
బంగ్లాదేశ్ ఎన్నికల బరిలో తారిఖ్ రెహ్మాన్.. 17 ఏళ్ల తర్వాత స్వదేశానికి వచ్చి నామినేషన్
బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ)కి చెందిన కీలక నేత తారీఖ్ రెహ్మాన్ రాబోయే జాతీయ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఆయన తరఫున పార్టీ నాయకులు సోమవారం ఢాకా-17 నియోజకవర్గం నుంచి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు అని డైలీ స్టార్ పత్రిక వెల్లడించింది. రాబోయే 13వ జాతీయ పార్లమెంట్ (జాతీయ సంగ్సద్) ఎన్నికలు ఫిబ్రవరి 2026లో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో తారీఖ్ రెహ్మాన్ ఢాకా-17 నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఢాకాలోని సెగున్‌బగిచా ప్రాంతంలో ఉన్న ఢాకా డివిజనల్ కమిషనర్ కార్యాలయంలో తారీఖ్ రెహ్మాన్ నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. ఆయన తరఫున బీఎన్‌పీ చైర్‌పర్సన్ సలహాదారు అబ్దుస్ సలాం, అలాగే డాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు ఫర్హాద్ హలీం డోనార్ కలిసి ఈ పత్రాలను సమర్పించారు.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, ఆదివారం తారీఖ్ రెహ్మాన్ నుంచి నామినేషన్ పత్రాలను సేకరించారు. అంతకు ముందు, శనివారం ఆయన ఢాకా-17 నియోజకవర్గానికి ఓటరుగా నమోదు చేసుకున్నారు. దీనితో, అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని బీఎన్‌పీ సీనియర్ నేతలు ఆయనను కోరినట్లు తెలిపారు.
17 ఏళ్ల తర్వాత స్వదేశానికి తారీఖ్ రెహ్మాన్
17 సంవత్సరాల స్వచ్ఛంద ప్రవాస జీవితం అనంతరం తారీఖ్ రెహ్మాన్ డిసెంబర్ 25న ఢాకాకు తిరిగి వచ్చారు. గతేడాది జూలై ఉద్యమం తర్వాత అప్పటి ప్రధాని షేక్ హసీనాను అధికారం నుంచి తప్పించిన పరిణామాల అనంతరం ఆయన తిరుగు ప్రయాణం బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక ఘట్టంగా మారింది. స్వదేశానికి వచ్చిన సందర్భంగా తారీఖ్ రెహ్మాన్ మాట్లాడుతూ, బంగ్లాదేశ్‌ను సమానత్వం, భద్రత కలిగిన దేశంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పనిచేస్తానని చెప్పారు. తనకు ఇచ్చిన ఆత్మీయ స్వాగతానికి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. “17 సంవత్సరాల తర్వాత మాతృభూమి నేలపై అడుగుపెట్టిన రోజు నా జీవితంలో మరచిపోలేని క్షణం. ఢాకా వీధుల్లో కనిపించిన ప్రజల ప్రేమ, ఆశీస్సులు నన్నెంతో భావోద్వేగానికి గురి చేశాయి” అని ఆయన సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
ప్రవాస జీవితం నుంచి పార్టీ నాయకత్వం వరకు
2007-08లో సైన్యం మద్దతుతో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం సమయంలో తారీఖ్ రెహ్మాన్ అరెస్టయ్యారు. విడుదల అనంతరం కుటుంబంతో కలిసి లండన్‌కు వెళ్లిన ఆయన, అప్పటి నుంచి దేశానికి దూరంగా ఉన్నారు. 2018లో బీఎన్‌పీ నేత, మాజీ ప్రధాని ఖాలేదా జియాకు జైలు శిక్ష పడిన తర్వాత, పార్టీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో తారీఖ్ రెహ్మాన్‌ను కార్యనిర్వాహక చైర్మన్‌గా నియమించారు. గత ఏడేళ్లుగా లండన్ నుంచే వీడియో కాల్స్ ద్వారా పార్టీని నడిపించారు. గత ఏడాది ఆగస్టు 5న అధికార మార్పు జరిగిన తర్వాత, అవామీ లీగ్ పాలనలో ఆయనపై నమోదైన కేసులు ఒక్కొక్కటిగా కొట్టివేయబడడంతో స్వదేశానికి తిరిగివచ్చే మార్గం సుగమమైంది.
మొదట తారిఖ్ రెహ్మాన్ 'బోగురా-6' నియోజకవర్గం నుండి ఎన్నికల్లో పోటీ చేస్తారని బీఎన్‌పీ పార్టీ ప్రకటించింది. కానీ, అనూహ్యంగా ఇప్పుడు ఆయన దేశ రాజధానిలోని 'ఢాకా-17' స్థానం నుండి బరిలోకి దిగడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. తన సొంత ప్రాంతాన్ని వదిలి రాజధాని నుండి పోటీ చేయాలని ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
