
బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి హత్య!
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులు రోజురోజుకూ పెరిగిపోతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఒకటి తర్వాత ఒకటిగా హింసాత్మక ఘటనలు వెలుగులోకి వస్తుండటంతో అక్కడి పరిస్థితులపై ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చమొదలైంది. ఈ క్రమంలోనే తాజాగా బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి హత్యకు గురయ్యాడు. మైమెన్సింగ్ జిల్లా భాలుకా ఉపజిలాలోని ఓ స్వెటర్స్ ఫ్యాక్టరీలో విధులు నిర్వహిస్తున్న అంసార్ సభ్యుడు బజేంద్ర బిశ్వాస్ (40)ను సహోద్యోగి కాల్చి చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో నిందితుడైన అంసార్ సభ్యుడు నోమాన్ మియాను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ ఘటన సోమవారం (డిసెంబర్ 29) సాయంత్రం సుమారు 6.30 గంటలకు భాలుకా ఉపజిలాలోని మెహ్రాబరీ ప్రాంతంలో ఉన్న ‘సుల్తానా స్వెట్టర్స్ లిమిటెడ్’ ఫ్యాక్టరీలో చోటుచేసుకుంది. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ హిందూ బుద్ధ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి మొనింద్ర నాథ్ ధృవీకరించారు.
మృతుడు బజేంద్ర బిశ్వాస్ సిల్హెట్ సదర్ ఉపజిలాలోని కదిర్‌పూర్ గ్రామానికి చెందిన ప్రబిత్ర బిశ్వాస్ కుమారుడని సమాచారం. నిందితుడు నోమాన్ మియా సునామ్గంజ్ జిల్లా తాహెర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలుటురి బజార్ ప్రాంతానికి చెందిన లుత్ఫర్ రహ్మాన్ కుమారుడని పోలీసులు తెలిపారు.
ఏం జరిగింది?
పోలీసులు, స్థానిక వర్గాల సమాచారం ప్రకారం, ఘటన జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో మొత్తం 20 మంది అన్సార్ భద్రతా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో నోమాన్ మియా, బజేంద్ర బిశ్వాస్ ఇద్దరూ ఒకే గదిలో కూర్చుని ఉన్నారు. అప్పుడే నోమన్ చేతిలో ఉన్న తుపాకీ (షాట్‌గన్) నుంచి ఒక్కసారిగా కాల్పులు జరగడంతో బుల్లెట్ నేరుగా వెళ్లి బజేంద్ర ఎడమ తొడకు తగిలింది. తీవ్ర రక్తస్రావం కావడంతో తోటి సిబ్బంది వెంటనే ఆయనను దగ్గరలోని భాలుకా ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కానీ, అప్పటికే బజేంద్ర ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడ ఉన్న వైద్యులు ధృవీకరించారు.
ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న అంసార్ సభ్యుడు ఎపీసీ ఎం.డి. అజహర్ అలీ మాట్లాడుతూ, నోమాన్ మియా అకస్మాత్తుగా బజేంద్ర తొడపై తుపాకీ పెట్టి “కాల్చనా?” అని అడిగి వెంటనే కాల్పులు జరిపాడని తెలిపారు. ఘటనకు ముందు వారి మధ్య ఎలాంటి వాగ్వాదం జరగలేదని కూడా చెప్పారు. కాల్పుల తర్వాత నోమాన్ అక్కడి నుంచి పారిపోయినట్టు తెలిపారు.
మైమెన్సింగ్ జిల్లా అదనపు పోలీస్ సూపరింటెండెంట్ (ఫైనాన్స్ & అడ్మినిస్ట్రేషన్) ఎం.డి. అబ్దుల్లా అల్ మమూన్ మాట్లాడుతూ, నిందితుడిని వెంటనే అరెస్ట్ చేశామని చెప్పారు. ఘటనకు గల అసలు కారణాలపై లోతైన దర్యాప్తు చేపట్టామని తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం మైమెన్సింగ్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రి మార్చురీకి తరలించామని, చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు.
వరుస హత్యలతో భయం
బంగ్లాదేశ్‌లో గత రెండు వారాల్లోనే ఇది మూడవ హిందూ వ్యక్తి హత్య కావడం గమనార్హం. ఇటీవలే ఇదే జిల్లాలో 'దీపు చంద్ర దాస్' అనే వ్యక్తిని మతపరమైన ఆరోపణలతో మూక దాడి చేసి చంపగా, మరో ఘటనలో 'అమృత్ మండల్' అనే వ్యక్తి బలయ్యాడు. ఈ వరుస ఘటనలతో అక్కడ నివసిస్తున్న హిందూ మైనారిటీలలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
