Let's talk: editor@tmv.in
బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వంతో సంబంధాల బలోపేతానికి భారత్ ఆసక్తి

బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వంతో సంబంధాల బలోపేతానికి భారత్ ఆసక్తి

Pinjari Chand
23 ఫిబ్రవరి, 2026

బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో, ఆ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు నిర్మించాలనే ఆకాంక్ష భారత్ వ్యక్తం చేసింది. ఢాకాలో భారత హై కమిషనర్ ప్రణయ్ వర్మ ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రణయ్ వర్మ బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి డా. ఖలీలుర్రహ్మన్ , విదేశాంగ శాఖ రాష్ట్రమంత్రి షమా ఓబైద్ ఇస్లాంలను బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖలో కలిశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇది తన తొలి మర్యాదపూర్వక భేటీ అని ఆయన తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల అనంతరం, ఫిబ్రవరి 13న భారత ప్రధాని నరేంద్ర మోడీ బంగ్లాదేశ్ కొత్త ప్రధాని తారిఖ్ రహమాన్ కు అభినందన సందేశం పంపినట్లు వర్మ తెలిపారు. అదే రోజు ఇద్దరు నేతలు ఫోన్ ద్వారా కూడా మాట్లాడినట్లు చెప్పారు. ఫిబ్రవరి 17న జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఢాకా వెళ్లి భారత ప్రభుత్వం తరఫున హాజరైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోడీ తరఫున లేఖను బంగ్లాదేశ్ ప్రధానికి అందజేశారని చెప్పారు.

భారత్–బంగ్లాదేశ్ చారిత్రక సంబంధాలను మరింత బలోపేతం చేయాలని భారత్ ఆకాంక్షిస్తున్నట్లు వర్మ వెల్లడించారు. ప్రజల మధ్య అనుసంధానాన్ని పెంపొందిస్తూ పరస్పర ప్రయోజనాల ఆధారంగా సానుకూల, నిర్మాణాత్మక దిశగా కలిసి పనిచేయాలని భారత్ ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా బంగ్లాదేశ్ కొత్త ప్రధానికి శుభాకాంక్షలు తెలియజేసి, భారతదేశాన్ని త్వరలో సందర్శించాలని ప్రధాని మోడీ తరఫున వ్యక్తిగత ఆహ్వానం అందజేసినట్లు ఏఎన్ఐనివేదించింది.