానంగా పాడారు. ఇది అసోంలో అంగీకారయోగ్యం కాదు” అని సీఎం అన్నారు. కాంగ్రెస్ నాయకులను పోలీసులు త్వరలో అరెస్టు చేస్తారని, తదనుగుణంగా న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని సీఎం ప్రకటించారు. “ఇది కొందరు బంగ్లాదేశ్ ప్రముఖులు చెబుతున్న కొత్త వాదనకు అనుగుణంగా ఉంది. అంటే ఈశాన్య భారతం బంగ్లాదేశ్‌లో భాగమని. శ్రీభూమి జిల్లా కాంగ్రెస్ కమిటీ పాడిన జాతీయ గీతం ఆ వాదనకు పరోక్ష మద్దతుగా కనిపిస్తోంది” అని సీఎం అన్నారు.
ఈ ఘటన వీడియో మంగళవారం బయటకు వచ్చిన తర్వాత, అస్సాం మత్స్యశాఖ మంత్రి కృష్ణేందు పాల్ స్పందిస్తూ “కాంగ్రెస్‌నే పాకిస్థాన్‌కి జన్మనిచ్చింది. బంగ్లాదేశ్ కూడా అప్పట్లో పాకిస్థాన్‌లో భాగం. అందుకే బంగ్లాదేశ్‌పై తమ ప్రేమను చూపించేందుకు కాంగ్రెస్ నాయకులు ఆ దేశ జాతీయ గీతం పాడారు” అని ఆరోపించారు. ఈ సంఘటనపై నిజం వెలుగులోకి వచ్చిన తర్వాత, జిల్లా కలెక్టర్‌కు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
వివాదంపై స్పందించిన శ్రీభూమి జిల్లా అధ్యక్షుడు తపస్ పుర్కాయస్థ మాట్లాడుతూ, “రవీంద్రనాథ్ ఠాగూర్‌తో రాజకీయాలు చేయకండి. 85 ఏళ్ల వయసున్న కవి విదుభూషణ్ దాస్ ఆ పాటలో రెండు పంక్తులే పాడారు. ఆ పాటను విమర్శించడం అంటే ఠాగూర్‌ను అవమానించడమే" అని అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ కూడా బీజేపీని విమర్శిస్తూ “ప్రజల దృష్టి మళ్లించేందుకు బీజేపీ అవసరం లేని వివాదాలు సృష్టిస్తోంది” అని అన్నారు. “ఠాగూర్ సాహిత్య వారసత్వాన్ని బీజేపీ అర్థం చేసుకోలేకపోతోంది. ఎన్నికల సమయంలో మాత్రమే బెంగాలీ భాషాభిమానులను గుర్తు చేసుకుంటుంది, కానీ వారి సంస్కృతి, భాష, ఆలోచన లోతును ఎప్పుడూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు” అని గొగోయ్ అన్నారు. ‘అమర్ సోనార్ బంగ్లా’ పాటను రవీంద్రనాథ్ ఠాగూర్ 1905లో బ్రిటిష్ పాలనలో బెంగాల్ విభజన జరిగినప్పుడు రచించారు.
