
బంగ్లాదేశ్ చెర నుంచి విముక్తి.. విశాఖ చేరుకున్న విజయనగరం మత్స్యకారులు
బంగ్లాదేశ్ నావికాదళం అదుపులోకి తీసుకున్న విజయనగరం జిల్లాకు చెందిన తొమ్మిది మంది మత్స్యకారుల ఎదురు చూపులు ఎట్టకేలకు ఫలించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో బంగ్లాదేశ్ నుంచి విడుదలైన వారు ఆదివారం రాత్రి విశాఖపట్నం తీరానికి సురక్షితంగా చేరుకున్నారు. ఈ విషయాన్ని విజయనగరం జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ అధికారికంగా ప్రకటించారు.
భోగాపురం మండలం కొండ్రాజుపాలెంకు చెందిన మరుపల్లి చిన్నఅప్పన్న, మరుపల్లి రమేష్, సూరాడ అప్పలకొండ, మరుపల్లి ప్రవీణ్, సురపతి రాము, అప్పలకొండ, అలాగే పూసపాటిరేగ మండలం తిప్పలవలసకు చెందిన నక్కా రమణ, వాసపల్లి సీతయ్య, మైలపల్లి అప్పన్న ఈ తొమ్మిది మంది మత్స్యకారులు గత ఏడాది అక్టోబర్ 13న విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి చేపల వేట నిమిత్తం సముద్రంలోకి బయలుదేరారు.
అసలేం జరిగింది అంటే…
ఐఎన్డిఏపి-వి5-ఎంఎమ్-75 నంబరు గల యాంత్రిక పడవపై వేట సాగిస్తుండగా, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, దిశా భ్రమ కారణంగా అక్టోబర్ 22వ తేదీ వేకువజామున సుమారు 2 గంటల సమయంలో వారు పొరపాటున అంతర్జాతీయ సముద్ర సరిహద్దులు దాటి బంగ్లాదేశ్ జలాల్లోకి ప్రవేశించారు. దీంతో అక్కడి కోస్ట్ గార్డ్స్ వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ విషయం సమీపంలో ఉన్న మరో ఫిషింగ్ నౌక సిబ్బంది ద్వారా భారత అధికారులకు తెలియడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. మత్స్యకారుల కుటుంబాల్లో ఆందోళన నెలకొనగా కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం వెంటనే రంగంలోకి దిగింది. బంగ్లాదేశ్ అధికారులతో నిరంతర సంప్రదింపులు జరుపుతూ దౌత్యపరమైన ప్రయత్నాలు చేపట్టింది.
పత్రాల పరిశీలన, ప్రామాణిక నిబంధనల ప్రక్రియ పూర్తయిన అనంతరం బంగ్లాదేశ్ ప్రభుత్వం గత నెల 27న మత్స్యకారుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తదుపరి రోజు వారు సముద్ర మార్గంలో బయలుదేరి ఆదివారం రాత్రి విశాఖ తీరానికి చేరుకున్నారు. రాత్రి వేళ తీరానికి రాకుండా తీరానికి సమీపంలోని సముద్రంలోనే ఉండి సోమవారం ఉదయం తీరానికి చేరుకున్నారు.విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద స్థానిక కోస్ట్ గార్డ్స్, విజయనగరం జిల్లా పోలీసుల సమక్షంలో మత్స్యకారులకు స్వాగతం పలికారు. అనంతరం వారికి ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన పత్రాల పరిశీలన పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, మత్స్యకారులు వేట సాగించే సమయంలో అంతర్జాతీయ సరిహద్దుల పట్ల అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని ఆధునిక నావిగేషన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. నెలల తరబడి బందీలుగా ఉన్న తమ వారు క్షేమంగా తిరిగి రావడంతో విజయనగరం జిల్లాలోని వారి గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సంక్లిష్ట ప్రక్రియలో సహకరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మత్స్యకార కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపారు.
