Let's talk: editor@tmv.in
బంగ్లాదేశ్‌లో హై అలర్ట్.. నవంబర్ 17న షేక్ హసీనా కేసులపై తీర్పు

బంగ్లాదేశ్‌లో హై అలర్ట్.. నవంబర్ 17న షేక్ హసీనా కేసులపై తీర్పు

Shaik Mohammad Shaffee
14 నవంబర్, 2025

బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాపై దాఖలైన మానవత్వానికి వ్యతిరేక నేరాల కేసుల్లో తీర్పును నవంబర్ 17న వెల్లడించనున్నట్లు బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ఐసీటీ-బీడీ) గురువారం ప్రకటించింది. ఈ తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరిగాయి. హసీనా పార్టీ 'అవామీ లీగ్' పిలుపునిచ్చిన 'లాక్‌డౌన్' కారణంగా సాధారణ జనజీవనం స్తంభించింది.

రాజధాని ఢాకాలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉన్న ప్రత్యేక కోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల ట్రిబ్యునల్ నవంబర్ 17న తీర్పును వెలువరించేందుకు తేదీని ఖరారు చేసింది. ఐసీటీ-బీడీ చైర్ జస్టిస్ మొహమ్మద్ గులాం మోర్టుజా మజుమ్దర్ ఈ తేదీని నిర్ణయించారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా, అప్పటి హోం మంత్రి కమల్‌లను కోర్టు 'పరారీలో ఉన్నవారు'గా ప్రకటించింది. దీంతో వారిపై గైర్హాజరీలో విచారణ జరిగింది. కోర్టు విచారణను అక్టోబర్ 23నే ముగించింది. సుమారు 28 పనిదినాల పాటు జరిగిన ఈ విచారణలో మొత్తం 54 మంది సాక్షులు తమ వాంగ్మూలాలను సమర్పించారు.

ఈ కేసులో ప్రధానంగా గతేడాది (2024 జూలై) విద్యార్థుల నేతృత్వంలో జరిగిన ఉద్యమం సందర్భంగా నిరసనకారులపై జరిగిన దాడులు, హత్యలు, చిత్రహింసలు, అమానవీయ చర్యలకు ఆదేశాలు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ట్రిబ్యునల్ ప్రధాన ప్రాసిక్యూటర్ మొహమ్మద్ తాజుల్ ఇస్లాం గత నెలలో హసీనాను ఈ నేరాలకు "మాస్టర్‌మైండ్" అని పేర్కొంటూ ఆమెకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు.

ఈ కేసులో మాజీ పోలీసు చీఫ్ చౌదరి అబ్దుల్లా అల్-మామున్ స్వయంగా విచారణను ఎదుర్కొని అప్రూవర్‌గా మారారు. ఆయన తన పాత్రను అంగీకరిస్తూ, జులై తిరుగుబాటును అణచివేయడంలో తనతో పాటు మిగిలిన ఇద్దరు సహ నిందితుల (హసీనా, కమల్) పాత్రను కోర్టుకు వివరించారు. ఈ కీలక సాక్ష్యం హసీనాకు వ్యతిరేకంగా కేసును బలపరిచే అవకాశం ఉంది.

దేశంలో హై అలర్ట్

తీర్పు తేదీ ప్రకటన బంగ్లాదేశ్ రాజకీయాలను మరింత వేడెక్కించింది. పదవి కోల్పోయిన షేక్ హసీనా, ఆమె అవామీ లీగ్ పార్టీ (ప్రస్తుతం నిషేధిత పార్టీ) ఈ విచారణకు నిరసనగా గురువారం దేశవ్యాప్త 'లాక్‌డౌన్'కు పిలుపునిచ్చాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో భద్రతా దళాలు, సైన్యం, పోలీసులు విమానాశ్రయాలు, కీలక స్థావరాల వద్ద మోహరించారు. ప్రస్తుతం అవామీ లీగ్ కార్యకలాపాలను, అనుబంధ సంస్థలను నోబెల్‌ బహుమతి గ్రహీత మహమ్మద్‌ యునస్‌ నేతృత్వంలో నడుస్తున్న మధ్యంతర ప్రభుత్వం నిషేధించినందున, పార్టీ నాయకులు సోషల్‌ మీడియాలో గోప్యమైన ప్రదేశాల నుండి పిలుపులు ఇస్తున్నారు. గత రెండు రోజులుగా ఢాకా సహా బంగ్లాదేశ్‌ లోని పలు ప్రాంతాల్లో వాహనాలకు నిప్పుపెట్టడం, బాంబులు పేల్చడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. అవామీ లీగ్‌ అనుచరులు దేశవ్యాప్తంగా ఆకస్మిక ర్యాలీలు కూడా నిర్వహించారు. ఇదే సమయంలో పోలీసులు పార్టీ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేయడానికి ఆపరేషన్లు ప్రారంభించగా, ప్రధాన రహదారులపై చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు చేపట్టారు.

2024 జూలైలో విద్యార్థుల నేతృత్వంలో జరిగిన తిరుగుబాటుతో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది. ఆగస్టు 5, 2024న ఆమె భారత్‌కు పారిపోయారు. ఆ తర్వాత మహమ్మద్ యునస్‌ ప్రధాన సలహాదారుగా ఉన్న మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటైంది. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం, ఆ జూలై నిరసనల్లో దాదాపు 1,400 మంది మరణించినట్లు అంచనా.

1971 బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో జరిగిన మానవత్వానికి వ్యతిరేక నేరాలను విచారించేందుకు షేక్ హసీనా ప్రభుత్వం ప్రారంభంలోనే అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. ఆమె పాలనలో ఈ ట్రైబ్యునల్ జమాత్-ఎ-ఇస్లామీ నేతలపై యుద్ధ నేరాల కేసులు విచారించింది. ప్రస్తుతం మహమ్మద్ యునస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం చట్టపరమైన మార్పుల తర్వాత అదే ట్రైబ్యునల్‌లో షేక్ హసీనా మీద విచారణ ప్రారంభించింది. సాక్ష్యాలు, వాంగ్మూలాలు పూర్తయ్యాయి. ఇప్పుడు ట్రైబ్యునల్ నవంబర్ 17న మాజీ ప్రధానమంత్రిపై తీర్పు ఇవ్వనుంది.

మరోవైపు పరారీలో ఉన్న షేక్ హసీనాకు భారతీయ మీడియా యాక్సెస్ కల్పించడంపై నిరసన తెలిపేందుకు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ బుధవారం ఢాకాలోని భారత డిప్యూటీ హైకమిషనర్‌ను పిలిపించింది. కాగా నవంబర్ 17న రాబోయే ఈ తీర్పు బంగ్లాదేశ్ అంతర్గత రాజకీయాలపై మాత్రమే కాకుండా, భారత్-బంగ్లాదేశ్ మధ్య దౌత్య సంబంధాలపై కూడా కీలక ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.

బంగ్లాదేశ్‌లో హై అలర్ట్.. నవంబర్ 17న షేక్ హసీనా కేసులపై తీర్పు - Tholi Paluku